satellite technology
-
సెట్‌టాప్ బాక్స్‌ల్లేకుండానే టీవీ కార్యక్రమాలు
ముంబై: టీవీల్లో తయారీ సమయంలోనే శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో సెట్‌టాప్ బాక్స్ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. టీవీల్లో శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయడం వల్ల ఉచిత టీవీ చానళ్లను చూడడానికి వీలవుతుంది. రేడియో చానళ్ల ప్రసారాలను కూడా వినొచ్చు. విండో వద్ద లేదంటే మేడ పైన చిన్న యాంటెన్నా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉన్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌కు గత డిసెంబర్లో అనురాగ్ సింగ్ ఠాకూర్ లేఖ కూడా రాయడం గమనార్హం. -
కచ్చితంగా పంట నష్టం అంచనా!
• ఉపగ్రహ పరిజ్ఞానం వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే • పరిజ్ఞానాన్ని రూపొందించిన ‘ఇరి’... ఇప్పటికే తమిళనాడులో అమలు • ప్రతి ఎకరా భూమినీ పరిశీలించొచ్చు • నష్టం జరిగిన 15 రోజుల్లోనే అంచనా.. వెంటనే రైతుకు బీమా పరిహారం • నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఏటా రైతులు కరువు, భారీ వర్షాలు, వడగళ్ల వంటి ఏదో ఓ సమస్యతో నష్టపోతూనే ఉన్నారు. పంట నష్టం ఎంత అనేదానికి కచ్చితమైన అంచనా ఉండడం లేదు. స్థానిక అధికారులు వెళ్లి పరిశీలించడం.. పంట కోత ప్రయోగాలు చేయడం జరుగుతోంది.. ఇందుకు నెలలకొద్దీ సమయం పట్టడంతోపాటు బీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులకు సరిగా పరిహారం చెల్లించడం లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు ఫిలిప్పీన్‌సలోని ‘అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఇరి)’ ఉపగ్రహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. వరి దిగుబడి, ధాన్యం రంగు మారితే తెలుసుకోవడం, చీడపీడలతో పంట దెబ్బతినడం వంటివాటన్నింటినీ ఈ పరిజ్ఞానంతో తెలుసుకోవడానికి వీలవుతుంది. తాజాగా దీనిని తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణరుుంచింది. ఇప్పటికే తమిళనాడులో అమలవుతున్న ఈ పరిజ్ఞానంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల బృందం ఇటీవలే అధ్యయనం చేసి వచ్చింది. ఆ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 24.65 లక్షల ఎకరాలుకాగా.. ఈ పరిజ్ఞానం అమలు కోసం మూడేళ్లకు రూ.7.4 కోట్లు ఖర్చవుతుంది. అరుుతే తొలుత దీనిని నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ రెండు జిల్లాలో రూ.16 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. 12 రోజులకోసారి ఉపగ్రహ చిత్రాలు ‘ఇరి’ అభివృద్ధి చేసిన ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే.. ముందుగా సంబంధిత గ్రామాల వారీ భూముల వివరాలు, వాటి సారం, విస్తీర్ణం, నీటి లభ్యత, రైతుల సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ‘ఇరి’ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం ‘ఇరి’ శాస్త్రవేత్తల బృందం ఫిలిప్పీన్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తుంది. మూడేళ్లలో ఒక ఎకరా భూమికి రూ.30 చొప్పున ఫీజు వసూలు చేస్తుంది. తర్వాత అభివృద్ధి పరిచిన లేబొరేటరీని ప్రభుత్వానికి అప్పగిస్తుంది. మొత్తం ఉపగ్రహ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, దానికి సమాచారాన్ని అనుసంధానం చేశాక... రైతు వారీగా, గ్రామం వారీగా, మండలం వారీగా ప్రతి 12 రోజులకోసారి వరి పంటల ఛాయాచిత్రాలు ఉపగ్రహం ద్వారా లేబొరేటరీకి అందుతారుు. వాటిని విశ్లేషించి పంట దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది, కరువు వల్ల దిగుబడి తగ్గుతుందా, వరదలు వడగళ్ల వర్షం వంటివాటితో ధాన్యం రంగు మారిందా... తదితర అంశాలను 90 శాతం కచ్చితంగా అంచనా వేస్తారు. ఈ పరిజ్ఞానం నష్టం జరిగిన 15 రోజుల్లోపులోనే సమగ్ర వివరాలను అందజేస్తుంది, ప్రతీ ఎకరా భూమిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. ఆ ప్రకారం రైతులకు ఆయా కంపెనీలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుండదని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది ఉపగ్రహ ఆధారిత పరిజ్ఞానంతో కూడిన సమాచారంతోనే రైతులకు పంటల బీమా అందజేయాలని నిర్ణరుుంచడంతో.. అక్కడ అనేక ప్రైవేటు కంపెనీలు టెండర్లో పాల్గొనలేదని ఓ అధికారి తెలిపారు. కేవలం ప్రభుత్వ బీమా కంపెనీయే ముందుకు వచ్చిందని చెప్పారు. ఇతర పంటలకు కూడా వర్తింపజేస్తాం ‘ప్రస్తుతం వరి పంటకు మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో కీలక పంటలైన పత్తి, మొక్కజొన్న, సోయాలకు కూడా అమలుచేసే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం వెతుకుతాం. ప్రస్తుత రబీలో వరి పంటకు ప్రయోగాత్మకంగా అమలుచేయాలని అనుకుంటున్నాం..’’ -పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
జీఐఎస్‌తో అక్రమ నిర్మాణాలకు చెక్
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో త్వరలో జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) శాటిలైట్ టెక్నాలజీ ద్వారా భవన నిర్మాణాల పర్యవేక్షణ, ప్రణాళికలు అమలు చేయనున్నా రు. వీలైనంత త్వరలో ఈ హైటెక్ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు. తిరుపతిలో జనవరి 18న నిర్వహించిన టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. జీఐఎస్ ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం పనుల పర్యవేక్షణ, అమలు చేపట్టాల ని, ఇందుకు అవసరమైన టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని ఇప్పటికే విజయవాడలో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. శాంపిల్ సర్వే చేసి ఆస్తి గుర్తింపుకార్డులు (ప్రాపర్టీ ఐడీ) జారీ చేశారు. ఈ క్రమంలో జీఐఎస్ పద్ధతి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వస్తే ఉద్యోగులు లంచా లు తీసుకుని చూసీచూడనట్లు భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి బ్రేక్ పడుతుంది. చాలా వరకు ప్రణాళిక విభాగాల్లో అక్రమాలను నిరోధించేందుకు అవకాశం ఉంటుంది. జీఐఎస్ అంటే ? జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(జీఐఎస్)లో అంతరిక్షంలోని శాటిలైట్ ద్వారా భూమిపైన వివిధ పట్టణాల్లో నిర్మిస్తున్న భవనాల ఆకృతులు, వాటి కొలతలను ఫొటోలు తీయడం, ఈ వివరాలు కంప్యూటర్లలో ఆన్లైన్ ద్వారా నిక్షిప్తం చేస్తారు. కంప్యూటర్లో నిక్షిప్తం చేసిన వివరాల ఆధారంగా నిర్మాణంలో ఎంతవరకు నిబంధనలు పాటిం చారనే విషయాలను పరిశీలించవచ్చు. ప్రణాళిక విభాగం సిబ్బందితో ప్రమేయం లేకుండా జీఐఎస్‌ను ఏజెన్సీలు అమలు చేస్తాయి. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవనాల వివరాలను శాటిలైట్ ద్వారా కంప్యూటర్‌కు ఆన్లైన్ ద్వారా పంపి నిక్షిప్తం చేస్తారు. ఈ వివరాలు, యజమానులు దరఖాస్తు చేసిన భవనాల నిర్మాణ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది జీఐఎస్ ద్వారా సరిచూస్తారు. నిబంధనల ఉల్లంఘన ఉంటే అనుమతులు ఇవ్వరు. జీఐఎస్ ద్వారా సేకరించిన సమాచారానికి, భవన యజమాని సమర్పించిన వివరాలు సరిపోలితే ఎవరి సిఫార్స్ లేకుండానే అనుమతి లభిస్తుంది. ఇప్పటికే ఈ పద్ధతిని జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్నారు. విజయవాడలో పెలైట్ సర్వే జీఐఎస్ పద్ధతి ద్వారా భవన నిర్మాణాల పర్యవేక్షణ, అనుమతుల జారీ వ్యవహారానికి సంబంధించి పెలైట్ ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. విజయవాడ నగరంలో ప్రాంతాలవారీ గా ఈ తరహా సర్వే చేసి ప్రాపర్టీ ఐడీకార్డులు(ఆస్తి గుర్తిం పు కార్డులు) జారీ ప్రక్రియ ప్రారంభించారు. దీనివల్ల ఎంతో ఉపయోగం. భవన నిర్మాణం పూర్తికాగానే భవన విస్తీర్ణం, ఎన్ని అంతస్తులు, ఏ తరహా నిర్మాణం, యజ మాని పేరు, రేషన్‌కార్డు నెంబరు, ఓటరు ఐడీ కార్డు, ఆధార్‌కార్డు నంబరు ఇలా బహుళ రకాలైన వివరాలను ప్రాపర్టీ ఐడీ కార్డులో పొందుపరుస్తారు. ఐడీ కార్డులోని అసెస్మెంట్ నంబరును చూసి ఆస్తి పన్ను కట్టవచ్చు. ఇతర వివరాలు కావాలన్నా ఈ కార్డులో చూసి తెలుసుకోవచ్చు. దీనివల్ల భవన యజమాని ఆస్తికి గుర్తింపు ఉంటుంది. జిల్లాలో ఈ తరహా ప్రక్రియకు తెరలేస్తే చాలా వరకు ప్లానింగ్ సిబ్బంది చేతివాటానికి తెరపడుతుంది. అలాగే భవన యజమానులు ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించి, మున్సిపాలిటీల చుట్టూ నెలలు తిరగకుండా పని చేసుకునేందుకు వీలు కలుగుతుంది.