ఒక్క క్లిక్‌ చాలు ! | one click for GIS survey | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌ చాలు !

Published Wed, Nov 8 2017 9:05 AM | Last Updated on Wed, Nov 8 2017 9:05 AM

one click for GIS survey - Sakshi

నగరంపాలెం(గుంటూరు): నగర ప్రజలకు అవినీతి రహిత, పారదర్శక సేవలు అందించటానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం అదుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (జీఐఎస్‌) పేరుతో సర్వే చేపట్టారు. దీనితో నగరపాలక సంస్థ అందించే అన్నిరకాల సేవలు, మౌలిక సౌకర్యాలు పూర్తిగా గూగుల్‌ ఎర్త్‌లో మార్కింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ముఖ్యంగా నగరపాలక సంస్థకు ఆదాయవనరైన రెవెన్యూ విభాగంలోని ఆస్తులకు సంబంధించిన అసెస్‌మెంట్‌లు జియోట్యాగింగ్‌తో పాటు వాటి వివరాలు, టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన రహదారులు, ఇంజినీరింగ్‌కు సంబంధించి వాటర్, డ్రెయినేజీ వ్యవస్థను, అభివృద్ధి పనులు, ల్యాండ్‌ మార్కింగ్‌  సైతం జియోట్యాగింగ్‌ చేసి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు.

అంతా ఆన్‌లైన్‌లోనే..
నగర ముఖచిత్రం ఒక్క క్లిక్‌తో తెలుసుకోవటంతో పాటు అభివృద్ధి పనుల ప్లానింగ్‌ను వేగవంతంగా చేయటానికి ఇది దోహదపడుతుంది. నగరంలో జీఐఎస్‌ సర్వే నిర్వహించటానికి దార్‌షా ఏజెన్సీకి రాష్ట్ర పురపాలక శాఖ పనులు అప్పగించింది. 50 బృందాలతో రెవెన్యూ డివిజన్‌లు వారీగా నగరంలోని 1.30లక్షలకు పైగా ఉన్న అసెస్‌మెంట్లను సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి అసెస్‌మెంట్ల ప్రకారం స్థిరాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి ఈ సర్వేను ఈ నెల 3న నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనూరాధ లాంఛనంగా ప్రారంభించారు.

వివరాలు పక్కాగా..
సర్వే ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి ట్యాబ్‌ సహాయంతో ప్రత్యేకమైన యాప్‌లో ఇంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇంటిని ముందుగా ఫొటో తీసి, స్థలం, నిర్మాణ ప్రాంతం, కమర్షియల్, రెసిడెన్షియల్‌ వాడుకను వేర్వేరుగా కొలతలు వేస్తారు. యాప్‌లో అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి ఇంటికి నగరపాలక సంస్థ కేటాయించిన అసెస్‌మెంట్‌  నంబర్‌ను ఎంటర్‌ చేయగానే దానికి అనుసంధానమైన వివరాలు యజమాని పేరు, కొలతలు, ఇంటిస్థితి, వాడుక విధానం అప్లికేషన్‌లోకి వస్తాయి. ప్రస్తుతం అదే స్థితిలో ఉంటే అప్లికేషన్‌ను ఒకే చేస్తారు. లేకుంటే రిమార్క్‌ కాలమ్‌లో వివరాలను ఉంచుతారు. ఈ క్రమంలో ఇంటి యజమాని ఆధార్‌ కార్డు, అందుబాటులో ఉంటే డాక్యుమెంట్లు, బిల్డింగ్‌ ప్లాన్‌ కాపీని కూడా ఆన్‌లైన్‌ చేస్తున్నారు. విద్యుత్‌ బిల్లు నంబర్, కుళాయి, డ్రెయినేజీ కనెక్షన్, భారీ స్థలాల కొలతలను గూగుల్‌ మ్యాప్‌తో అనుసంధానం చేసి నిర్వహిస్తున్నారు.

డిజిటల్‌ నంబర్ల కేటాయింపు..
జీఐఎస్‌ సర్వే పూర్తి చేసిన ప్రతి ఇంటికి వెంటనే జిప్పర్‌ ఐడీని క్రియేట్‌ చేస్తున్నారు. దీని ద్వారా గూగుల్‌ మాప్‌లో లాగిన్‌ అయితే ఇంటి రూట్‌మ్యాప్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. నగరంలో సర్వే మొత్తం పూర్తయిన తర్వాత రాష్ట్రం మొత్తనికి యునిక్‌ ఐడీతో కూడిన డిజిటల్‌ డోర్‌ నంబర్‌ను కేటాయిస్తారు. ఇందు కోసం నగరపాలక సంస్థలో ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేసింది.

రెండు నెలల్లో సర్వే పూర్తి..
జీఐఎస్‌ సర్వేను రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం. దీని ద్వారా అసెస్‌మెంట్ల వారీగా నగరపాలక సంస్థ రికార్డుల్లో ఉన్న వివరాలు, వాస్తవంగా ఉన్న పరిస్థితుల తేడాలు కచ్చితంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. అధికారుల్లో కూడా జవాబుదారీ తనం పెరుగుతుంది. అసెస్‌మెంట్‌ సర్వేకు వచ్చే సిబ్బందికి నగర ప్రజలు సహకరించాలి.
– చల్లాఅనూరాధ, నగరపాలక సంస్థ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement