అనంతపురం జిల్లాలో తొలకరి వానకు ముందే మేలో విత్తిన పంట వైభవం
సాధారణంగా తొలకరిలో మంచి వర్షం పడిన తర్వాత మెట్ట భూములను దుక్కి చేసి, మళ్లీ వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తుంటారు. అయితే, దుక్కి చేసిన తర్వాత విత్తనాలు వేయడానికి పదునయ్యే అంత వర్షం పడక పోతే..? ఆశతో రైతులు వరుణుడి రాక కోసం రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇటువంటి విపత్కర దుర్భిక్ష పరిస్థితులే ఏర్పడ్డాయి..
అయినా, పొలాలన్నీ, రోజులన్నీ ఒకేలా ఉండవు. అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మక వర్షాధార జీవవైవిధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఒకటికి పది రకాల పచ్చని పంటలతో అలరారుతున్నాయి. తొలకరికి ముందే విత్తనాలు వేయటం వల్ల 70 రోజులుగా పంటలు అలరారుతున్నాయి. ఈ పొలాలు పచ్చని పంటలతో అలరారుతూంటే.. పరిసర పొలాలు మాత్రం ఖరీఫ్ సాగుకు వర్షం కోసం ఎదురుచూస్తూ బావురుమంటున్నాయి..!
కరువు పరిస్థితులను అధిగమించాలంటే అనంతపురం తదితర కరువు ప్రాంత రైతులు వేరుశనగ లాంటి ఒకే పంట వేసే అలవాటుకు, రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తిపలకడమే ఉత్తమం. ఒక ఎకరా పొలం ఉన్నా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల మిశ్రమ సాగుకు ఉపక్రమించడమే మేలని తాజా అనుభవాలు చాటిచెబుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతువులు, వర్షాలు గతితప్పడంతో పంటల సాగు సమయంలో కూడా మార్పు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ(జెడ్‌బీఎన్‌ఎఫ్) పద్ధతిలో అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ఖరీఫ్ పంటల సాగు (ప్రీ మాన్‌సూన్ క్రాప్ సోయింగ్) చేపట్టారు. జెడ్‌బీఎన్‌ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. టి.విజయకుమార్ సారథ్యంలో డీపీఎం వి.లక్ష్మానాయక్, టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా తొలకరికి ముందే సాగు సాగుతోంది.
మే నెల లోనే విత్తనం..
అనంతపురం జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సాగు అనగానే జూన్ 15 నుంచి జూలై 31 వరకు పంటల సాగుకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఒక నెల ముందే మే నెల మూడో వారంలో వర్షాలు పడక ముందే విత్తనాలు వేసే ముందస్తు ముంగారు(ఖరీఫ్) సాగు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన తొమ్మిది క్లస్టర్ల పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో మే మూడో వారంలో 12 నుంచి 15 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలు కలిపి విత్తారు. భూమిని రైతుల నుంచి అధికారులు మూడేళ్ల కాలపరిమితితో దత్తత తీసుకుని ముందస్తు పంటలు వేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, కుందుర్పి మండలం బండమీదపల్లి, వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, రాప్తాడు మండలం మరూరు, అమడగూరు మండలం గాజులవారిపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, మడకశిర మండలం నీలకంఠాపురం, అదే మండలం గుండుమల, కూడేరు మండలం జయపురం గ్రామాల్లో ముందస్తు ఖరీఫ్ పంటల సాగవుతున్నాయి.
ఇందుకోసం ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ/ఉద్యాన విద్యావంతులను నాచురల్ ఫార్మింగ్ ఫెలో(ఎన్‌ఎఫ్‌ఎఫ్)గా నియమించారు. ఈ ఫెలో తనకు కేటాయించిన క్లస్టర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు.
ఒక ఎకరాలో పంటల వైవిధ్యంతో ముందస్తు ఖరీఫ్ సాగుతోపాటు 36 సెంట్లలో ప్రత్యేకంగా ఫైవ్ లేయర్(ఐదంచెల వ్యవసాయ) పద్ధతిలో ఆకుకూరల నుంచి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సాధించేలా పంటలు పండించి రైతులకు చూపాలన్నది లక్ష్యం.
ఒక ఎకరాకు ఆవుపేడ, మూత్రం, బెల్లం, సున్నం, పప్పుదినుసుల పిండి, పుట్టమన్నుతో తయారు చేసిన 400 కిలోల ఘన జీవామృతం పొడిని పొలంలో వెదజల్లారు. మరుసటి రోజు ఒక ఎకరాకు 12 నుంచి 15 రకాల విత్తనాలు కలిపి 17 నుంచి 20 కిలోల వరకు పొలంలో వెదజల్లారు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలసంద, అనుములు, మినుములు, కంది, రెండు రకాల చిక్కుడు, నువ్వులు, ఆముదం తదితర విత్తనాలు కలిపి వెదజల్లారు.
వానల్లేకపోయినా..
విత్తే ముందు గోమూత్రం, బూడిద, ఇంగువతో తయారు చేసిన ‘బీజరక్ష’ ద్రావణంతో విత్తన శుద్ధి చేశారు. విత్తిన తర్వాత వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎకరాకు రెండు ట్రాక్టర్ల వరకు వెదజల్లి.. ఒక అంగుళం ఎత్తున మల్చింగ్(ఆచ్చాదన) చేశారు. ఒట్టి నేలల్లో విత్తనం వేసిన తర్వాత ఒకట్రెండు సార్లు తేలికపాటి తుంపర్లు పడ్డాయి. అనుకున్న విధంగా మొలకలు బాగానే వచ్చాయి. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరు వర్షం పడింది. ఆ తర్వాత రెండు నెలల పాటు వాన చినుకే లేదు. అయినా, ముందస్తు ఖరీఫ్ పంటలు పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యలో గోమూత్రంతో తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పిచికారీ చేశారు. ఆగస్టు 11 నాటికి ఆముదం గెల వేయగా, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర కంకులు ఏర్పడి గింజ పట్టాయి. పెసర, అలసంద కాయలు వచ్చాయి. ఇతర పంటలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సజ్జ లాంటి పంటలు ఐదారు పక్కకొమ్మలతో గుబురుగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. వాటి నుంచి మరో ఐదారు కంకులు వచ్చే అవకాశం ఉంది.
ఎకరానికి రూ. పది వేల పెట్టుబడి
ఎకరానికి విత్తనాలకు రూ.1,500 వరకు ఖర్చయింది. వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఆచ్చాదన కోసం ఎకరానికి రూ.4 వేల వరకు ఖర్చయింది. ఎకరానికి ఘన, ద్రవ జీవామృతం తయారీకి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఖర్చయింది. దుక్కి, కూలీలతో కలిపి ఎకరాకు రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి అన్ని పంటల ద్వారా కనీసం రూ.25 వేలు విలువ చేసే దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీనితోపాటు, 36 సెంట్ల భూమిలో ఐదంచెల వ్యవసాయం చేపట్టారు. వివిధ ఎత్తుల్లో పెరిగే పండ్ల చెట్లు, 20–30 రకాల పంటలు కలిపి సాగు చేసేలా ప్రణాళిక తయారు చేశారు.
రక్షణ కవచంగా మిత్రపురుగులు
ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడంతోపాటు ఏకదళ, ద్విదళ పంటలు కలిపి సాగు చేస్తుండడంతో ఈ పొలాల్లో మిత్రపురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్షింతల పురుగు, గొల్లబామ, సాలె పురుగులు, చీమలు, కందిరీగలు, తేనెటీగలు, పెంకు పురుగులు కనిపించాయి. ఇవి శత్రుపురుగుల దాడి నుంచి పంటలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఘన, ద్రవజీవామృతం వాడటం వల్ల మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. గాలిలో ఉండేæ తేమను, నత్రజని సంగ్రహించి భూమికి అందిస్తున్నాయి. మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతున్నదని, పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని జెడ్‌బీఎన్‌ఎఫ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడక పోవడంతో తేనెటీగలు తుట్టెలు కడుతున్నాయి. పక్షల గూళ్లు అల్లుకోవడం కూడా కనిపించింది.
‘ముందస్తు ఖరీఫ్ కు విత్తనాలు వేస్తున్నప్పుడు కొందరు ఎగతాళి చేసినా మేం వెనుకడుగు వేయలేదు. ఇపుడు రైతులు ఆసక్తిగా ఈ పంటలు చూస్తున్నారు..’ అని జెడ్‌బీఎన్‌ఎఫ్ డీపీఎం వి.లక్ష్మానాయక్ (8886614354), టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ సంతోషంగా చెబుతున్నారు.
పంటలను పరిశీలిస్తున్న విజయకుమార్ తదితరులు
ముందస్తు ఖరీఫ్ పంటల చుట్టూ ఖాళీ పొలాలే
– రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్
Comments
Please login to add a commentAdd a comment