కరువు రైతుకు చేయూత ప్రశ్నార్థకమే
గత ఖరీఫ్‌లో 1.18 లక్షల
హెక్టార్లలో వేరుశెనగ పంట నష్టం
రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారుల నివేదిక
రూ.108 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా
అందించాలని ప్రతిపాదనలు
నోరుమెదపని సర్కారు
గత ఖరీఫ్‌లో వర్షాభావంతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ.. బీమా పరిహారం మంజూరు ప్రశ్నార్థకంగా మారాయి. సర్కారు దాటవేత వైఖరి అనుసరిస్తోంది. బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహిస్తారు.. ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం చెల్లింపులకు ఎన్ని నిధులు కేటాయిస్తారన్నది వెల్లడైతేనే వాటి మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాల్లేవని ప్రభుత్వం చెబుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తిరుపతి: గత ఖరీఫ్‌లో 1,36,400 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువగా 1.18 లక్షల హెక్టార్లలో మాత్రమే వేరుశెనగ పంటను సాగు చేశారు. వేరుశెనగ సాగు రైతులకు తీవ్ర నష్టాలను మిగి ల్చింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టుబడులు, దిగుబడుల రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాగం అప్పట్లో నివేదిక పంపింది. పంట నష్టపోయిన 1.2 లక్షల మంది రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీగా అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 2010 ఖరీఫ్ నుంచి వేరుశెనగ పంటకు వాతావరణ బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. ప్రీమియం కింద రైతులు రూ.23 కోట్లకుపైగా బీమా సంస్థకు చెల్లించారు. వర్షాభావ పరిస్థితుల రీత్యా పంట నష్టపోయిన నేపథ్యంలో వాతావరణ బీమా కింద కనీసం రూ.60 కోట్లకు పైగా పరిహారాన్ని వేరుశెనగ రైతులకు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. సీఆర్‌ఎఫ్ (కెలామిటీ రిలీఫ్ ఫండ్) నిధులతో ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం సీఆర్‌ఎఫ్‌కు 55 శాతం నిధులను సమకూర్చితే తక్కిన 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి.
ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టాయి. ఆ బడ్జెట్లో ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరుకు నిధులు కేటాయించలేదు. జూలై 10న 2014-15కు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. కానీ శాసనసభలో ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడుతుందన్న అంశంపై స్పష్టత లేదు. సెప్టెంబరు వరకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కనీసం సెప్టెంబరులో ప్రవేశపెట్టే బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన మేరకు నిధులు కేటాయిస్తేనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరయ్యే అవకాశం ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించి.. భవితపై భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం దాటవేత వైఖరి అనుసరిస్తోండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.