‘సిరి’పైనే పొగాకు రైతుల గురి | siri seed production tobacco | Sakshi
Sakshi News home page

‘సిరి’పైనే పొగాకు రైతుల గురి

Published Tue, Oct 23 2018 12:30 AM | Last Updated on Tue, Oct 23 2018 12:30 AM

siri seed production tobacco - Sakshi

మునుపెన్నడూ లేని విధంగా పొగాకు రైతులు ఈ ఏడాది సిరి అనే రకం పొగాకు విత్తనాలపై అమితాసక్తి చూపారు. దక్షిణ ప్రాంత తేలిక నేల ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గతంలో సిరి, వీటీ 1158, ఎన్‌ 98, జీ 11 తదితర రకాలను పొగాకు నారుమడి కోసం రైతులు, నర్సరీ వ్యాపారులు ఉపయోగించగా.. ఈ ఏడాది దీనికి భిన్నంగా సిరి రకం విత్తనాల వైపు మొగ్గు చూపారు. దక్షిణ ప్రాంత రైతులందరూ సిరి విత్తనాలతోనే నార్లు పోశారు. రైతుల ఆసక్తి మేరకు రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్‌ఐ) విత్తనాభివృద్ధి శాస్త్రవేత్తలు సిరి విత్తనాలనే రైతుల కోసం అందించారు.

రాజమహేంద్రవరంతోపాటు, కందుకూరులో విత్తనాలను కిలో రూ.900 చొప్పన విక్రయించారు. ఈ ఏడాది దాదాపు 8 వేల కిలోల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రైతుల కోసం ఉత్తర ప్రాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నర్సరీ వ్యాపారులు కూడా సిరి విత్తనాలతోనే పొగాకు నారుమడులు పెట్టారు. ఉత్తర ప్రాంతానికి అనువైన కన్సన్, ఎల్‌టీ కన్సన్‌తోపాటు ఐటీసీ విత్తన రకాలు ఇక్కడ రైతులు ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరం నారుమడికి గరిష్టంగా నాలుగు కేజీల విత్తనాలను రైతులు వాడుతున్నారు. అధిక దిగుబడులను ఇవ్వడంతోపాటు ఆకుముడత అతి తక్కువగా ఉంటోంది. అందువల్లే రైతులు సిరి పొగాకు విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారు

దిగుబడి ఎక్కువ ఆకుముడత తక్కువ
ఇతర విత్తనాలతో పోల్చుకుంటే సిరి విత్తనాలు దిగుబడి బాగా వస్తుంది. పైగా ఆకుముడత తక్కువగా ఉంటోంది. అందుకే సిరి విత్తనాలనే నారుమడులకు ఉపయోగిస్తున్నాం.

– బాలు కోటిరెడ్డి (89853 11626), పొగాకు రైతు, కనిగిరి, ప్రకాశం జిల్లా

విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది
గతేడాది వరకు ఎన్‌ 98, జీ 11 విత్తనాలను ఉపయోగించేవాళ్లం. ఈ ఏడాది సిరి విత్తనాలనే కొనుగోలు చేశాం. కందుకూరులో విత్తనాలు అయిపోవడంతో రాజమహేంద్రవరం వచ్చి తీసుకున్నాం.

– జి. అబ్దుల్లా, కొండాపురం,  నెల్లూరు జిల్లా


– పలుకూరి కోటేశ్వరరెడ్డి, సాక్షి, రాజమహేంద్రవరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement