కచ్చితంగా పంట నష్టం అంచనా!
• ఉపగ్రహ పరిజ్ఞానం వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే
• పరిజ్ఞానాన్ని రూపొందించిన ‘ఇరి’... ఇప్పటికే తమిళనాడులో అమలు
• ప్రతి ఎకరా భూమినీ పరిశీలించొచ్చు
• నష్టం జరిగిన 15 రోజుల్లోనే అంచనా.. వెంటనే రైతుకు బీమా పరిహారం
• నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఏటా రైతులు కరువు, భారీ వర్షాలు, వడగళ్ల వంటి ఏదో ఓ సమస్యతో నష్టపోతూనే ఉన్నారు. పంట నష్టం ఎంత అనేదానికి కచ్చితమైన అంచనా ఉండడం లేదు. స్థానిక అధికారులు వెళ్లి పరిశీలించడం.. పంట కోత ప్రయోగాలు చేయడం జరుగుతోంది.. ఇందుకు నెలలకొద్దీ సమయం పట్టడంతోపాటు బీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులకు సరిగా పరిహారం చెల్లించడం లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు ఫిలిప్పీన్‌సలోని ‘అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఇరి)’ ఉపగ్రహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. వరి దిగుబడి, ధాన్యం రంగు మారితే తెలుసుకోవడం, చీడపీడలతో పంట దెబ్బతినడం వంటివాటన్నింటినీ ఈ పరిజ్ఞానంతో తెలుసుకోవడానికి వీలవుతుంది.
తాజాగా దీనిని తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణరుుంచింది. ఇప్పటికే తమిళనాడులో అమలవుతున్న ఈ పరిజ్ఞానంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల బృందం ఇటీవలే అధ్యయనం చేసి వచ్చింది. ఆ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 24.65 లక్షల ఎకరాలుకాగా.. ఈ పరిజ్ఞానం అమలు కోసం మూడేళ్లకు రూ.7.4 కోట్లు ఖర్చవుతుంది. అరుుతే తొలుత దీనిని నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ రెండు జిల్లాలో రూ.16 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.
12 రోజులకోసారి ఉపగ్రహ చిత్రాలు
‘ఇరి’ అభివృద్ధి చేసిన ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే.. ముందుగా సంబంధిత గ్రామాల వారీ భూముల వివరాలు, వాటి సారం, విస్తీర్ణం, నీటి లభ్యత, రైతుల సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ‘ఇరి’ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం ‘ఇరి’ శాస్త్రవేత్తల బృందం ఫిలిప్పీన్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తుంది. మూడేళ్లలో ఒక ఎకరా భూమికి రూ.30 చొప్పున ఫీజు వసూలు చేస్తుంది. తర్వాత అభివృద్ధి పరిచిన లేబొరేటరీని ప్రభుత్వానికి అప్పగిస్తుంది. మొత్తం ఉపగ్రహ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, దానికి సమాచారాన్ని అనుసంధానం చేశాక... రైతు వారీగా, గ్రామం వారీగా, మండలం వారీగా ప్రతి 12 రోజులకోసారి వరి పంటల ఛాయాచిత్రాలు ఉపగ్రహం ద్వారా లేబొరేటరీకి అందుతారుు.
వాటిని విశ్లేషించి పంట దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది, కరువు వల్ల దిగుబడి తగ్గుతుందా, వరదలు వడగళ్ల వర్షం వంటివాటితో ధాన్యం రంగు మారిందా... తదితర అంశాలను 90 శాతం కచ్చితంగా అంచనా వేస్తారు. ఈ పరిజ్ఞానం నష్టం జరిగిన 15 రోజుల్లోపులోనే సమగ్ర వివరాలను అందజేస్తుంది, ప్రతీ ఎకరా భూమిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. ఆ ప్రకారం రైతులకు ఆయా కంపెనీలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుండదని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది ఉపగ్రహ ఆధారిత పరిజ్ఞానంతో కూడిన సమాచారంతోనే రైతులకు పంటల బీమా అందజేయాలని నిర్ణరుుంచడంతో.. అక్కడ అనేక ప్రైవేటు కంపెనీలు టెండర్‌లో పాల్గొనలేదని ఓ అధికారి తెలిపారు. కేవలం ప్రభుత్వ బీమా కంపెనీయే ముందుకు వచ్చిందని చెప్పారు.
ఇతర పంటలకు కూడా వర్తింపజేస్తాం
‘ప్రస్తుతం వరి పంటకు మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో కీలక పంటలైన పత్తి, మొక్కజొన్న, సోయాలకు కూడా అమలుచేసే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం వెతుకుతాం. ప్రస్తుత రబీలో వరి పంటకు ప్రయోగాత్మకంగా అమలుచేయాలని అనుకుంటున్నాం..’’ -పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి