పటమట (విజయవాడ ఈస్ట్) : నగరపాలక సంస్థ చేస్తున్న గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) గందరగోళంగా మారింది. సంస్థ ఆదాయం పెంచుకునే క్రమంలో నగరంలోని అన్ని ఆస్తులకు పన్నులు వేయాలన్న సంకల్పంతో తలపెట్టారు. అందులో భాగంగా అసెస్‌మెంట్లను ఫొటోలు తీసుకుని, నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నారా లేదా అంటూ చేస్తున్న సర్వేలో పారదర్శకత కనిపించడం లేదు. మూడు నెలల క్రితం ప్రారంభమైన జీఐఎస్ ద్వారా ఆస్తి పన్నులు పెంచుతారనే అపోహలో కొంతమంది యజమానులు సర్వేకి నిరాకరిస్తున్నారు. దీనికితోడు సర్వేకి వెళ్లిన సిబ్బంది అవగాహన లోపంతో పన్ను చెల్లింపుదారులను కూడా బకాయిదారులుగా గుర్తిస్తూ వారికి నోటీసులు ఇవ్వటంతో ఇది ప్రహసనంగా మారింది.
సమగ్ర సర్వేకి గడువు మరో నెల రోజుల్లో ముగియనుండగా, ఇంత వరకు 30 శాతం కూడా పూర్తవ్వకపోవటంపై ఇటీవల వీఎంసీ కమిషనర్ కూడా సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సర్వే బాధ్యత నిర్వహిస్తోంది. నగరంలోని 59 డివిజన్లలో సుమారు లక్షకు పైగా అసెస్‌మెంట్లు ప్రతి ఏడాది వీఎంసీకి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. పన్నుల పరిధిలోకి మరిన్ని అసెస్‌మెంట్లు వస్తాయని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకునేలా సర్వే జరగటం లేదని, సమగ్ర సర్వే మొత్తం తప్పుల తడకగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
అనంత్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేకి సిబ్బంది కొరత వేధిస్తోంది. 30 టీములు ఉన్నాయని, టీముకు ఇద్దరు చొప్పున ఉన్నా పూర్తిస్థాయిలో సర్వే జరగకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. సర్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతున్నాయని, వీఎంసీ అధికారులను సంప్రదించకుండా డోర్‌లాక్ అసెస్మెంట్లను బకాయిదారులుగా గుర్తించి వారికి నోటీసులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డివిజన్‌కు నాలుగు టీముల చొప్పున 240 మంది సర్వే సిబ్బంది అవసరమవుతుందని అధికారులు సమీక్ష సమావేశాల్లో కమిషనర్‌కు విన్నవించుకున్నారు. ఆ విన్నపాన్ని సర్వే చేస్తున్న అనంత్ టెక్నాలజీస్ పెడచెవిన పెడుతోందని వీఎంసీ అధికారులు వాపోతున్నారు.
జీఐఎస్ అంటే..
జీఐఎస్ ద్వారా భవన వాడుక స్వభావం, వివరాలు సేకరించి శాటిలైట్ చిత్రం ద్వారా ప్రత్యేక భౌగోళిక పటం తయారుచేస్తారు. దీనిద్వారా భవన నిర్మాణాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల సమాచారం, తాగునీరు, పైపులైన్ల వివరాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సెల్‌ఫోన్ టవర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వివరాలు, మార్కెట్‌లు, సినిమా హాళ్లు, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటివి గుర్తించి వాటికి ప్రత్యేక నంబరును కేటాయిస్తారు.
రూ.125 కోట్ల టార్గెట్..
నగరంలోని ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్, ప్రొఫెషనల్ టాక్స్‌ల ద్వారా రూ.125 కోట్లు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఉండే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు, బిల్ కలెక్టర్లు నెలకు 100 అసెస్‌మెంట్ల నుంచి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ఇదే విధానంలో రూ.100 కోట్లు టార్గెట్ విధించినప్పటికీ రూ.91.32 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. రాజధాని నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అసెస్‌మెంట్లు పెరుగుతున్నాయని, దీనికితోడు సర్వే ద్వారా నూతనంగా కొన్ని అసెస్‌మెంట్లు గుర్తించగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరింత మందినిఏర్పాటు చేయమన్నాం..
నగరంలోని అన్ని డివిజన్లలో సర్వే జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తున్న సిబ్బందికి ఏరియా వారీగా వివరాలు లేకపోవటంతో తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మేం కూడా విచారిస్తున్నాం. ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ఏరియాలో విధులు నిర్వహించే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, బిల్ కలెక్టర్‌ను సంప్రదించాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవటం కూడా మరో సమస్య. అన్ని డివిజన్లలో సర్వే పూర్తి చేయాలంటే సుమారు 250 మంది సిబ్బంది అవసరమవుతారు. దీనిపై అధికారులకు కూడా వివరించాం.
–జి.సుబ్బారావు,డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ)
Comments
Please login to add a commentAdd a comment