
జీఐఎస్‌తో అక్రమ నిర్మాణాలకు చెక్
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో త్వరలో జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) శాటిలైట్ టెక్నాలజీ ద్వారా భవన నిర్మాణాల పర్యవేక్షణ, ప్రణాళికలు అమలు చేయనున్నా రు.
సాక్షి, చిత్తూరు :
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో త్వరలో జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) శాటిలైట్ టెక్నాలజీ ద్వారా భవన నిర్మాణాల పర్యవేక్షణ, ప్రణాళికలు అమలు చేయనున్నా రు. వీలైనంత త్వరలో ఈ హైటెక్ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు. తిరుపతిలో జనవరి 18న నిర్వహించిన టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. జీఐఎస్ ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం పనుల పర్యవేక్షణ, అమలు చేపట్టాల ని, ఇందుకు అవసరమైన టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని ఇప్పటికే విజయవాడలో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. శాంపిల్ సర్వే చేసి ఆస్తి గుర్తింపుకార్డులు (ప్రాపర్టీ ఐడీ) జారీ చేశారు. ఈ క్రమంలో జీఐఎస్ పద్ధతి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వస్తే ఉద్యోగులు లంచా లు తీసుకుని చూసీచూడనట్లు భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి బ్రేక్ పడుతుంది. చాలా వరకు ప్రణాళిక విభాగాల్లో అక్రమాలను నిరోధించేందుకు అవకాశం ఉంటుంది.
జీఐఎస్ అంటే ?
జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(జీఐఎస్)లో అంతరిక్షంలోని శాటిలైట్ ద్వారా భూమిపైన వివిధ పట్టణాల్లో నిర్మిస్తున్న భవనాల ఆకృతులు, వాటి కొలతలను ఫొటోలు తీయడం, ఈ వివరాలు కంప్యూటర్లలో ఆన్‌లైన్ ద్వారా నిక్షిప్తం చేస్తారు. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన వివరాల ఆధారంగా నిర్మాణంలో ఎంతవరకు నిబంధనలు పాటిం చారనే విషయాలను పరిశీలించవచ్చు. ప్రణాళిక విభాగం సిబ్బందితో ప్రమేయం లేకుండా జీఐఎస్‌ను ఏజెన్సీలు అమలు చేస్తాయి. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవనాల వివరాలను శాటిలైట్ ద్వారా కంప్యూటర్‌కు ఆన్‌లైన్ ద్వారా పంపి నిక్షిప్తం చేస్తారు. ఈ వివరాలు, యజమానులు దరఖాస్తు చేసిన భవనాల నిర్మాణ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది జీఐఎస్ ద్వారా సరిచూస్తారు. నిబంధనల ఉల్లంఘన ఉంటే అనుమతులు ఇవ్వరు. జీఐఎస్ ద్వారా సేకరించిన సమాచారానికి, భవన యజమాని సమర్పించిన వివరాలు సరిపోలితే ఎవరి సిఫార్స్ లేకుండానే అనుమతి లభిస్తుంది. ఇప్పటికే ఈ పద్ధతిని జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తున్నారు.
విజయవాడలో పెలైట్ సర్వే
జీఐఎస్ పద్ధతి ద్వారా భవన నిర్మాణాల పర్యవేక్షణ, అనుమతుల జారీ వ్యవహారానికి సంబంధించి పెలైట్ ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. విజయవాడ నగరంలో ప్రాంతాలవారీ గా ఈ తరహా సర్వే చేసి ప్రాపర్టీ ఐడీకార్డులు(ఆస్తి గుర్తిం పు కార్డులు) జారీ ప్రక్రియ ప్రారంభించారు. దీనివల్ల ఎంతో ఉపయోగం. భవన నిర్మాణం పూర్తికాగానే భవన విస్తీర్ణం, ఎన్ని అంతస్తులు, ఏ తరహా నిర్మాణం, యజ మాని పేరు, రేషన్‌కార్డు నెంబరు, ఓటరు ఐడీ కార్డు, ఆధార్‌కార్డు నంబరు ఇలా బహుళ రకాలైన వివరాలను ప్రాపర్టీ ఐడీ కార్డులో పొందుపరుస్తారు. ఐడీ కార్డులోని అసెస్‌మెంట్ నంబరును చూసి ఆస్తి పన్ను కట్టవచ్చు. ఇతర వివరాలు కావాలన్నా ఈ కార్డులో చూసి తెలుసుకోవచ్చు. దీనివల్ల భవన యజమాని ఆస్తికి గుర్తింపు ఉంటుంది. జిల్లాలో ఈ తరహా ప్రక్రియకు తెరలేస్తే చాలా వరకు ప్లానింగ్ సిబ్బంది చేతివాటానికి తెరపడుతుంది. అలాగే భవన యజమానులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించి, మున్సిపాలిటీల చుట్టూ నెలలు తిరగకుండా పని చేసుకునేందుకు వీలు కలుగుతుంది.