GIS
-
ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. పెరగనున్న టేక్ హోమ్ శాలరీ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2013 సెప్టెంబర్ 1తరువాత జాబ్‌లో చేరిన గవర్నమెంట్ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్లలను నిలిపివేయనున్నట్లు (అమౌంట్ కట్ చేయదు) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ 2024 జూన్ 21న దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం 2013 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్‌లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. వీరికి యధావిధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌట్ డిడక్షన్ అవుతుంది. కాబట్టి 2013 సెప్టెంబర్ 1 తరువాత జాబ్‌లో చేరిన ఆయా కేటగిరిలో ఉన్న ఉద్యోగులు వచ్చే నెల నుంచి ఎక్కువ వేతనం పొందనున్నారు.2013 సెప్టెంబర్ 1 తరువాత ఉద్యోగంలో చేరినవారికి ఇప్పటి వరకు డిడక్షన్ అయిన మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. జీఐఎస్ పరిధి నుంచి వీరిని శాశ్వతంగా తొలగించనున్నారు. జీఐఎస్ కింద తగ్గింపులు నిలిపివేయడంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు కూడా పెరగనున్నాయి.జీఐఎస్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే?గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (జీఐఎస్) అనేది 1982 జనవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరుతో అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారు ప్రమాదాలకు గురైనప్పుడు సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. -
ఫుడ్ ప్రాసెసింగ్‌కు జీఐఎస్ బూస్ట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమల హబ్‌గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు పాడి, మత్స్య ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఆహారశుద్ధిలోనూ అగ్రగామిగా నిలుస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలనిస్తోంది. గతేడాది విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్(జీఐఎస్)లో జరిగిన మెజార్టీ ఒప్పందాలు ఏడాది తిరగకుండానే కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ సదస్సులో రూ.5,765 కోట్ల విలువైన 33 ఒప్పందాలు జరగ్గా, వీటి ద్వారా ప్రత్యక్షంగా 12,600 మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా వేశారు. ఇప్పటికే వీటిలో రూ.1,350 కోట్ల పెట్టుబడితో ఏటా 11.90 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు మేజర్ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా పరోక్షంగా 5,380 మందికి ఉపాధి లభిస్తుండగా, 23 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతోంది. మరొక వైపు రూ.2,227 కోట్ల విలువైన మరో ఆరు పరిశ్రమలు శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో అధికారులు వేగంగా అనుమతులు మంజూరు చేయడం వల్ల జీఐఎస్ ఒప్పందాల్లో 60 శాతం పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలివే.. ఏలూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రూ.1,350 కోట్ల పెట్టుబడితో నాలుగు భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ► అనా ఓలీయో ప్రైవేట్ లిమిటెట్ సంస్థ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద రూ.650 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 1,000 టన్నుల సామర్థ్యంతో పామ్ ఆయిల్, రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో సన్‌ఫ్లవర్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా 2,100 మందికి నేరుగా ఉపాధి కల్పిస్తోంది. ► డీపీ కోకోవా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతిలోని శ్రీసిటీ వద్ద రూ.350 కోట్ల పెట్టుబడితో కోకో బట్టర్, ఫౌడర్, మాస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఏటా 40 వేల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ► గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం వద్ద రూ.250 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఏడాదికి 4.20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,150 మందికి ఉపాధి కల్పిస్తోంది. ► గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద రూ.100 కోట్లతో ఎడిబుల్ ఆయిల్ రిఫనరీ అండ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌తో పాటు రోజుకు 200 టన్నుల సామర్థ్యంతో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ ద్వారా 1,130 మందికి ఉపాధి కల్పించగా, 5 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. నిర్మాణ దశలో ఉన్నవి ఇవీ.. తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో రూ.2227 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఆరు పరిశ్రమలకు భూమిపూజ జరగ్గా, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏటా 3,39,300 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలతో 2,180 మందికి ఉపాధి లభించనుండగా, 24,100 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ► మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ తిరుపతి శ్రీసిటీ వద్ద రూ.1,600 కోట్ల పెట్టుబడితో చాక్లెట్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. కాడ్బరీ, టాంగ్, బోర్నవిటా, ఒరియా, ఫైవ్‌స్టార్ వంటివి ఈ కంపెనీ ఉత్పత్తులే. ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవాను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చనుంది. ► సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజస్ కంపెనీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కువ్వకొల్లి గ్రామం వద్ద రూ.400 కోట్ల పెట్టుబడితో భారీ ఇన్స్టెంట్ కాఫీ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. ఏటా 16వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కాబోతున్న ఈ పరిశ్రమ ద్వారా 950 మందికి ఉపాధి కల్పించనుండగా, 2,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► శ్రీ వెంకటేశ్వర బయోటెక్ కంపెనీ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొమ్మూరు వద్ద రూ.144 కోట్లతో రోజుకు 400 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొక్కజొన్న పిండి తయారీ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 310 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం వద్ద ఒరిల్ ఫుడ్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ఇన్స్టంట్ విజిటబుల్ చట్నీస్ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. ఏటా 7,500 టన్నుల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేస్తూ రెడీమేడ్ చట్నీలు తయారు చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 175 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్లతో అనకాపల్లి జిల్లా కొండవాటిపూడి వద్ద కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఏటా వెయ్యి టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి కల్పించనుండగా, వెయ్యి మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొనాడ వద్ద బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.13 కోట్ల పెట్టుబడితో పొటాట చిప్స్, పాస్తా, నూడిల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఏటా 3,600 టన్నుల గోధుములు, 480 టన్నుల మిల్లెట్స్, 720 టన్నుల పొటాటో ప్రాసెస్ చేయనుంది. 45 మందికి ఉపాధి లభించనుండగా, 100 రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా జీఐఎస్‌లో జరిగిన మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
జీఐఎస్ ఒప్పందాల్లో మరో 36 కార్యరూపంలోకి తేవాలి
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు (జీఐఎస్)లో పరిశ్రమల శాఖకు చేసుకొన్న అవగాహన ఒప్పందాల్లో మరో 36 ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలని, వాటికి డిసెంబరు నెలాఖరులోగా శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. జీఐఎస్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి రూ. 3.41 లక్షల కోట్ల పెట్టుబడులతో 2.38 లక్షల మందికి ఉపాధి కల్పించే 107 ఒప్పందాలు జరగ్గా, ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులు సిద్ధం చేయాలని ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాలన్నీ త్వరితగతిన కార్యరూపం దాల్చాలని, ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగంగా ఏర్పాటవ్వాలని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను ఆదేశించారు. వీటిపై నెలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. అంతకు ముందు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న కంపెనీల ఏర్పాటుపై ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయండి పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై కూడా పరిశ్రమలు, ఏపీఐఐసీ తదితర విభాగాల అధికారులతో సీఎస్ సమీక్షించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను వేగవంతం చేయాలని, గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జువ్వలదిన్నె, నిజాంపేట, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ పవర్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈసీ అనుమతితో కొత్త పారిశ్రామిక పాలసీ!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సంఘం అనుమతిస్తే జీఐఎస్‌లో తొలిరోజే కొత్త పారిశ్రామిక పాలసీ 2023–28ని ప్రకటిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారితే పక్షం రోజుల తర్వాత నూతన విధానాన్ని వెల్లడిస్తామని చెప్పారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనకున్న ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాలకు దీటుగా, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పాలసీని రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ఆదేశించారని తెలిపారు. విశ్వసనీయతతో కూడిన జగన్ నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుందన్న భరోసాను పారిశ్రామికవేత్తలకు కల్పించామన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైన అన్ని అనుమతులు, భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంవోయూలను ఆరు నెలల్లోగా గ్రౌండ్ చేస్తే అదనపు సాయంతోపాటు పెట్టుబడుల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం సూచించారని చెప్పారు. ఎంవోయూల్లో 90శాతం వాస్తవ రూపం దాల్చేలా చూస్తామన్నారు. పెట్టుబడుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని సమీక్షిస్తామన్నారు. బ్రాండ్ జగన్ పేరిట పెట్టుబడులను ఆకర్షిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనే ఈ సదస్సు ఉద్దేశమని తెలిపారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఐఎస్ సదస్సును ప్రారంభిస్తారని అమర్నాథ్ తెలిపారు. ప్రముఖుల సమక్షంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక సెషన్ ఉంటుందన్నారు. 150కి పైగా ఏర్పాటవుతున్న స్టాళ్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపార అవకాశాలపై 500 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. సమ్మిట్‌కు 46 దేశాల ప్రముఖులు, 8 నుంచి 10మంది రాయబారులు వస్తున్నారని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం రాత్రి విందు ఏర్పాటు చేశామన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం.. జీఐఎస్ ద్వారా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, 14 కీలక రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. తొలిరోజు కొన్ని ఎంవోయూలు ఉంటాయన్నారు. ఆదాయ వనరులు పెరిగేలా.. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామిక ప్రగతితో జీఐఎస్ వేదికగా భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయ వనరులు పెరిగేలా సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు. నెలన్నరగా అధికార యంత్రాంగం శ్రమించి జీఐఎస్ కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని అభినందించారు. వనరులు పుష్కలం.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు కొత్త పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందన్నారు. అడ్వాంటేజ్ జోన్ పేరుతో ప్రత్యేక విధానాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం అర్హత ఉన్న కంపెనీలకు ఎస్జీఎస్టీలో రాయితీలిస్తామన్నారు. రాయితీలపై అన్ని రకాల నిబంధనలు, విధానాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. సమ్మిట్‌లో వాస్తవ రూపం దాల్చే ఎంవోయూలకే ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ హయాంలో మాదిరిగా బూటకపు పెట్టుబడులుండవని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
అతిథుల ఆగమనం.. విశాఖకు పారిశ్రామిక దిగ్గజాలు..
సాక్షి, అమరావతి: ఏపీకి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో పాల్గొనేందుకు కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి. విశాఖ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బుధవారం ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం. గత సర్కారు మాదిరిగా ఆర్భాటాలు కాకుండా వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. నగరానికి కార్పొరేట్లు, కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొంటున్నారు. ప్రత్యేక అతిథులుగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, బజాజ్ ఫిన్సర్వ్ ఎండీ, సీఈవో సంజీవ్ బజాజ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నవీన్ జిందాల్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు, రెన్యూ పవర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ సిన్హా, దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా , సైయెంట్ ఫౌండర్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సెంచురీ ప్లేబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజాంక, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టెయినబుల్ ప్లానెట్ సెక్రటరీ జనరల్ సత్య త్రిపాఠి, పెగాసస్ క్యాపిటల్ ఫౌండర్ సీఈవో క్రైగ్ కాట్, పార్లే ఫర్ ది అడ్వైజర్స్ ఓషన్స్ సిరిల్ గచ్, శ్రీ సిమెంట్ చైర్మన్ మోహన్ బంగర్, ఒబెరాయ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్ ఒబెరాయ్, టెస్లా కో¸ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి శర్బానంద సోనావాల్, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో పాటు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్రా ఎల్లా, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, వెల్ప్సన్ గ్రూపు ఎండీ రాజేష్ మండవేవాలా, క్రీడాకారిణి పీవీ సింధు పాల్గొంటారు. -
దేశానికే రోల్ మోడల్‌గా ఏపీ ‘జీఐఎస్’
సాక్షి, అమరావతి: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ క్రమంలోనే ఇంధన శాఖలో అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. దీనివల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం సులభతరమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్.. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ల పర్యవేక్షణకు మన జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సమగ్ర వివరాలు మరుసటి రోజు విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్)ను ఉపయోగిస్తోంది. ప్రతి 15 నిమిషాలకు వివరాలు తెలుసుకుంటోంది. దీని వల్ల విద్యుత్ డిమాండ్, సరఫరా, గ్రిడ్ నిర్వహణ, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుకలుగుతోంది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న ఏపీ ట్రాన్స్‌కో.. నెట్వర్క్ నిర్వహణ కోసం మాత్రం సొంతంగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర ఇంధన శాఖ మ్యాపింగ్ పవర్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. వినియోగదారుల నుంచి ఉత్పాదక స్టేషన్ల వరకూ మొత్తం ఏపీ నెట్వర్క్ గ్రిడ్ మ్యాప్‌ను రూపొందించడంలో జీఐఎస్ సాయపడుతోంది. రియల్ టైమ్ ఓవర్ లోడింగ్, లైన్ల అండర్ లోడింగ్ గురించి తెలుసుకోవడం, అన్ని పవర్ కంపెనీల మొత్తం ఆస్తుల సరిహద్దుల మ్యాప్‌ను రూపొందించడం, ఖాళీగా ఉన్న భూమిని గుర్తించడం వంటి పనులు జీఐఎస్‌తో సాధ్యమవుతున్నాయి. ఇది ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు సాయపడుతోందని ఇంధనశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా.. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్.. ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కలిపే మొత్తం దక్షిణ గ్రిడ్ సమగ్ర వ్యవస్థ వివరాలు తెలుసుకునేందుకు జీఐఎస్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. వాతావరణాన్ని అంచనా వేయడం, లోడ్ షెడ్యూలింగ్ చేయడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించడం, లైన్ల పెట్రోలింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి ప్రయోజనాలు జీఐఎస్ సిస్టమ్ ద్వారా పొందాలనుకుంటోంది. గ్రిడ్ మ్యాపింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 400 కేవీ, 220 కేవీ సబ్ స్టేషన్ల అన్ని టవర్ స్థానాల వివరాలను అందించాల్సిందిగా ఏపీ ట్రాన్స్‌కోను ఎల్‌ఆర్‌ఎల్‌డీసీ కోరడంతో అధికారులు ఆ వివరాలను ఇప్పటికే అందజేశారు. -
జీఐఎస్ సర్వే నిలుపుదల
కడప కార్పొరేషన్/ప్రొద్దుటూరుటౌన్: జిల్లాలోని కడప నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో పన్నును మదింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి యోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వీసు(జీఐ ్డఎస్)ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్కులర్ జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రజలకు పన్ను పెరిగినట్లు స్పెషల్ నోటీసులు జారీ చేయడం, రివిజన్ పిటిషన్లు తీసుకోవడం వంటివన్నీ తక్షణం నిలుపుదల చేయాలంటూ స్టేటస్ కో విధించింది. జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లలో ఇప్పటికే జీఐఎస్ సర్వే 90 శాతం పూర్తయింది. ఈ విధానం ద్వారా ప్రతి భవనాన్ని ఉపగ్రహానికి లింక్(జియో ట్యాగింగ్) చేసి కొలతలు వేసి ప న్ను వేసే విధానం ద్వారా జిల్లాలో 80 శాతానికిపైగా ఇళ్లకు పన్ను పెరిగింది. ఆర్వీ అసోషియేట్స్ సంస్థ అనే సంస్థ అన్ని మున్సిపాలిటీల్లో ఈ సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో కడప కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 2,29,900 గృహాలు ఉండగా, జీఐఎస్ సర్వే వల్ల 1.83లక్షల భవనాలకు పన్ను పె రిగినట్లు తెలుస్తోంది. ఇలా పన్ను పెరిగితే వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగులుతుందని భావించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయం వల్ల పట్టణ ప్రజలకు కాసింత ఉపశమనం కలగనుంది. ఈ సర్వే కోసం ఆర్వీ అసోషియేట్స్ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ సర్వేను పూర్తిగా నిలిపేస్తే ఆ సంస్థకు చెల్లించిన మొత్తం ప్రభుత్వం నష్టపోక తప్పదు. ఒకవేళ కొనసాగించాలనుకుంటే మాత్రం ఎప్పటి నుంచి కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సర్వే దాదాపు పూర్తయినందున మెడపై కత్తి వేలాడుతున్నట్లు ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయనుందో, లేక పూర్తిగా రద్దు చేయనుందో తేలేవరకూ టెన్షన్ తప్పదు. రెవెన్యూ సిబ్బందిపై పెరిగిన పనిభారం జీఐఎస్ సర్వే నిర్వహిస్తున్న సంస్థ ప్రతి ఇంటికి సంబంధించిన కొలతలు తీసి మున్సిపల్ కమిషనర్లకు నివేధిక రూపంలో ఇస్తోంది. వీటిని పరిశీలించిన కమిషనర్లు మళ్లీ ఆర్ఐలు, బిల్ కలెక్టర్లతో క్షేత్రస్థాయి విచారణ చేయిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీల్లో బిల్కలెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఓలపై పనిభారం పెరిగిపోయింది. ఓ వైపు పింఛన్ల పంపిణీ, మరోవైపు కొత్తగా పన్నులు వేయడం, పేరు మార్పు, పన్నుల వసూళ్లు వంటి పనులన్నీ రెవెన్యూ విభాగం అధికారులే చేయాల్సి ఉంది. కొత్తగా జీఐఎస్ సర్వే వల్ల ప్రతి ఇంటినీ సర్వే చేయడం, ఆ ఇంటికి పన్ను పెరిగితే నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులపై యజమానులు సంతృప్తి చెందకపోతే రివిజన్ పిటిషన్లు స్వీకరించడం వంటి పనుల వల్ల పనిభారం తీవ్రంగా పెరిగిపోయింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ చేసినా పనులు పూర్తి కావడం లేదు. దీంతో సిబ్బందిపై ఆరోపణలు, ఫిర్యాదులు అధికమయ్యాయి. జీఐఎస్ సర్వే డేటా నిలిపివేత పురపాలక శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈఆర్పీ సిస్టమ్‌లో దాఖలు చేసిన జీఐఎస్ సర్వే డేటాను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిలిపివేయడమైనది. ఈ సర్వే ఆధారంగా ఇవ్వనున్న స్పెషల్ నోటీసుల బట్వాడాను కూడా నిలిపివేస్తున్నాం. స్పెషల్ నోటీసుల బట్వాడా జరిగి, రివిజన్ పిటిషన్లు దాఖలు చేయడబడిన దరఖాస్తులపై తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాయిదా వేయాలని ఆదేశాలిచ్చాం. – ఎస్. లవన్న, కమీషనర్, కడప నగరపాలక సంస్థ. -
తుస్సుమంటున్న ‘సర్వే’
పటమట (విజయవాడ ఈస్ట్) : నగరపాలక సంస్థ చేస్తున్న గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) గందరగోళంగా మారింది. సంస్థ ఆదాయం పెంచుకునే క్రమంలో నగరంలోని అన్ని ఆస్తులకు పన్నులు వేయాలన్న సంకల్పంతో తలపెట్టారు. అందులో భాగంగా అసెస్మెంట్లను ఫొటోలు తీసుకుని, నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నారా లేదా అంటూ చేస్తున్న సర్వేలో పారదర్శకత కనిపించడం లేదు. మూడు నెలల క్రితం ప్రారంభమైన జీఐఎస్ ద్వారా ఆస్తి పన్నులు పెంచుతారనే అపోహలో కొంతమంది యజమానులు సర్వేకి నిరాకరిస్తున్నారు. దీనికితోడు సర్వేకి వెళ్లిన సిబ్బంది అవగాహన లోపంతో పన్ను చెల్లింపుదారులను కూడా బకాయిదారులుగా గుర్తిస్తూ వారికి నోటీసులు ఇవ్వటంతో ఇది ప్రహసనంగా మారింది. సమగ్ర సర్వేకి గడువు మరో నెల రోజుల్లో ముగియనుండగా, ఇంత వరకు 30 శాతం కూడా పూర్తవ్వకపోవటంపై ఇటీవల వీఎంసీ కమిషనర్ కూడా సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సర్వే బాధ్యత నిర్వహిస్తోంది. నగరంలోని 59 డివిజన్లలో సుమారు లక్షకు పైగా అసెస్మెంట్లు ప్రతి ఏడాది వీఎంసీకి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. పన్నుల పరిధిలోకి మరిన్ని అసెస్మెంట్లు వస్తాయని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకునేలా సర్వే జరగటం లేదని, సమగ్ర సర్వే మొత్తం తప్పుల తడకగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. వేధిస్తున్న సిబ్బంది కొరత.. అనంత్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేకి సిబ్బంది కొరత వేధిస్తోంది. 30 టీములు ఉన్నాయని, టీముకు ఇద్దరు చొప్పున ఉన్నా పూర్తిస్థాయిలో సర్వే జరగకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. సర్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతున్నాయని, వీఎంసీ అధికారులను సంప్రదించకుండా డోర్‌లాక్ అసెస్మెంట్లను బకాయిదారులుగా గుర్తించి వారికి నోటీసులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డివిజన్‌కు నాలుగు టీముల చొప్పున 240 మంది సర్వే సిబ్బంది అవసరమవుతుందని అధికారులు సమీక్ష సమావేశాల్లో కమిషనర్‌కు విన్నవించుకున్నారు. ఆ విన్నపాన్ని సర్వే చేస్తున్న అనంత్ టెక్నాలజీస్ పెడచెవిన పెడుతోందని వీఎంసీ అధికారులు వాపోతున్నారు. జీఐఎస్ అంటే.. జీఐఎస్ ద్వారా భవన వాడుక స్వభావం, వివరాలు సేకరించి శాటిలైట్ చిత్రం ద్వారా ప్రత్యేక భౌగోళిక పటం తయారుచేస్తారు. దీనిద్వారా భవన నిర్మాణాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల సమాచారం, తాగునీరు, పైపులైన్ల వివరాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సెల్‌ఫోన్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్ల వివరాలు, మార్కెట్లు, సినిమా హాళ్లు, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటివి గుర్తించి వాటికి ప్రత్యేక నంబరును కేటాయిస్తారు. రూ.125 కోట్ల టార్గెట్.. నగరంలోని ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్, ప్రొఫెషనల్ టాక్స్‌ల ద్వారా రూ.125 కోట్లు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు నెలకు 100 అసెస్మెంట్ల నుంచి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ఇదే విధానంలో రూ.100 కోట్లు టార్గెట్ విధించినప్పటికీ రూ.91.32 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. రాజధాని నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అసెస్మెంట్లు పెరుగుతున్నాయని, దీనికితోడు సర్వే ద్వారా నూతనంగా కొన్ని అసెస్మెంట్లు గుర్తించగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత మందినిఏర్పాటు చేయమన్నాం.. నగరంలోని అన్ని డివిజన్లలో సర్వే జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తున్న సిబ్బందికి ఏరియా వారీగా వివరాలు లేకపోవటంతో తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మేం కూడా విచారిస్తున్నాం. ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ఏరియాలో విధులు నిర్వహించే రెవెన్యూ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్‌ను సంప్రదించాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవటం కూడా మరో సమస్య. అన్ని డివిజన్లలో సర్వే పూర్తి చేయాలంటే సుమారు 250 మంది సిబ్బంది అవసరమవుతారు. దీనిపై అధికారులకు కూడా వివరించాం. –జి.సుబ్బారావు,డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) -
నింగి నుంచి భూమి సర్వే..
మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణితో పాటు సర్వే ల్యాండ్ రికార్డుల కార్యాలయాలకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. తమ భూమి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆ ఫిర్యాదుల్లో పలువురు కోరుతుంటారు. శాశ్వత పరిష్కారం కోసం వీరందరూ ఎదురుచూస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈక్రమంలో నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ రికార్డుల ప్యూరిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. అయితే, రికార్డుల వరకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మాటిక్ సిస్టమ్(జీఐఎస్) సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో రికార్డుల ప్యూరిఫికేషన్ సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే జీఐఎస్ ద్వారా భూముల సర్వే చేపడితే ఎలా ఉంటుందనే సాధ్యాసాధ్యాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూత్రప్రాయంగా నిర్దేశించినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే భూముల లెక్క తేల్చడంతో పాటు రికార్డుల ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో రికార్డులకు, క్షేత్ర స్థాయికి తేడాలు ఉన్నట్లు అధికారులు గమనించారు. భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు రావాలంటే మరిన్ని చర్యలు అవసరమని భావించిన ప్రభుత్వం జీఐఎస్ ల్యాండ్ సర్వే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా భూరికార్డులు, హద్దుల విషయంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదీ మేలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా భూముల సర్వే చేపడితే భూయాజమానులకు మేలు జరగడంతో పాటు రికార్డుల నిర్వహణ సైతం పారదర్శకమవుతుంది. సర్వే నంబర్ల వారీగా నిర్ణయించే హద్దుల మేరకు వాస్తవంగా భూమి విస్తీర్ణం, నక్షాలు రూపొందిస్తారు. పట్టాదారుల విస్తీర్ణం తేల్చి తర్వాత హద్దులు నిర్ణయిస్తారు. వీఆర్వో, సర్వేయర్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. వీఆర్వో, సర్వేయర్ల రిపోర్టును తప్పని సరిచేయడంతో పాటు కొనుగోలు చేసిన భూమికి పక్కా కొలతలు నిర్ణయిస్తారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్, ముటేషన్ రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో కొలతలకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. అలాగే, ఎవరైనా భూమి కొలతల సమస్యతో అధికారుల వద్దకు వస్తే పరిష్కరించడం సులువవుతుంది. సర్వే నంబర్ల జియో ట్యాగింగ్ జీఐఎస్ సర్వే ద్వారా భూకొలతలు చేపట్టాక కర్ణాటక తరహాలో సర్వే నంబర్ల వారీగా హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తారు. వచ్చే నెలలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన మేరకు జీఐఎస్ ల్యాండ్ సర్వే నిర్వహిస్తే భూప్రక్షాళన ఆశయం నెరవేరడమే కాకుండా భూ యాజమానులకు కొలతలు, హద్దులు, రికార్డుల పరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశముంది. ఇందులో భాగంగా సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. గతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్లకు సూచిస్తే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు లేవని చెప్పడం, భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతుండడం ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదే సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే వాస్తవంగా ఎంత భూమి అందుబాటులో ఉందో తెలిసిపోనుంది. త్వరలో సర్వే మహబూబ్‌నగర్ జిల్లాలోని తహసీల్దార్లతో ఈనెల 17న కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చిన అంశాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న హద్దుల సమస్యను అన్ని జిల్లాల అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఐఎస్ సర్వే నిర్వహించి భూప్రక్షాళన ఫలితాలను ప్రజలకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. -
ఇవాంక సదస్సు నుంచి దీపిక ఎగ్జిట్?
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ముఖ్య అతిథిగా నగరంలో నిర్వహించబోయే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు పద్మావతి చిత్ర సెగ తగిలినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సదస్సులో పద్మావతి చిత్ర హీరోయిన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే పాల్గొని చర్చాగోష్టిలో ‘హాలీవుడ్ టు నాలీవుడ్ టు బాలీవుడ్’అనే అంశంపై ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆమె ఈ కార్యక్రమం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. దీనికి కారణం పద్మావతి చిత్రంపై జరగుతున్న అల్లర్లేనని తెలుస్తోంది. డిసెంబర్1 విడుదల కావల్సిన ఈ చిత్రంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నిషేదించాలని రాజ్‌పుత్‌లు, కొంత మంది బీజేపీ నాయకులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇంకొంత మంది డైరెక్టర్ భన్సాలీ, దీపికను చంపితే 10 కోట్లు నజరానా ఇస్తామని ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యానే దీపిక ఈ సదస్సు నుంచి తప్పుకుందని, నిరసన కారులు సదస్సును అడ్డుకుంటారని నిర్వహకులే ఆమెను తప్పించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
గుట్టుగా ఇవాంకా పర్యటన వివరాలు.. ధోనికి ఆహ్వానం..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం కావటంతో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)ను అమెరికా ప్రభుత్వంతోపాటు నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంటర్నేష నల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా సమ్మిట్ ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరిగే సదస్సును మొత్తం 53 సెషన్లుగా వర్గీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును సైతం సిద్ధం చేశారు. ప్రధానంగా హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి 4 ప్రధాన రంగాల్లోని ఆవిష్కరణలపై సదస్సులో లోతుగా చర్చించనున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఏటా జరిగే ఈ సదస్సుకు దక్షిణాసియా దేశం ఆతిథ్యమివ్వటం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల బృందం సదస్సుకు తరలిరానుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సదస్సులో మొదటి రోజున ప్రారంభోత్సవ వేదికపైనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వాన ప్రసంగం చేస్తారు. అనంతరం ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధికారత, స్వావలంబన లక్ష్యాలుగా మహిళలకు ప్రాధాన్యమివ్వటంతో ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. ‘మహిళలు ముందుంటే.. అందరికీ శ్రేయస్సు’అనే సందేశంతో పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక ఆలోచనలను ఈ వేదికపై పంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార అవకాశాలు, కొత్త ఆలోచనలు, పెట్టుబడులు, వ్యాపార రంగంలో శరవేగంగా చొచ్చుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై ఈ సదస్సులో 53 చర్చాగోష్టులు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును సిద్ధం చేశారు. అయితే ప్రజెంటేషన్లకు సంబంధించి స్పష్టత రాలేదు. కొందరు పారిశ్రామికవేత్తలు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా.. కొందరు ప్రజెంటేషన్లు రద్దు చేసుకుంటున్నారు. దీంతో కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, పెట్టుబడిదారుల్లో ఎక్కువమంది కొత్తగా స్టార్టప్స్‌ను ప్రారంభించిన వారు, కొత్త వ్యాపారాలు ఆరంభించినవారున్నారు. ధోని, దీపికలకు ఆహ్వానం.. రాలేమని సమాచారం సదస్సుకు క్రీడా రంగం నుంచి ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని ఆహ్వానించారు. అయితే సొంత కారణాలతో సదస్సుకు రాలేకపోతున్నట్లు ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే కూడా సదస్సులో పాల్గొనాల్సి ఉండగా, కార్యక్రమం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారని తెలిసింది. సదస్సులో జరిగే చర్చాగోష్టిలో ‘హాలీవుడ్ టు నాలీవుడ్ టు బాలీవుడ్’అనే అంశంపై ఆమె ప్రసంగించాల్సి ఉంది. ఇక ఆహ్వానం అందుకున్న ఇతర క్రీడాకారులు సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్ హాజరవుతారు. గోల్కొండ కోటలో సీఎం విందు సదస్సు రెండో రోజు సాయంత్రం అతిథులందరికీ గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ విందు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున గోల్కొండ ఆర్ట్ మెమెంటో, పోచంపల్లి దుస్తులతో చేయించిన గిఫ్ట్ ప్యాక్‌లను కానుకలుగా ఇవ్వ నున్నారు. తెలంగాణ ప్రాముఖ్యత, టూరిజం విశేషాలను అందులో పొందుపరచనున్నారు. వచ్చే ఏడాది మరో సదస్సు పారిశ్రామిక సదస్సు నిర్వహణ అనుభవాలతో వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ఐటీ కాన్ఫరెన్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఇండియాలోనే మొదటిసారి జరగనున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. 60 అధునాతన బస్సులు సిద్ధం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు గ్రేటర్ ఆర్టీసీ అధునాతన బస్సులను సిద్ధం చేసింది. సమ్మిట్ జరగనున్న హెచ్ఐసీసీతోపాటు, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌లకు ప్రతినిధులను తరలించేందుకు 60 బస్సులను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ మేనేజర్ కొమరయ్య నేతృత్వంలో అధికారులు సోమవారం ఫలక్‌నుమా వద్ద బస్సుల రాకపోకలను పరిశీలించారు. బస చేసే హోటళ్ల నుంచి ప్రతినిధులను హెచ్ఐసీసీకి తరలించడం తిరిగి హోటళ్లకు తీసుకెళ్లడంతోపాటు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్న విందుకు, గోల్కొండ కోట సందర్శనకు ఆర్టీసీ బస్సులు నడపనుంది. 300 మంది పెట్టుబడిదారుల రాక దేశ విదేశాల నుంచి దాదాపు 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. వీరిలో 500 మంది భారతీయులు కాగా, అందులో 74 మంది రాష్ట్రానికి చెందిన వారున్నారు. 300 మంది పెట్టుబడిదారులు హాజరవుతుండగా అందులో 100 మంది దేశం నుంచి, 100 మంది అమెరికా నుంచి, మరో 100 మంది ఇతర దేశాల వారు ఉండనున్నారు. గోప్యంగా ఇవాంకా పర్యటన ఇవాంకా ట్రంప్ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అధికారిక హోదాలో విమానాశ్రయంలో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు కూడా ఎవరు రావద్దని అగ్రరాజ్యం భద్రతా అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. ఇవాంకా ఎన్నింటికి వస్తారు, ఎక్కడ బస చేస్తారు, ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారనేదంతా రహస్యమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోదీ అదే రోజున కొందరు పెట్టుబడిదారులతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన కెనడాలో స్థిరపడ్డ ప్రముఖ వ్యాపార వేత్త ప్రేమ్ శ్రీవాస్తవ, అమెరికాకు చెందిన సిస్కో కంపెనీ యజమాని జాన్ చాంబర్స్‌తోపాటు పది మంది పెట్టుబడిదారులతో మోదీ భేటీ కానున్నారు. ప్రసంగించేది ముగ్గురే.. సదస్సు ప్రారంభోత్సవంలో కేవలం ముగ్గురు వక్తలు మాత్రమే ప్రసంగించనున్నారు. 28న సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, అనంతరం ఇవాంకా ట్రంప్ ప్రసంగిస్తారు. చివరగా సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం హెచ్ఐసీసీలో ఎలాంటి వేదికను ఏర్పాటు చేయడం లేదు. మోదీ, ఇవాంకా, కేసీఆర్ మొదటి వరుసలో ఆసీనులు కానున్నారు. సదస్సులో తెలంగాణ ప్రత్యేకతలపై ఎగ్జిబిషన్, కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా నిర్వాహకులు అనుమతించలేదు. కేవలం స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలు పంచుకోవటం, పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సదస్సు కార్యక్రమాలను రూపొందించారు. -
ఒక్క క్లిక్ చాలు !
నగరంపాలెం(గుంటూరు): నగర ప్రజలకు అవినీతి రహిత, పారదర్శక సేవలు అందించటానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం అదుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) పేరుతో సర్వే చేపట్టారు. దీనితో నగరపాలక సంస్థ అందించే అన్నిరకాల సేవలు, మౌలిక సౌకర్యాలు పూర్తిగా గూగుల్ ఎర్త్‌లో మార్కింగ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ముఖ్యంగా నగరపాలక సంస్థకు ఆదాయవనరైన రెవెన్యూ విభాగంలోని ఆస్తులకు సంబంధించిన అసెస్మెంట్లు జియోట్యాగింగ్‌తో పాటు వాటి వివరాలు, టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన రహదారులు, ఇంజినీరింగ్‌కు సంబంధించి వాటర్, డ్రెయినేజీ వ్యవస్థను, అభివృద్ధి పనులు, ల్యాండ్ మార్కింగ్ సైతం జియోట్యాగింగ్ చేసి ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. అంతా ఆన్లైన్లోనే.. నగర ముఖచిత్రం ఒక్క క్లిక్‌తో తెలుసుకోవటంతో పాటు అభివృద్ధి పనుల ప్లానింగ్‌ను వేగవంతంగా చేయటానికి ఇది దోహదపడుతుంది. నగరంలో జీఐఎస్ సర్వే నిర్వహించటానికి దార్‌షా ఏజెన్సీకి రాష్ట్ర పురపాలక శాఖ పనులు అప్పగించింది. 50 బృందాలతో రెవెన్యూ డివిజన్లు వారీగా నగరంలోని 1.30లక్షలకు పైగా ఉన్న అసెస్మెంట్లను సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి అసెస్మెంట్ల ప్రకారం స్థిరాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ఈ సర్వేను ఈ నెల 3న నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ లాంఛనంగా ప్రారంభించారు. వివరాలు పక్కాగా.. సర్వే ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి ట్యాబ్ సహాయంతో ప్రత్యేకమైన యాప్‌లో ఇంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇంటిని ముందుగా ఫొటో తీసి, స్థలం, నిర్మాణ ప్రాంతం, కమర్షియల్, రెసిడెన్షియల్ వాడుకను వేర్వేరుగా కొలతలు వేస్తారు. యాప్‌లో అప్లికేషన్ ఓపెన్ చేసి ఇంటికి నగరపాలక సంస్థ కేటాయించిన అసెస్మెంట్ నంబర్‌ను ఎంటర్ చేయగానే దానికి అనుసంధానమైన వివరాలు యజమాని పేరు, కొలతలు, ఇంటిస్థితి, వాడుక విధానం అప్లికేషన్లోకి వస్తాయి. ప్రస్తుతం అదే స్థితిలో ఉంటే అప్లికేషన్‌ను ఒకే చేస్తారు. లేకుంటే రిమార్క్ కాలమ్‌లో వివరాలను ఉంచుతారు. ఈ క్రమంలో ఇంటి యజమాని ఆధార్ కార్డు, అందుబాటులో ఉంటే డాక్యుమెంట్లు, బిల్డింగ్ ప్లాన్ కాపీని కూడా ఆన్లైన్ చేస్తున్నారు. విద్యుత్ బిల్లు నంబర్, కుళాయి, డ్రెయినేజీ కనెక్షన్, భారీ స్థలాల కొలతలను గూగుల్ మ్యాప్‌తో అనుసంధానం చేసి నిర్వహిస్తున్నారు. డిజిటల్ నంబర్ల కేటాయింపు.. జీఐఎస్ సర్వే పూర్తి చేసిన ప్రతి ఇంటికి వెంటనే జిప్పర్ ఐడీని క్రియేట్ చేస్తున్నారు. దీని ద్వారా గూగుల్ మాప్లో లాగిన్ అయితే ఇంటి రూట్‌మ్యాప్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. నగరంలో సర్వే మొత్తం పూర్తయిన తర్వాత రాష్ట్రం మొత్తనికి యునిక్ ఐడీతో కూడిన డిజిటల్ డోర్ నంబర్‌ను కేటాయిస్తారు. ఇందు కోసం నగరపాలక సంస్థలో ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో సర్వే పూర్తి.. జీఐఎస్ సర్వేను రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం. దీని ద్వారా అసెస్మెంట్ల వారీగా నగరపాలక సంస్థ రికార్డుల్లో ఉన్న వివరాలు, వాస్తవంగా ఉన్న పరిస్థితుల తేడాలు కచ్చితంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. అధికారుల్లో కూడా జవాబుదారీ తనం పెరుగుతుంది. అసెస్మెంట్ సర్వేకు వచ్చే సిబ్బందికి నగర ప్రజలు సహకరించాలి. – చల్లాఅనూరాధ, నగరపాలక సంస్థ కమిషనర్ -
‘అక్రమ’మే అధికం..!
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జీఐఎస్(జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) సర్వే చేపట్టింది. ఖమ్మం కార్పొరేషన్లో అనుమతి ఉన్న నిర్మాణాల కంటే అనుమతి లేనివే అధికంగా ఉన్నట్లు తేలింది. అనుమతి తీసుకుని నిర్మాణాలు చేపట్టగా.. అందులో అదనంగా నిర్మించిన కట్టడాలు కూడా బయటపడ్డాయి. దీంతో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలపై కార్పొరేషన్ అధికారులు జీఐఎస్ సర్వే నిబంధనల ప్రకారం నూరు శాతం అపరాధ రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీఐఎస్ సర్వే చేపట్టకముందు కార్పొరేషన్ పరిధిలోని రికార్డుల ప్రకారం 29వేల నిర్మాణాలు ఉండేవి. సర్వే చేపట్టిన తర్వాత మొత్తం 62వేల నిర్మాణాలు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఖమ్మం కార్పొరేషన్లో విలీనమైన తొమ్మిది పంచాయతీలను మినహాయించి కేవలం స్పెషల్ గ్రేడ్‌గా ఉన్న సమయంలో 11 రెవెన్యూ డివిజన్ల పరిధిలోనే సర్వే చేపట్టడం గమనార్హం. కార్పొరేషన్‌గా మారకముందు రెవెన్యూ డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 19వేల నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 11వ వార్డులోనే జరగడం గమనార్హం. దీంతో ఆయా నిర్మాణాలపై అపరాధ రుసుము వసూలు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.2కోట్లకుపైగా ఆదాయం జీఐఎస్ పూర్తి చేసిన తర్వాత అనుమతులు తీసుకున్న వాటికంటే.. అదనంగా చేపట్టిన నిర్మాణాలు నగరంలో 5,200 ఉన్నట్లు గుర్తించారు. ఆయా నిర్మాణాల యజమానుల వద్ద నుంచి పెరిగిన పన్నుతోపాటు జీఐఎస్ అపరాధ రుసుము నూరు శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా కార్పొరేషన్‌కు రూ.కోటి మేర ఆదాయం లభించనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో అసలు అనుమతులు లేకుండా ఉన్న నిర్మాణాలు 25వేలకు పైగానే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు అసలు అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు సైతం అపరాధ రుసుము వసూలు చేయాలని భావిస్తున్నారు. దీంతో అపరాధ రూ.కోటి మేర లభించే అవకాశాలున్నాయి. జీఐఎస్ సర్వే పుణ్యమా అని కార్పొరేషన్‌కు రూ.2కోట్ల మేర ఆదాయం లభించనుంది. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను రూపంలో రూ.13కోట్ల మేర ఆదాయం లభిస్తుండగా.. ఈ ఏడాది మరో రూ.2కోట్ల మేర ఆదాయం లభించనుంది. -
మనకూ వాటర్ గ్రిడ్
► జిల్లా యూనిట్‌గా ప్రతిపాదనలు ►జలాశయాల్లో ఐదు గ్రిడ్ల నిర్మాణం ►2050 జనాభా అంచనాతో డిజైన్లు ► జీఐఎస్ ద్వారా పని.. ► లైన్ అంచనాలు తయారు.. ►బడ్జెట్లో ఆమోదమే తరువాయి.. ►మూడు నెలల్లో టెక్నికల్ సర్వే పూర్తి ఆదిలాబాద్ : జిల్లాకు డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ రాబోతోంది. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అధికారులు ఐదు గ్రిడ్ల కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఐదు సాగునీటి రిజర్వాయర్లే వనరులుగా వీటిని నిర్మించనున్నారు. ఇప్పటికైతే వేర్వేరుగా నిర్మించాలనే ఆలోచన ఉన్నా.. రానున్న రోజుల్లో ఐదు గ్రిడ్లను అనుసంధానం చేసే యోచన కూడా ఉంది. 2050 జనాభా అవసరాల అంచనాతో వీటిని డిజైన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గత నెల తెలంగాణ గ్రిడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీంను ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులను ప్రతి జిల్లా నుంచి లైన్ అంచనాను ఈనెల చివరిలోగా ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యారు. సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రిడ్‌కు ఆమోదం పొందితే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడు నెలల్లో టెక్నికల్ సర్వేను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐదు గ్రిడ్లు జిల్లాలో ఐదు సాగునీటి రిజర్వాయర్ల ద్వారా గ్రిడ్లను నిర్మించనున్నారు. గ్రిడ్-1 శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ), గ్రిడ్-2 గడ్డెన్నవాగు, గ్రిడ్-3 కడెం, గ్రిడ్-4 ఎల్లంపల్లి, గ్రిడ్-5 కొమురం భీమ్ ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో తాగునీటి లభ్యతను అంచనా వేశారు. దీని ఆధారంగా గ్రిడ్లు అనుసంధానమయ్యే నియోజకవర్గాలు రూపొందించారు. ఎస్సారెస్పీ కింద నిర్మల్, బోథ్, ఆదిలాబాద్.. గడ్డెన్నవాగు కింద ముథోల్.. కడెం ప్రాజెక్టు కింద ఖానాపూర్.. కొమురం భీమ్ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లిలు ఉన్నాయి. ప్రస్తుతం 2030 జనాభా ప్రకారం ఈ ఐదు గ్రిడ్లకు కలిపి ఏడాదికి 5.531 టీఎంసీల నీళ్లు తాగునీటి, ఇతర అవసరాల కోసం అవసరమని.. 2050 అంచనాల ప్రకారం 7.319 టీఎంసీల నీళ్లు అవసరమని గుర్తించారు. రోజూ ఒక్కో వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, అర్బన్ ఏరియాల్లో 135 లీటర్లు తాగునీరు, ఇతర అవసరాల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంచనాలు రూపొందించారు. దీనికోసం రిజర్వాయర్ల నుంచి ఒక్కో వ్యక్తి అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో 130 లీటర్లు, పట్టణ ప్రాంతాల కోసం 150 లీటర్లు రా వాటర్ తీసుకొని ఫిల్టరేషన్ చేయడం ద్వారా పైన పేర్కొన్న లీటర్లను అందజేయవచ్చు. అన్ని గ్రామాలకు నీరు.. ఐదు గ్రిడ్ల ద్వారా జిల్లాలోని ప్రతీ గ్రామానికి, అనుబంధ గ్రామాలకు కూడా నీటి సరఫరా జరిగేలా సర్వే చేస్తున్నారు. ఏదైన హ్యాబిటేషన్‌లో నీటి నిల్వ కోసం రిజర్వాయర్ లేకపోతే అక్కడ జనాభాకు అనుగుణంగా ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం, అదేవిధంగా ఏదైన నీటి పథకం డ్యామేజ్ ఉన్న పక్షంలో మార్పు కోసం ప్రతిపాదనలు చేసి కొత్త పైపులైన్ వేయడం జరుగుతుంది. కాగా గ్రిడ్లు జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)లో పనిచేసే విధంగా నిర్మాణం చేస్తున్నారు. పైపులైన్లు స్కాడా(ఎస్సీఏడీఏ) పద్ధతిలో చేపడుతున్నారు. తద్వారా ఎక్కడైన లీకేజీలుంటే ఆన్లైన్లో మానిటరింగ్ చేసే విధంగా ఈ నైపుణ్యం పనిచేయనుంది. సర్వేలో భాగంగా లైన్ల అంచనాలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతీ మండలం హ్యాబిటేషన్లలో ఎన్ని ఓహెచ్ఎస్ఆర్ పైప్లైన్లు ఉన్నాయనేది అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కరెంటు సమస్యలతో గ్రామాల్లో బోర్‌వెల్స్ పనిచేయని పరిస్థితి. ఈ నేపథ్యంలో వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గ్రిడ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. -
జీఐఎస్‌తో అక్రమ నిర్మాణాలకు చెక్
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో త్వరలో జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) శాటిలైట్ టెక్నాలజీ ద్వారా భవన నిర్మాణాల పర్యవేక్షణ, ప్రణాళికలు అమలు చేయనున్నా రు. వీలైనంత త్వరలో ఈ హైటెక్ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు. తిరుపతిలో జనవరి 18న నిర్వహించిన టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. జీఐఎస్ ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం పనుల పర్యవేక్షణ, అమలు చేపట్టాల ని, ఇందుకు అవసరమైన టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని ఇప్పటికే విజయవాడలో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. శాంపిల్ సర్వే చేసి ఆస్తి గుర్తింపుకార్డులు (ప్రాపర్టీ ఐడీ) జారీ చేశారు. ఈ క్రమంలో జీఐఎస్ పద్ధతి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వస్తే ఉద్యోగులు లంచా లు తీసుకుని చూసీచూడనట్లు భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి బ్రేక్ పడుతుంది. చాలా వరకు ప్రణాళిక విభాగాల్లో అక్రమాలను నిరోధించేందుకు అవకాశం ఉంటుంది. జీఐఎస్ అంటే ? జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(జీఐఎస్)లో అంతరిక్షంలోని శాటిలైట్ ద్వారా భూమిపైన వివిధ పట్టణాల్లో నిర్మిస్తున్న భవనాల ఆకృతులు, వాటి కొలతలను ఫొటోలు తీయడం, ఈ వివరాలు కంప్యూటర్లలో ఆన్లైన్ ద్వారా నిక్షిప్తం చేస్తారు. కంప్యూటర్లో నిక్షిప్తం చేసిన వివరాల ఆధారంగా నిర్మాణంలో ఎంతవరకు నిబంధనలు పాటిం చారనే విషయాలను పరిశీలించవచ్చు. ప్రణాళిక విభాగం సిబ్బందితో ప్రమేయం లేకుండా జీఐఎస్‌ను ఏజెన్సీలు అమలు చేస్తాయి. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవనాల వివరాలను శాటిలైట్ ద్వారా కంప్యూటర్‌కు ఆన్లైన్ ద్వారా పంపి నిక్షిప్తం చేస్తారు. ఈ వివరాలు, యజమానులు దరఖాస్తు చేసిన భవనాల నిర్మాణ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది జీఐఎస్ ద్వారా సరిచూస్తారు. నిబంధనల ఉల్లంఘన ఉంటే అనుమతులు ఇవ్వరు. జీఐఎస్ ద్వారా సేకరించిన సమాచారానికి, భవన యజమాని సమర్పించిన వివరాలు సరిపోలితే ఎవరి సిఫార్స్ లేకుండానే అనుమతి లభిస్తుంది. ఇప్పటికే ఈ పద్ధతిని జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్నారు. విజయవాడలో పెలైట్ సర్వే జీఐఎస్ పద్ధతి ద్వారా భవన నిర్మాణాల పర్యవేక్షణ, అనుమతుల జారీ వ్యవహారానికి సంబంధించి పెలైట్ ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. విజయవాడ నగరంలో ప్రాంతాలవారీ గా ఈ తరహా సర్వే చేసి ప్రాపర్టీ ఐడీకార్డులు(ఆస్తి గుర్తిం పు కార్డులు) జారీ ప్రక్రియ ప్రారంభించారు. దీనివల్ల ఎంతో ఉపయోగం. భవన నిర్మాణం పూర్తికాగానే భవన విస్తీర్ణం, ఎన్ని అంతస్తులు, ఏ తరహా నిర్మాణం, యజ మాని పేరు, రేషన్‌కార్డు నెంబరు, ఓటరు ఐడీ కార్డు, ఆధార్‌కార్డు నంబరు ఇలా బహుళ రకాలైన వివరాలను ప్రాపర్టీ ఐడీ కార్డులో పొందుపరుస్తారు. ఐడీ కార్డులోని అసెస్మెంట్ నంబరును చూసి ఆస్తి పన్ను కట్టవచ్చు. ఇతర వివరాలు కావాలన్నా ఈ కార్డులో చూసి తెలుసుకోవచ్చు. దీనివల్ల భవన యజమాని ఆస్తికి గుర్తింపు ఉంటుంది. జిల్లాలో ఈ తరహా ప్రక్రియకు తెరలేస్తే చాలా వరకు ప్లానింగ్ సిబ్బంది చేతివాటానికి తెరపడుతుంది. అలాగే భవన యజమానులు ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించి, మున్సిపాలిటీల చుట్టూ నెలలు తిరగకుండా పని చేసుకునేందుకు వీలు కలుగుతుంది.