కేవలం రెండు వారాల్లో 102 మందికి పైగా స్థానచలనం
వీరిలో 38 మంది ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు
16 మంది డీన్స్ కూడా బదిలీ
కనీస నిబంధనలు పాటించకుండా బదిలీ ఉత్తర్వులు
దూరప్రాంతాలకు బదిలీలతో వర్సిటీ సిబ్బందిలో ఆందోళన
లోకేశ్ సిఫార్సులతోనే వర్సిటీలో ఈ బది‘లీలలు’
ఈ స్థాయిలో బదిలీలు ఆంగ్రూ చరిత్రలో ఇదే తొలిసారి
ఓ సామాజిక వర్గం లక్ష్యంగా చర్యలు
ఆ స్థానాల్లో నేతలకు నచ్చిన వారికి పోస్టింగులు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్షసాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. చివరికి చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాల పైనా పడింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, జాతి గర్వించేలా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా రాజకీయాలకు బలి చేస్తోంది. విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించేందుకు, కక్ష సాధింపు చర్యలకు అధికార కూటమి నేతలు బదిలీలకు తెరతీశారు.
మరీ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లుగా పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం (ఆంగ్రూ)లో కక్ష సాధింపు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఒక చోట పని చేసిన వారిని బదిలీ చేస్తుంటారు.
ఇప్పుడు ఆంగ్రూలో సంబంధిత శాఖామంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు అధికార టీడీపీ కీలక నేతల సిఫార్సులతో అడ్డగోలుగా బదిలీ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం సిబ్బందే లక్ష్యంగా బదిలీలు జరుగుతున్నాయని, ఆ స్థానాల్లో కూటమి నేతలకు నచ్చిన వారికి పోస్టింగులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆంగ్రూ చరిత్రలోనే తొలిసారి
యూనివర్సిటీలో హెచ్‌వోడీలనే కాదు.. బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నిబంధనలకు పాతరేసి మరీ ఇష్టానుసారం బదిలీ చేస్తుండటంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. చివరికి పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను కూడా వదిలి పెట్టలేదు. ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి రెండు వారాల్లోనే 102 మందిని బదిలీ చేశారు. ఇంత మందిని ఒకేసారి బదిలీ చేయడం ఆంగ్రూ చరిత్రలో ఇదే తొలిసారి అని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు 38 మంది ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ డీన్స్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు యూనివర్శిటీ ఆఫీసర్లు, ముగ్గురేసి చొప్పున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లతో పాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్లను కూడా బదిలీ చేశారు. మరికొంత మందిని బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిబంధనలకు పాతరేసి..
సర్వీస్ రూల్స్‌ను సైతం బేఖాతరు చేస్తూ కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీలు చేస్తున్నారని అధ్యాపకులు వాపోతున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నఫళంగా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా శాస్త్రవేత్తలు, అధికారుల కుటుంబ, ఆరోగ్య పరిస్థితులను సైతం పట్టించుకోకుండా బదిలీ చేస్తున్నారని వాపోతున్నారు.
తిరుపతి ఎస్వీ అగ్రి కల్చరల్ కళాశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న 15 మంది అధ్యాపకులు, శాస్త్రవే త్తలను 300 నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉన్న పరిశోధన కేంద్రాలు, కళాశాలలకు బదిలీ చేశారని, పైగా వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసి బదిలీ చేసిన స్థానాలలో చేరాలని ఆదేశించారని తెలిపారు. గతంలో బదిలీ చేయాలని బతిమిలాడినా పట్టించుకోని వర్శిటీ ఉన్నతాధికారులు ఇప్పుడు ఎడాపెడా బదిలీలు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు.
అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు మౌఖికంగా ఆదేశించిన వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బదిలీలు చేస్తున్నారని, ఆ స్థానాల్లో నేతలకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శాస్త్రవేత్తలను ఇష్టానుసారం బదిలీ చేయడం వలన ఆ ప్రభావం పరిశోధనలపై పడుతుందని చెబుతున్నారు. పవిత్రమైన విద్యాలయాల్లో మితివీురిన రాజకీయజోక్యం సరికాదని విద్యా నిపుణులు హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment