సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు (జీఐఎస్)లో పరిశ్రమల శాఖకు చేసుకొన్న అవగాహన ఒప్పందాల్లో మరో 36 ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలని, వాటికి డిసెంబరు నెలాఖరులోగా శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు.
జీఐఎస్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి రూ. 3.41 లక్షల కోట్ల పెట్టుబడులతో 2.38 లక్షల మందికి ఉపాధి కల్పించే 107 ఒప్పందాలు జరగ్గా, ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులు సిద్ధం చేయాలని ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాలన్నీ త్వరితగతిన కార్యరూపం దాల్చాలని, ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగంగా ఏర్పాటవ్వాలని స్పష్టం చేశారు.
వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను ఆదేశించారు. వీటిపై నెలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. అంతకు ముందు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న కంపెనీల ఏర్పాటుపై ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.
వేగవంతం చేయండి
పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై కూడా పరిశ్రమలు, ఏపీఐఐసీ తదితర విభాగాల అధికారులతో సీఎస్ సమీక్షించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను వేగవంతం చేయాలని, గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జువ్వలదిన్నె, నిజాంపేట, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ పవర్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment