మనకూ వాటర్ గ్రిడ్
► జిల్లా యూనిట్‌గా ప్రతిపాదనలు
►జలాశయాల్లో ఐదు గ్రిడ్‌ల నిర్మాణం
►2050 జనాభా అంచనాతో డిజైన్లు
► జీఐఎస్ ద్వారా పని..
► లైన్ అంచనాలు తయారు..
►బడ్జెట్‌లో ఆమోదమే తరువాయి..
►మూడు నెలల్లో టెక్నికల్ సర్వే పూర్తి
ఆదిలాబాద్ : జిల్లాకు డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ రాబోతోంది. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అధికారులు ఐదు గ్రిడ్‌ల కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఐదు సాగునీటి రిజర్వాయర్లే వనరులుగా వీటిని నిర్మించనున్నారు. ఇప్పటికైతే వేర్వేరుగా నిర్మించాలనే ఆలోచన ఉన్నా.. రానున్న రోజుల్లో ఐదు గ్రిడ్‌లను అనుసంధానం చేసే యోచన కూడా ఉంది. 2050 జనాభా అవసరాల అంచనాతో వీటిని డిజైన్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ గత నెల తెలంగాణ గ్రిడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీంను ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులను ప్రతి జిల్లా నుంచి లైన్ అంచనాను ఈనెల చివరిలోగా ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యారు. సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రిడ్‌కు ఆమోదం పొందితే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడు నెలల్లో టెక్నికల్ సర్వేను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఐదు గ్రిడ్‌లు
జిల్లాలో ఐదు సాగునీటి రిజర్వాయర్ల ద్వారా గ్రిడ్‌లను నిర్మించనున్నారు. గ్రిడ్-1 శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ), గ్రిడ్-2 గడ్డెన్నవాగు, గ్రిడ్-3 కడెం, గ్రిడ్-4 ఎల్లంపల్లి, గ్రిడ్-5 కొమురం భీమ్ ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో తాగునీటి లభ్యతను అంచనా వేశారు. దీని ఆధారంగా గ్రిడ్‌లు అనుసంధానమయ్యే నియోజకవర్గాలు రూపొందించారు. ఎస్సారెస్పీ కింద నిర్మల్, బోథ్, ఆదిలాబాద్.. గడ్డెన్నవాగు కింద ముథోల్.. కడెం ప్రాజెక్టు కింద ఖానాపూర్.. కొమురం భీమ్ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లిలు ఉన్నాయి.
ప్రస్తుతం 2030 జనాభా ప్రకారం ఈ ఐదు గ్రిడ్‌లకు కలిపి ఏడాదికి 5.531 టీఎంసీల నీళ్లు తాగునీటి, ఇతర అవసరాల కోసం అవసరమని.. 2050 అంచనాల ప్రకారం 7.319 టీఎంసీల నీళ్లు అవసరమని గుర్తించారు. రోజూ ఒక్కో వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, అర్బన్ ఏరియాల్లో 135 లీటర్లు తాగునీరు, ఇతర అవసరాల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంచనాలు రూపొందించారు. దీనికోసం రిజర్వాయర్ల నుంచి ఒక్కో వ్యక్తి అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో 130 లీటర్లు, పట్టణ ప్రాంతాల కోసం 150 లీటర్లు రా వాటర్ తీసుకొని ఫిల్టరేషన్ చేయడం ద్వారా పైన పేర్కొన్న లీటర్లను అందజేయవచ్చు.
అన్ని గ్రామాలకు నీరు..
ఐదు గ్రిడ్‌ల ద్వారా జిల్లాలోని ప్రతీ గ్రామానికి, అనుబంధ గ్రామాలకు కూడా నీటి సరఫరా జరిగేలా సర్వే చేస్తున్నారు. ఏదైన హ్యాబిటేషన్‌లో నీటి నిల్వ కోసం రిజర్వాయర్ లేకపోతే అక్కడ జనాభాకు అనుగుణంగా ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణం, అదేవిధంగా ఏదైన నీటి పథకం డ్యామేజ్ ఉన్న పక్షంలో మార్పు కోసం ప్రతిపాదనలు చేసి కొత్త పైపులైన్ వేయడం జరుగుతుంది. కాగా గ్రిడ్‌లు జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)లో పనిచేసే విధంగా నిర్మాణం చేస్తున్నారు.
పైపులైన్‌లు స్కాడా(ఎస్‌సీఏడీఏ) పద్ధతిలో చేపడుతున్నారు. తద్వారా ఎక్కడైన లీకేజీలుంటే ఆన్‌లైన్‌లో మానిటరింగ్ చేసే విధంగా ఈ నైపుణ్యం పనిచేయనుంది. సర్వేలో భాగంగా లైన్‌ల అంచనాలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతీ మండలం హ్యాబిటేషన్లలో ఎన్ని ఓహెచ్‌ఎస్‌ఆర్ పైప్‌లైన్‌లు ఉన్నాయనేది అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కరెంటు సమస్యలతో గ్రామాల్లో బోర్‌వెల్స్ పనిచేయని పరిస్థితి. ఈ నేపథ్యంలో వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గ్రిడ్‌లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.