కార్యరూపం దాలుస్తున్న ఒప్పందాలు
ఏడాది తిరక్కుండానే మెజార్టీ పరిశ్రమల ఏర్పాటు
రూ.1,350 కోట్ల విలువైన 4 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభం.. ఏటా 11.90 లక్షల టన్నుల ఉత్పత్తి
5,380 మందికి ఉపాధి, 23 వేల మంది రైతులకు లబ్ధి.. ఉత్పత్తి దిశగా మరో ఆరు పరిశ్రమలు
వీటి ద్వారా మరో 3.38 లక్షల టన్నుల ఉత్పత్తి
2,180 మందికి ఉపాధి
24,100 మంది రైతులకు లబ్ధి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమల హబ్‌గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు పాడి, మత్స్య ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఆహారశుద్ధిలోనూ అగ్రగామిగా నిలుస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలనిస్తోంది. గతేడాది విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్(జీఐఎస్)లో జరిగిన మెజార్టీ ఒప్పందాలు ఏడాది తిరగకుండానే కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ సదస్సులో రూ.5,765 కోట్ల విలువైన 33 ఒప్పందాలు జరగ్గా, వీటి ద్వారా ప్రత్యక్షంగా 12,600 మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా వేశారు.
ఇప్పటికే వీటిలో రూ.1,350 కోట్ల పెట్టుబడితో ఏటా 11.90 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు మేజర్ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా పరోక్షంగా 5,380 మందికి ఉపాధి లభిస్తుండగా, 23 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతోంది. మరొక వైపు రూ.2,227 కోట్ల విలువైన మరో ఆరు పరిశ్రమలు శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో అధికారులు వేగంగా అనుమతులు మంజూరు చేయడం వల్ల జీఐఎస్ ఒప్పందాల్లో 60 శాతం పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి.
ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలివే..
ఏలూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రూ.1,350 కోట్ల పెట్టుబడితో నాలుగు భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి.
► అనా ఓలీయో ప్రైవేట్ లిమిటెట్ సంస్థ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద రూ.650 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 1,000 టన్నుల సామర్థ్యంతో పామ్ ఆయిల్, రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో సన్‌ఫ్లవర్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా 2,100 మందికి నేరుగా ఉపాధి కల్పిస్తోంది.
► డీపీ కోకోవా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతిలోని శ్రీసిటీ వద్ద రూ.350 కోట్ల పెట్టుబడితో కోకో బట్టర్, ఫౌడర్, మాస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఏటా 40 వేల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది.
► గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థ ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం వద్ద రూ.250 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఏడాదికి 4.20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,150 మందికి ఉపాధి కల్పిస్తోంది.
► గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద రూ.100 కోట్లతో ఎడిబుల్ ఆయిల్ రిఫనరీ అండ్ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌తో పాటు రోజుకు 200 టన్నుల సామర్థ్యంతో సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్స్ ద్వారా 1,130 మందికి ఉపాధి కల్పించగా, 5 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది.
నిర్మాణ దశలో ఉన్నవి ఇవీ..
తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో రూ.2227 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఆరు పరిశ్రమలకు భూమిపూజ జరగ్గా, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏటా 3,39,300 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలతో 2,180 మందికి ఉపాధి లభించనుండగా, 24,100 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
► మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ తిరుపతి శ్రీసిటీ వద్ద రూ.1,600 కోట్ల పెట్టుబడితో చాక్లెట్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. కాడ్బరీ, టాంగ్, బోర్నవిటా, ఒరియా, ఫైవ్‌స్టార్ వంటివి ఈ కంపెనీ ఉత్పత్తులే. ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవాను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చనుంది.
► సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజస్ కంపెనీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కువ్వకొల్లి గ్రామం వద్ద రూ.400 కోట్ల పెట్టుబడితో భారీ ఇన్‌స్టెంట్ కాఫీ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. ఏటా 16వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కాబోతున్న ఈ పరిశ్రమ ద్వారా 950 మందికి ఉపాధి కల్పించనుండగా, 2,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
► శ్రీ వెంకటేశ్వర బయోటెక్ కంపెనీ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొమ్మూరు వద్ద రూ.144 కోట్లతో రోజుకు 400 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొక్కజొన్న పిండి తయారీ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 310 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
► విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం వద్ద ఒరిల్ ఫుడ్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ఇన్‌స్టంట్ విజిటబుల్ చట్నీస్ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. ఏటా 7,500 టన్నుల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేస్తూ రెడీమేడ్ చట్నీలు తయారు చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 175 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
► అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్లతో అనకాపల్లి జిల్లా కొండవాటిపూడి వద్ద కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఏటా వెయ్యి టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి కల్పించనుండగా, వెయ్యి మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
► విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొనాడ వద్ద బ్లూఫిన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ.13 కోట్ల పెట్టుబడితో పొటాట చిప్స్, పాస్తా, నూడిల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఏటా 3,600 టన్నుల గోధుములు, 480 టన్నుల మిల్లెట్స్, 720 టన్నుల పొటాటో ప్రాసెస్ చేయనుంది. 45 మందికి ఉపాధి లభించనుండగా, 100 రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా జీఐఎస్‌లో జరిగిన మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment