పరిశ్రమల శాఖలో పైసలిస్తేనే బదిలీలు
22వ తేదీతో ప్రక్రియ ముగిసినా.. బదిలీ చేయకుండా తొక్కిపెట్టిన వైనం
అధిక మొత్తం చెల్లించిన వారికి వెనుక తేదీలతో బదిలీ అంటూ బేరం
గృహ నిర్మాణ శాఖ బదిలీల్లో సిఫార్సులు, సొమ్ములకు పెద్దపీట
రాజకీయ బదిలీల కోసం ఇంధన శాఖపై తీవ్ర ఒత్తిళ్లు
రాష్ట్రంలో అధికారికంగా బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసినప్పటికీ పరిశ్రమల శాఖలో కీలక పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తికాలేదు. పైసలు ఇస్తేనే బదిలీ ఆర్డర్లు ఇస్తామంటూ కీలకస్థాయి అధికారి బేరం పెట్టడంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. జనరల్ మేనేజర్ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల బదిలీల వరకు ఎన్నడూ లేనివిధంగా గడువు ముగిసినా ఆర్డర్లు జారీ చేయకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అడిగిన మొత్తం చెల్లించిన వారికి నచ్చిన చోటకు బదిలీ చేస్తూ పాత తేదీ (బ్యాక్ డేట్)తో ఉత్తర్వులు ఇస్తామంటూ ఉద్యోగులతో నేరుగా బేరాలు సాగిస్తుండటంతో జిల్లాస్థాయి అధికారులు లబోదిబోమంటున్నారు. పిల్లల చదువుల నిమిత్తం ఎప్పటినుంచో బదిలీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆర్డరు కాపీని తొక్కిపెట్టారంటూ ఒక ఉద్యోగి వాపోయారు. ఈ విధంగా పైస్థాయి అధికారి నేరుగా జిల్లాస్థాయి అధికారులకు ఫోన్లు చేసి అడగడం ఇప్పటివరకు ఎప్పుడూ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈసారి నేరుగా ఆయనే ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. సాక్షి, అమరావతి
గృహ నిర్మాణ శాఖలో కాసుల పంట
గృహ నిర్మాణ శాఖలో సాధారణ బదిలీలు కూటమి ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండించాయి. సీనియారిటీ, స్పౌజ్ వంటి నిబంధనలను పక్కనపెట్టి రాజకీయ సిఫార్సులు, వసూళ్లకు పెద్దపీట వేశారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. తన ఓఎస్డీ ద్వారా కీలక ప్రజాప్రతినిధి వసూళ్లకు తెరలేపారు. ఓఎస్డీ నేరుగా డీఈ, ఈఈ, ఎస్‌ఈలకు ఫోన్లు చేసి వసూళ్ల వ్యవహారం చక్కబెట్టినట్టు తెలుస్తోంది.
రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆపైన ముట్టచెప్పిన వారికే కోరిన స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు సిఫార్సు, డబ్బు ఇవ్వని వారికి అప్రాధాన్య పోస్టుల్లోకి నెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టింగ్ కావాల్సిన చోట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు తీసుకోవడం కోసం అక్కడ కూడా రూ.లక్షల్లోనే ఉద్యోగులు ముట్టజెప్పారు. రాజకీయ సిఫార్సులు, డబ్బు చెల్లించిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడం కోసం ఏడాది, రెండేళ్ల క్రితం నియమించిన వారిని వేరే చోటకు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఆదివారంలోగా బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే, సిఫార్సులు, వసూళ్ల ఆధారంగా కోరుకున్న చోట ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో సోమవారానికి తుది జాబితా గృహ నిర్మాణ శాఖకు అందినట్టు తెలిసింది.
పోరుబాటలో ఇంధన శాఖ ఉద్యోగులు!
విద్యుత్ సంస్థల్లో బదిలీలకు ముందే సిఫారసు లేఖలు ఇచ్చిన వైనం బయట పడటంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు కనీస అర్హత ఉన్నవారికే సిఫారసులను అన్వయించేలా తీవ్రంగా కసరత్తు చేశారు. అయినప్పటికీ.. తాము అనుకున్న విధంగానే బదిలీలు జరగాలని, తమ సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని కూటమి నేతలు పట్టుబట్టారు. ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు తమ వారిని ప్రతిపాదించడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో 22వ తేదీకే పూర్తవ్వాల్సిన బదిలీలు 23న కూడా కొనసాగాయి. డిస్కంలలో జూనియర్ లైన్‌మెన్ స్థాయి నుంచి డిప్యూటీ ఇంజనీర్ స్థాయి వరకూ వందల మందిని బదిలీ చేశారు.
రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యుటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. బీసీ, ఓసీ సంఘాల నేతలకు బదిలీ నుంచి మినహాయింపు (ప్రొటెక్షన్) ఇవ్వలేదు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు రెండు సంఘాల ఉద్యోగులు సోమవారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment