అన్నదాత.. గుండెకోత! | పండిన పంటకు మద్దతు ధరలేదు | Sakshi
Sakshi News home page

అన్నదాత.. గుండెకోత!

Published Fri, Dec 26 2014 12:41 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

అన్నదాత.. గుండెకోత! - Sakshi

అన్నదాత.. గుండెకోత!

ఈ ఏడాది రైతన్నకు కష్టాలే
పండిన పంటకు మద్దతు ధరలేదు
రుణమాఫీ అంతంతే..
బతుకుపై భరోసాలేక ఆత్మహత్యలు..
ఇప్పటివరకు 43మంది అన్నదాతల బలవన్మరణాలు

 
ప్రకృతి రైతన్నపై కనికరం చూపలేదు. ఖరీఫ్ నుంచే కన్నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. రబీలో కరెంట్‌బాధలు, వడగండ్ల వానలు రైతన్నను నిండాముంచాయి. కష్టాలు ఓర్చుకుని సాగు  చేసినా పండిన పంటకు మద్దతుధర రాక విలవిల్లాడారు. నకిలీ విత్తనాలు, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, మార్కెటింగ్, మద్దతు ధర ఇలా అన్నివిధాలుగా అన్నదాతకు 2014 కన్నీటికష్టాలను మిగిల్చింది.
 మహబూబ్‌నగర్
 
మహబూబ్‌నగర్ : గతేడాది భారీ వర్షాల కారణంగా రైతులు రబీసాగుపై కోటి ఆశలతో సాగు చేపట్టారు. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడడం, మరోవైపు భూగర్భజలమట్టం పెరగడంతో రైతులు పెద్దఎత్తున సాగు చేశారు. దీంతో సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 1.93లక్షల హెక్టార్లు కాగా... 2.73లక్షల హెక్టార్లు సాగైంది. అంటే సాధారణ సాగు కంటే 80వేల హెక్టార్లు అదనంగా సాగైంది. అత్యధికంగా వరిసాగు 1.10 లక్షల హెక్టార్లలో సాగైంది. వేరుశెనగ  1.05లక్షల హెక్టార్లు, పప్పుశనగ 36వేల హెక్టార్లు, జొన్న 16,500 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 15వేల హెక్టార్లు, మొక్కజొన్న 5వేల హెక్టార్లలో సాగయ్యాయి. గతేడాది భారీ వర్షాల కారణంగా నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయనే ఆలోచనతో సాగుచేసిన రైతన్న ఆశలు అడియాశలయ్యాయి. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌కోతల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోత దశకు వచ్చేసరికి ప్రకృతి పగబట్టింది. ఏప్రిల్, మే నెలలో కురిసిన భారీ వడగండ్ల వానకు వరిచేన్లు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట 70శాతానికి పైగా మట్టిపాలైంది. అన్ని కష్టాలకోర్చి పండించిన పంటకు మద్దతు ధర అందలేదు. మరోవైపు ఏడాదికి ఒకసారి వచ్చే పండ్ల తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగండ్ల దాటికి మామిడి రైతులకు చేదు అనుభవం మిగిల్చింది.
 
రోడ్డెక్కిన వేరుశనగ రైతులు...
 
రబీ సీజన్‌లో వేరుశనగ రైతుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. కరెంట్ కోతల కారణంగా సకాలంలో నీరందక, మచ్చ తెగుళ్ల కారణంగా దిగుబడి సాక్షి, మహబూబ్‌నగర్ భారీగా తగ్గిపోయింది. ఎకరాకు 21నుంచి 26 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 13 క్వింటాళ్లకు పడిపోయింది. అనేక ఒడిదుడుకుల నేపధ్యంలో పంట నాణ్యత భారీగా దెబ్బతిన్నది. దీంతో గిట్టుబాటు ధర కూడా అందలేదు. ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ వంటి సంస్థలు కొనుగోలు చేయక ముఖం చాటేశాయి. క్వింటాల్‌కు రూ.4వేల మద్దతు ధరకు కేవలం రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు మాత్రమే దక్కింది. మద్దతు ధర కోసం అన్నదాతలు మార్కెట్‌యార్డులలో రోజుల తరబడి ధర్నాలు చేశారు. కొన్నిచోట్ల ఓపిక నశించి రహదారుల దిగ్బంధం చేశారు. ఆఖరికి అప్పుడు విపక్షంలో ఉన్న ఇప్పటి అధికార పార్టీ నేతలు, రైతులు ఏకమై కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.
 
ఇన్‌పుట్ సబ్సిడీదీ  గందరగోళమే..!
 
ఈ ఏడాది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కాస్త ఊరటనిచ్చింది. మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ ఏడాది ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. అయితే వీటిలోనూ రైతులను వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు కుమ్మక్కై రైతులను దగాకు గురిచేశాయి. జిల్లా వ్యాప్తంగా 2.20లక్షల మంది రైతులకు రూ.99.78 కోట్లు విడుదలైంది. ఇందుకు సంబంధించి రైతుల బ్యాంక్ ఖాతాలో ఇప్పటివరకు రూ.89.61 కోట్లు మాత్రమే జమయ్యాయి. మిగతా పది కోట్ల వరకు డబ్బు ఎక్కడుందో వాటికి లెక్కలే లేవు.
 
ఆగమాగమైన ఖరీఫ్...

 
ఈ ఏడాది ఖరీఫ్ సాగు అన్నదాతకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సీజన్ ప్రారంభం నుంచి కూడా సకాలంలో వానలు కురవకపోవడంతో సాగు కూడా అంతంతమాత్రంగానే సాగింది. జిల్లాలో మొత్తం 7.69లక్షల హెక్టార్లలో పంట సాగవగా అందులో అత్యధికంగా పత్తి 2.60 లక్షల హెక్టార్లలో పత్తిసాగైంది. మొక్కజొన్న 1.68లక్షల హెక్టార్లు, వరి 1.07లక్షల హెక్టార్లు, కంది 1.03లక్షల హెక్టార్లు, ఆముదం 50వేల హెక్టార్లు, జొన్న 20వేల హెక్టార్లు ఇలా తదితర పంటలు సాగయ్యాయి. అయితే నకిలీ విత్తనాల కారణంగా చాలాచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండుమార్లు సాగు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. వర్షాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తొలకరి వానలు కురిసిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు వానలు లేక లేకపోవడంతో కాస్తో కూస్తో మొలిచిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎదుగుదల లేక చేలన్నీ గిడుసువారిపోయాయి. మొక్కజొన్న పరిస్థితి దారుణంగా తయారైంది. సరిగ్గా కాత కాసే సమయంలో వానలు ఎగ్గొట్టడంతో దాదాపు 40వేల నుంచి 80వేల హెక్టార్ల వరకు పంట దెబ్బతిన్నదని స్వయంగా వ్యవసాయశాఖ నివేదిక రూపొందించింది. చాలాచోట్ల చేలు ఎండిపోవడంతో పశువుల మేతకు అమ్ముకున్నారు. గతేడాది వర్షాల కారణంగా భూగర్భజలాలు కాస్త పుష్కలంగా ఉండడంతో వాటి కింద సాగుచేసిన వరి చేలు కరెంట్ కోతల దాటికి విలవిలలాడాయి. ఆగష్టు, సెప్టెంబర్ నెలలో జోరువానలు కురవాల్సిన సమయంలో అచ్చంగా వేసవిని తలపిస్తూ ఉక్కపోతతో పాటు భరించలేని ఎండలు కాశాయి. దీంతో అన్ని పంటల దిగుబడి సగానికిపైగా తగ్గిపోయింది.
 
రుణమాఫీ అంతంతే

 
వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతన్నకు బ్యాంకర్లు సకాలంలో రుణాలివ్వకుండా మరింత సంక్షోభంలోకి నెట్టేశారు. జిల్లాలో మొత్తం 6.20 లక్షల మంది రైతులకు 2,419 కోట్లు ఇవ్వాలని అన్ని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే 3.21 లక్షల మందికి కేవలం 1,200 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా వారికి మొండిచెయ్యి చూపారు. ఇందులోనూ 70శాతం వరకు రుణాలను రీషెడ్యూల్ చేసినవే ఉంటాయని, అతి తక్కువ మాత్రమే కొత్త రుణాలిచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి సంబంధించి కూడా చాలా గందరగోళం నెలకొంది. జిల్లాలో తొలి విడతలో భాగంగా రూ.684 కోట్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రైతులకు కొత్త రుణాలివ్వని వైనం నెలకొంది. బంగారంపై పంట రుణాలు తీసుకున్న రైతులు ఇప్పటి వరకు మాఫీ పొందలేకపోయారు.
 
మద్దతు ధరలేక గగ్గోలు..

 
అష్టకష్టాలకోర్చి పండించిన పంటకు సరైన మార్కెటింగ్ లేకపోవడం, గిట్టుబాటు ధర లేక రైతన్న విలవిలలాడారు. సర్కారు శీతకన్ను వేయడంతో దళారులు రంగప్రవేశం చేసి రైతులను పీల్చిపిప్పి చేశారు. వరి, మొక్కజొన్న, పత్తి ఇలా ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర లభించలేదు సరికదా... కనీసం కొనుగోళ్లు కూడా సరిగా చేపట్టలేదు. దీంతో చాలాచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి... ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా! ముఖ్యంగా మొక్కజొన్న పండించిన రైతు పరిస్థితి అయోమయంగా తయారైంది. ఒకవైపు ప్రకృతి కన్నెరకు సరైన దిగుబడి రాకపోవడం ఒక ఎత్తయితే, మార్కెట్ మాయజాలానికి పూర్తిగా బలయ్యాడు. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1310 నిర్ణయించగా... ఆ ధర అందిన దాఖలాలు లేవు. ప్రైవేట్ వ్యాపారులు కేవలం క్వింటాల్‌కు రూ.900 మాత్రమే పెట్టి కొనుగోళ్లు చేశారు. రైతులకు మద్దతు ధర అందించడం కోసం ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో 16చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఫలితం లేకపోయింది. తేమశాతం ఎక్కువుందని, నాణ్యత సరిగా లేదనే కారణాలతో సరిగా కొనుగోళ్లు జరపలేదు. పైగా చాలాచోట్ల సరుకు రోజుల తరబడి మార్కెట్లలోనే నిల్వ ఉంచుతుండడంతో ఓపిక నశించిన రైతులు ప్రైవేట్ వ్యాపారులకు వచ్చిన కాడికి అమ్ముకున్నారు. ఇక పత్తి పరిస్థితి విచిత్రంగా తయారైంది. జిల్లాలో కేవలం నాలుగుచోట్ల సీసీఐ కొనుగోలు చేపట్టినా ఇప్పటివరకు 5.20లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. కొనుగోళ్లకు సీసీఐ విముఖత చూపడంతో ప్రైవేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నేరుగా గ్రామాల్లో కొనుగోళ్లు జరుపుతూ... తూకం విషయంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. ధర కూడా కేవలం క్వింటాల్‌కు రూ.3,200 నుంచి 3,600 మాత్రమే చెల్లిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement