రాష్ట్రంలో ఇథనాల్ బ్లెండింగ్ పరిశ్రమలపై వ్యతిరేకత
కాలుష్యకారక పరిశ్రమలు వద్దంటూ రైతుల ఆందోళన
తమ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ నిరసనలు
ఇప్పటికే చిత్తనూరులోని జూరాల ఆర్గానిక్ ఫార్మ్‌లో ఇథనాల్ తయారీ
మక్తల్, గద్వాలలో నిర్మాణం ప్రారంభం.. మరికొన్నిచోట్ల సన్నాహాలు
జనం వ్యతిరేకతతో దిలావర్‌పూర్ యూనిట్ అనుమతులపై సర్కారు వెనక్కి
కాలుష్యం వెలువడుతోందంటూ రైతు కమిషన్‌కు ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’ తెలంగాణ పల్లెల్లో చిచ్చు పెడుతోంది. పెట్రోల్‌లో కలిపేందుకు అవసరమైన ఇథనాల్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలే మొలాసిస్, ధాన్యం నుంచి అవి ఇథనాల్‌ను తయారు చేస్తాయి.
అయితే రాష్ట్రంలో ఈ యూనిట్ల ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏడాది క్రితం నారాయణపేట జిల్లా చిత్తనూరులో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో.. పనులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్య రహితంగా (జీరో లిక్విడ్ డిశ్చార్జి) ఏర్పాటు కావాల్సిన ఇథనాల్ ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించట్లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు వాయు, జల కాలుష్యానికి కారణమై తమ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ చిత్తనూరు, దిలావర్‌పూర్ ప్రాంత వాసులు ఆందోళనలు చేపట్టారు.
రాష్ట్రంలో 28 సంస్థలకు గ్రీన్ సిగ్నల్
విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2018లో నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీని ప్రవేశపెట్టింది. 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి ఏటా 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించింది.
ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్’ కింద వడ్డీ రేటులో 4 శాతం నుంచి 50శాతం వరకు రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు 31 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 2018 నుంచి 2022 మధ్యకాలంలో 28 సంస్థలకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా రోజుకు 5,256 కిలోలీటర్ల (కేఎల్‌పీడీ) ఇథనాల్ తయారీ ప్రతిపాదనలను ఆమోదించింది.
వీటిలో నారాయణపేట జిల్లా చిత్తనూరులో వీటిలో ప్రస్తుతం 400 కేఎల్‌పీడీ సామర్థ్యమున్న జూరాల ఆర్గానిక్ ఫార్మ్ ఒక్కటే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో మరో ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోనూ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే కేంద్రం నుంచి ఆమోదం పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెప్తున్నారు.
అనుమతులపై అధికారుల మౌనం
నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ కింద ఇథనాల్ తయారీ యూనిట్లకు ఇచ్చిన అనుమతులతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఐడీఆర్ యాక్ట్) కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి వెళ్లిపోయిందని... దీంతో అందులో అంతర్భాగమైన ఇథనాల్ తయారీపై తమకు సమాచారం లేదని అంటున్నాయి.
నిజానికి ఐడీఆర్ యాక్ట్ కేంద్ర జాబితాలోకి వెళ్లడాన్ని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఆమోదించగా.. తెలంగాణ, ఏపీ మాత్రం దూరంగా ఉన్నాయి. మరోవైపు ఇథనాల్ తయారీని ఉమ్మడి కోటాలో చేర్చి పర్యవేక్షక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సుప్రీంకోర్టు పది రోజుల క్రితమే ఆదేశించింది. కానీ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఇథనాల్ యూనిట్లకు నిర్మాణ అనుమతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని... లైసెన్సు, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో రాష్ట్రానికి సంబంధం లేదని పరిశ్రమల శాఖ అధికారులు చెప్తున్నారు.
ఇందులో టీజీఐపాస్ కింద ఎన్ని సంస్థలు దరఖాస్తులు చేసుకున్నాయి, వాటి స్థితిగతులు ఏమిటనే సమాచారం తమ వద్ద లేదనే పేర్కొంటున్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 1,213 సంస్థలకు 1,37,342 కేఎల్‌పీడీ సామర్థ్యం కలిగిన ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అందులో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోనే ఉన్నాయి.
అవగాహన లేకనే వ్యతిరేకత అంటున్న పరిశ్రమలు
ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై స్థానికులకు అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తున్నట్టు పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. ఇథనాల్ తయారీ యూనిట్లను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు, స్థానికులు ఇటీవల హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుపై ఎదురవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అనుమతులను తిరిగి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
అనుమతులిచ్చింది నాటి సర్కారే
గత సర్కారు దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ సర్కారు అంటోంది. కేంద్రం కోరిన ఇథనాల్ ఫ్యూయల్ తయారీకి బదులుగా.. ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్, ఇండ్రస్టియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కాహాల్ వంటి ఇతర ఉత్పత్తులకు రాష్ట్ర మంత్రివర్గం 2022లో అనుమతి ఇచ్చిందని చెబుతోంది.
ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ నుంచి ఎన్‌ఓసీ, పర్యావరణ అనుమతులు, ఇతర ఉత్పత్తులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ అంశాల్లో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలను ఉల్లంఘించిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి కేటాయింపులు మాత్రమే జరిగాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment