సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సంఘం అనుమతిస్తే జీఐఎస్‌లో తొలిరోజే కొత్త పారిశ్రామిక పాలసీ 2023–28ని ప్రకటిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారితే పక్షం రోజుల తర్వాత నూతన విధానాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనకున్న ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాలకు దీటుగా, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పాలసీని రూపొందించాలని సీఎం వైఎస్ జగన్‌ఆదేశించారని తెలిపారు. విశ్వసనీయతతో కూడిన జగన్ నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుందన్న భరోసాను పారిశ్రామికవేత్తలకు కల్పించామన్నారు.
పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైన అన్ని అనుమతులు, భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంవోయూలను ఆరు నెలల్లోగా గ్రౌండ్ చేస్తే అదనపు సాయంతోపాటు పెట్టుబడుల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం సూచించారని చెప్పారు. ఎంవోయూల్లో 90శాతం వాస్తవ రూపం దాల్చేలా చూస్తామన్నారు. పెట్టుబడుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని సమీక్షిస్తామన్నారు. బ్రాండ్ జగన్ పేరిట పెట్టుబడులను ఆకర్షిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనే ఈ సదస్సు ఉద్దేశమని తెలిపారు.
శుక్రవారం ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీఐఎస్ సదస్సును ప్రారంభిస్తారని అమర్‌నాథ్ తెలిపారు. ప్రముఖుల సమక్షంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక సెషన్ ఉంటుందన్నారు. 150కి పైగా ఏర్పాటవుతున్న స్టాళ్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపార అవకాశాలపై 500 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. సమ్మిట్‌కు 46 దేశాల ప్రముఖులు, 8 నుంచి 10మంది రాయబారులు వస్తున్నారని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం రాత్రి విందు ఏర్పాటు చేశామన్నారు.
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం..
జీఐఎస్ ద్వారా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, 14 కీలక రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించామని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. తొలిరోజు కొన్ని ఎంవోయూలు ఉంటాయన్నారు.
ఆదాయ వనరులు పెరిగేలా..
రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామిక ప్రగతితో జీఐఎస్ వేదికగా భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయ వనరులు పెరిగేలా సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు. నెలన్నరగా అధికార యంత్రాంగం శ్రమించి జీఐఎస్ కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని అభినందించారు.
వనరులు పుష్కలం..
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు కొత్త పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందన్నారు. అడ్వాంటేజ్ జోన్ పేరుతో ప్రత్యేక విధానాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.
పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం అర్హత ఉన్న కంపెనీలకు ఎస్‌జీఎస్‌టీలో రాయితీలిస్తామన్నారు. రాయితీలపై అన్ని రకాల నిబంధనలు, విధానాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. సమ్మిట్‌లో వాస్తవ రూపం దాల్చే ఎంవోయూలకే ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ హయాంలో మాదిరిగా బూటకపు పెట్టుబడులుండవని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment