సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం కావటంతో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)ను అమెరికా ప్రభుత్వంతోపాటు నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంటర్నేష నల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) వేదికగా సమ్మిట్ ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరిగే సదస్సును మొత్తం 53 సెషన్లుగా వర్గీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును సైతం సిద్ధం చేశారు. ప్రధానంగా హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి 4 ప్రధాన రంగాల్లోని ఆవిష్కరణలపై సదస్సులో లోతుగా చర్చించనున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.
ఏటా జరిగే ఈ సదస్సుకు దక్షిణాసియా దేశం ఆతిథ్యమివ్వటం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల బృందం సదస్సుకు తరలిరానుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సదస్సులో మొదటి రోజున ప్రారంభోత్సవ వేదికపైనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వాన ప్రసంగం చేస్తారు. అనంతరం ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధికారత, స్వావలంబన లక్ష్యాలుగా మహిళలకు ప్రాధాన్యమివ్వటంతో ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. ‘మహిళలు ముందుంటే.. అందరికీ శ్రేయస్సు’అనే సందేశంతో పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక ఆలోచనలను ఈ వేదికపై పంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార అవకాశాలు, కొత్త ఆలోచనలు, పెట్టుబడులు, వ్యాపార రంగంలో శరవేగంగా చొచ్చుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై ఈ సదస్సులో 53 చర్చాగోష్టులు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును సిద్ధం చేశారు. అయితే ప్రజెంటేషన్లకు సంబంధించి స్పష్టత రాలేదు. కొందరు పారిశ్రామికవేత్తలు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా.. కొందరు ప్రజెంటేషన్లు రద్దు చేసుకుంటున్నారు. దీంతో కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, పెట్టుబడిదారుల్లో ఎక్కువమంది కొత్తగా స్టార్టప్స్‌ను ప్రారంభించిన వారు, కొత్త వ్యాపారాలు ఆరంభించినవారున్నారు.
ధోని, దీపికలకు ఆహ్వానం.. రాలేమని సమాచారం
సదస్సుకు క్రీడా రంగం నుంచి ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని ఆహ్వానించారు. అయితే సొంత కారణాలతో సదస్సుకు రాలేకపోతున్నట్లు ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే కూడా సదస్సులో పాల్గొనాల్సి ఉండగా, కార్యక్రమం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారని తెలిసింది. సదస్సులో జరిగే చర్చాగోష్టిలో ‘హాలీవుడ్ టు నాలీవుడ్ టు బాలీవుడ్’అనే అంశంపై ఆమె ప్రసంగించాల్సి ఉంది. ఇక ఆహ్వానం అందుకున్న ఇతర క్రీడాకారులు సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్ హాజరవుతారు.
గోల్కొండ కోటలో సీఎం విందు
సదస్సు రెండో రోజు సాయంత్రం అతిథులందరికీ గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ విందు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున గోల్కొండ ఆర్ట్ మెమెంటో, పోచంపల్లి దుస్తులతో చేయించిన గిఫ్ట్ ప్యాక్‌లను కానుకలుగా ఇవ్వ నున్నారు. తెలంగాణ ప్రాముఖ్యత, టూరిజం విశేషాలను అందులో పొందుపరచనున్నారు.
వచ్చే ఏడాది మరో సదస్సు
పారిశ్రామిక సదస్సు నిర్వహణ అనుభవాలతో వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ఐటీ కాన్ఫరెన్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఇండియాలోనే మొదటిసారి జరగనున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
60 అధునాతన బస్సులు సిద్ధం
అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు గ్రేటర్ ఆర్టీసీ అధునాతన బస్సులను సిద్ధం చేసింది. సమ్మిట్ జరగనున్న హెచ్‌ఐసీసీతోపాటు, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌లకు ప్రతినిధులను తరలించేందుకు 60 బస్సులను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ మేనేజర్ కొమరయ్య నేతృత్వంలో అధికారులు సోమవారం ఫలక్‌నుమా వద్ద బస్సుల రాకపోకలను పరిశీలించారు. బస చేసే హోటళ్ల నుంచి ప్రతినిధులను హెచ్‌ఐసీసీకి తరలించడం తిరిగి హోటళ్లకు తీసుకెళ్లడంతోపాటు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్న విందుకు, గోల్కొండ కోట సందర్శనకు ఆర్టీసీ బస్సులు నడపనుంది.
300 మంది పెట్టుబడిదారుల రాక
దేశ విదేశాల నుంచి దాదాపు 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. వీరిలో 500 మంది భారతీయులు కాగా, అందులో 74 మంది రాష్ట్రానికి చెందిన వారున్నారు. 300 మంది పెట్టుబడిదారులు హాజరవుతుండగా అందులో 100 మంది దేశం నుంచి, 100 మంది అమెరికా నుంచి, మరో 100 మంది ఇతర దేశాల వారు ఉండనున్నారు.
గోప్యంగా ఇవాంకా పర్యటన
ఇవాంకా ట్రంప్ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అధికారిక హోదాలో విమానాశ్రయంలో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు కూడా ఎవరు రావద్దని అగ్రరాజ్యం భద్రతా అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. ఇవాంకా ఎన్నింటికి వస్తారు, ఎక్కడ బస చేస్తారు, ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారనేదంతా రహస్యమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోదీ అదే రోజున కొందరు పెట్టుబడిదారులతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన కెనడాలో స్థిరపడ్డ ప్రముఖ వ్యాపార వేత్త ప్రేమ్ శ్రీవాస్తవ, అమెరికాకు చెందిన సిస్కో కంపెనీ యజమాని జాన్ చాంబర్స్‌తోపాటు పది మంది పెట్టుబడిదారులతో మోదీ భేటీ కానున్నారు.
ప్రసంగించేది ముగ్గురే..
సదస్సు ప్రారంభోత్సవంలో కేవలం ముగ్గురు వక్తలు మాత్రమే ప్రసంగించనున్నారు. 28న సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, అనంతరం ఇవాంకా ట్రంప్ ప్రసంగిస్తారు. చివరగా సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం హెచ్‌ఐసీసీలో ఎలాంటి వేదికను ఏర్పాటు చేయడం లేదు. మోదీ, ఇవాంకా, కేసీఆర్ మొదటి వరుసలో ఆసీనులు కానున్నారు. సదస్సులో తెలంగాణ ప్రత్యేకతలపై ఎగ్జిబిషన్, కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా నిర్వాహకులు అనుమతించలేదు. కేవలం స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలు పంచుకోవటం, పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సదస్సు కార్యక్రమాలను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment