seeds supply
-
విత్తన మాఫియా పెత్తనానికి చెక్ పెట్టేలా!
విత్తన మాఫియా నుంచి రైతుల్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ ఒక్క రైతు కల్తీ, నకిలీ విత్తనాల బారిన పడకూడదన్న సంకల్పంతో నాణ్యమైన విత్తనోత్పత్తిపై దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు సరిపడా విత్తనాలను ఇప్పటినుంచే తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసింది. సీజన్ ప్రారంభానికి ముందే సర్టిఫై చేసిన విత్తనాన్ని అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఇప్పటికే సీడ్ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే. దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది. – సాక్షి, అమరావతి 8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేసేలా.. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌లో 94 లక్షల ఎకరాలు, రబీలో 59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. రెండు సీజన్లలో వివిధ పంటలకు సంబంధించి 8.75 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.06 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 2.50 లక్షల క్వింటాళ్ల శనగ, 2 లక్షల క్వింటాళ్ల వరి, 16,762 క్వింటాళ్ల అపరాలు, 2,500 క్వింటాళ్ల చిరు ధాన్యాల విత్తనాలు అవసరమవుతాయని గుర్తించారు. ఈ దృష్ట్యా 2022–23 సీజన్‌కు సరిపడా విత్తనం కోసం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే కార్యాచరణ సిద్ధం చేశారు. ముఖ్యంగా విశేష ప్రాచుర్యం పొందిన రకాల విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కనీసం 38,468 క్వింటాళ్ల వేరుశనగ, 7,820 క్వింటాళ్ల శనగ, 3 వేల క్వింటాళ్ల వరి, 245 క్వింటాళ్ల అపరాలు, 3 క్వింటాళ్ల చిరు ధాన్యాలకు సంబంధించి ఫౌండేషన్ సీడ్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన 4,800 ఎకరాల్లో మొత్తం 49,537 క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ సీడ్ ఆధారంగా రానున్న రబీ 2021–22 సీజన్లో 1,470 గ్రామాల్లో కనీసం 85,764 ఎకరాల్లో 8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటిలో డిమాండ్ అధికంగా ఉన్న 4,05,713 క్వింటాళ్ల వేరుశనగ (కే–6, కదిరి, లేపాక్షి, నారాయణి రకాలు), 2 లక్షల క్వింటాళ్ల 20 రకాల వరి విత్తనాలు, 2,50 లక్షల క్వింటాళ్ల శనగలు (జేఎల్‌జీ–11, ఎన్‌బీఈజీ –49)తో పాటు 17 వేల క్వింటాళ్ల అపరాలు (కందులు, మినుములు, పెసలు), 2,500 క్వింటాళ్ల చిరుధాన్యాలు, నువ్వులు ఇతర విత్తనాలు సిద్ధం చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా వాటి నాణ్యతను పరీక్షించి.. సర్టిఫై చేసిన విత్తనాలను వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచే ఆర్బీకేల్లో రైతులకు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇకనుంచి క్రమం తప్పకుండా ఇదే రీతిలో ఫౌండేషన్ సీడ్ ద్వారా విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలు తీరగా మిగిలిన విత్తనాలను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయిలో రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్టు ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ‘సాక్షి’కి తెలిపారు. -
ఖరీఫ్‌కు సమృద్ధిగా వంగడాలు
‘సేద్య’మేవ జయతే అంటూ సర్కారు నినదిస్తోంది. కర్షక వీరుల అవసరాలు తీర్చేందుకు నేనున్నానంటూ ఉరకలేస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు ఎన్నో సేవలతోపాటు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే వరి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నకిలీ విత్తనాల నుంచి అన్నదాతలను కాపాడేందుకు నాణ్య మైన విత్తనాలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ఆకివీడు: ఖరీఫ్ వరి సాగుకు విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే వంగడాలను ఏపీ సీడ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరగనుంది. చెరకు సాగు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో వరి సాగు చేపట్టేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో సాధారణ ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఈ సారి అదనంగా మరో 5 వేల హెక్టార్లలో సేద్యానికి రైతులు సిద్ధమవుతారని వ్యవసాయాధికారుల అంచనా. మొత్తం మీద 2.25 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగనుంది. దీనికి 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. రైత్వారీగా 85 శాతం విత్తనాలను సమకూరుస్తుండగా, మరో 15 శాతం విత్తనాభివృద్ధి సంస్థలు, ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. 936 ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా రైతులకు విశిష్ట సేవలందించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 936 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో ఇప్పటికే సుమారు 5,215 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు ఇండెంట్లు పెట్టారు. దీనిలో 3,092 క్వింటాళ్లు ఆయా కేంద్రాలకు సరఫరా చేయగా వాటిని రైతులకు రాయితీపై ఇప్పటికే అందించారు. మెట్ట ప్రాంతంలో నాట్లు ప్రారంభించగా, డెల్టా ప్రాంతంలో నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. ఖరీఫ్ సాగు వంగడాలు ఇవే.. ఖరీఫ్‌లో సాగుకు అనుకూలమైన వంగడాలపై ఈ ఏడాది ప్రభుత్వం, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన వెరైటీలు సాగు చేస్తే మద్దతు ధర లభిస్తుందని సూచించారు. దీనికనుగుణంగా రైతులు ఖరీఫ్‌లో ఎంటీయూ–1061, 1064, 1121, 7029(స్వర్ణ), 1121, 5204(బీపీటీ), 3291(సోనా మసూరి) వంగడాలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ–1010, 1156, 1075, 1001, 20471 రకాలతోపాటు సంపద స్వర్ణ వంగడాన్ని సాగు చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ వర్తించని రైతులకూ విత్తనాలు.. సబ్సిడీ వర్తించని రైతులు కూడా ఆర్బీకేల నుంచి వరి విత్తనాలను కొనే అవకాశం ప్రభుత్వం కలి్పంచింది. పూర్తి ధరకు నాణ్యమైన విత్తనాలను కొనవచ్చని స్పష్టం చేసింది. ఆర్బీకేల్లోని కియోస్‌్కల నుంచిగాని, గ్రామ వ్యవసాయ సహాయకుల నుంచిగానీ ఆర్డర్ చేసిన 48 గంటల్లో రైతు ఇళ్ల ముంగిటకే విత్తనాలు సరఫరా చేసేలా ఏపీ సీడ్స్ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విత్తనాలు ఆర్బీకేల నుంచే అందించి నకిలీ విత్తన వ్యాపారులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన పంట పండించండి రైతులకు నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీపై అందజేస్తున్నాం. విత్తనాల దగ్గర నుంచి పంట పండించే వరకూ ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతుంది. నాణ్యమైన పంట పండించి ఇవ్వండి. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. – పీవీఎల్ నర్శింహరాజు, వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి విత్తనాలు బాగున్నాయి ప్రభుత్వం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల్ని అందజేసింది. విత్తు నాణ్యమైనదైతేనే దిగుబడి బాగుంటుంది. మంచి పంట పండించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. – సలాది నాగకళ్యాణ్, రైతు, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం అధికంగా విత్తనాల సరఫరా ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనం అందజేయడమే కాకుండా గతంలో కంటే అధికంగా విత్తనాలను çసబ్సిడీపై అందిస్తున్నాం. 5,215 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని రైతులు ఆర్బీకేలో రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. దానిలో 3,092 క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా చేశాం. గతంలో 1000 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే రైతులు కొనేవారు. – ఎండీ గౌసియాబేగం, వ్యవసాయ సంచాలకులు, పశ్చిమగోదావరి -
‘విత్తు’కు ఉరుకులు..
ఖమ్మంవ్యవసాయం: తొలకరి పలకరించడంతో రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని నేలల స్వభావం, నీటి వనరుల ఆధారంగా పత్తి వైపు మొగ్గు చూపుతుంటారు. పంటల సాగు విస్తీర్ణం 5.50 లక్షల ఎకరాలు కాగా.. ఇందులో 2.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తుంటారు. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా వ్యవసాయ డివిజన్లలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తుంటారు. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో మాత్రం అతి తక్కువ విస్తీర్ణంలో పంట వేస్తారు. తొలకరిలో అనుకూలమైన వర్షం కురిసిన వెంటనే విత్తనాలు నాటుతారు. నల్ల రేగడి నేలల్లో వర్ష సూచన, రుతుపవనాల కదలికలను చూసి రైతులు పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలను విత్తుతారు. ఇదే విధానాన్ని ఎర్ర నేలలు, ఇసుక నేలల్లో కూడా రైతులు పాటిస్తున్నారు. అయితే వర్షాలు ఆశించిన సమయానికి రాకపోతే అన్ని రకాల నేలల్లో విత్తనాలు మొలకెత్తవు. ఇలా రైతులు కొంతమేర నష్టపోతున్నారు. ఈ అంశంపై అవగాహన ఉన్నప్పటికీ సీజన్‌కు ముందుగా పత్తిని వేయాలనే ఆతృతతో రైతులు విత్తనాలు విత్తుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం పొడి దుక్కుల్లో విత్తనాలు విత్తొద్దని, సరైన పదునులో మాత్రమే విత్తనాలను నాటాలని సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పెడచెవిన పెడుతూ నష్టపోతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పెద్ద వర్షం పడగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇది వ్యవసాయ పనులకు దోహదపడుతుంది. దాదాపు ప్రతి ఏటా జూన్ ఆరంభం నాటికి ఒకటి, రెండు వర్షాలు పడతాయి. అలాంటిది ఈ ఏడాది జూన్ అర్ధభాగం దాటిన తర్వాత వర్షం పడింది. పత్తి సాగు చేసే రైతులు జూన్ ఆరంభం నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. 17న వర్షం కురవడంతో రైతుల్లో పంటల సాగుకు ఆశలు చిగురించాయి. మంగళవారం జిల్లాలో సగటున 2.64 సెం.మీల వర్షపాతం నమోదైంది. కొణిజర్ల, వైరా, కామేపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దుక్కులు చేయడానికి ఈ వర్షం బాగా అనుకూలిస్తుంది. కొందరు రైతులు ఏకంగా ఈ వర్షానికే విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో పత్తి విత్తడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. విత్తన దుకాణాలు కళకళ పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు విత్తన దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. నగరంతోపాటు వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, మధిర, బోనకల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో ఉన్న విత్తన దుకాణాల్లో పత్తి విత్తనాలను కొనుగోలు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో పత్తి సాగు చేసే 2.40 లక్షల ఎకరాలకు 5.72 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించి.. విత్తన కంపెనీలకు అనుమతులిచ్చింది. దీంతో వివిధ కంపెనీల యాజమాన్యాలు జిల్లాలో 5.22 లక్షల విత్తనాల ప్యాకెట్లను విక్రయాలకు సిద్ధంగా ఉంచాయి. సాగు విస్తీర్ణం పెరిగితే మరికొంత స్టాక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 450 గ్రాముల విత్తన ప్యాకెట్లను రూ.730 చొప్పున విక్రయిస్తున్నారు. అదునులో పత్తి విత్తేందుకు సమాయత్తం ఒక వర్షంతో విత్తనాలు వేయకుండా మరోసారి దుక్కి చేసి.. అదునులో పత్తి విత్తనాలు నాటాలని రైతులు ఆలోచిస్తున్నారు. నేల రకాన్నిబట్టి సరైన పదునులో విత్తనాలను విత్తితే అవి మొలకెత్తుతాయి. సోమవారం కురిసిన వర్షంతో రైతులు దుక్కి దున్నించే పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చే నైరుతి రుతుపవనాలతో వర్షం కురిస్తే వెంటనే పత్తి విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు. మరో వర్షం పడితే.. సోమవారం కురిసిన వర్షంతో విత్తనాలు కొనుగోలు చేశా. ఈ వర్షంతో మరోసారి దుక్కి దున్ని అంతా సిద్ధం చేస్తాం. మరో వర్షం పడగానే పాటు చేసి విత్తనాలు నాటుతాం. ఇప్పటికే పత్తి విత్తనాలు పెడితే బాగుండేది. ఈ ఏడాది ఆలస్యమవుతోంది. విత్తనాలు ఆలస్యంగా విత్తితే దిగుబడులు తగ్గుతాయి. – వీరన్న, ఎర్రగడ్డతండా, కారేపల్లి మండలం అదునులో విత్తుకోవాలి.. రైతులు వర్షం పడింది కదా.. అని వెంటనే వేడి దుక్కుల్లో విత్తనాలు విత్తొద్దు. అలా విత్తడం ద్వారా సరైన పదును లేక విత్తనాలు మొలకెత్తవు. దీంతో రైతులు శ్రమ, ఖర్చుతో నష్టపోతారు. 60 నుంచి 70 మి.మీల వర్షం కురిసిన తర్వాత పత్తిని విత్తాలి. స్థానిక వ్యవసాయాధికారుల సలహాలతో పంటలు వేసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఆయా విత్తనాలకు సంబంధించిన బిల్లులు, రశీదులు డీలర్లు, దుకాణాల యజమానుల నుంచి తీసుకొని భద్రపరుచుకోవాలి. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
ఖరీఫ్‌కు సన్నద్ధం
రబీలో రైతులకు నిరాశే మిగిలింది. మరో నెలరోజుల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌పైనే గంపెడాశలు పెట్టుకుని పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. రబీలో భూ గర్భజలాలు తగ్గుముఖం పట్టడం, బోర్లలో నీటి మట్టం పడిపోవడంతో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్ర నష్టాలపాలయ్యారు. ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలిస్తాయనే నమ్మకంతో పంటల సాగుకు జిల్లావ్యాప్తంగా సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనాలు. మెదక్‌జోన్: వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఖరీఫ్‌లో 80,014 హెక్టార్ల మేర పలు రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికను రెడీ చేశారు. ప్రధాన పంటగా వరి మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పత్తి, మూడో స్థానంలో మొక్కజొన్న పంట సాగవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు ముందస్తుగా వాటిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నీటివనరులైన చెరువులు, కుంటలు 2,076 ఉన్నాయి. వీటితోపాటు మధ్యతరగతి ప్రాజెక్టులైన ఘణాపూర్, హల్దీ ప్రాజెక్టులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 95 వేల బోరుబావులు ఉన్నాయి. గతేడాది వర్షాలులేక.. జిల్లావ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల సాగుభూములు ఉన్నాయి. వీటిలో 1.20 లక్షల ఎకరాల మేర చెరువులు కుంటలతో పాటు ఘణాపూర్, హల్దీప్రాజెక్టుల ఆధారంగా పంటలు సాగవుతాయి. మరో లక్ష ఎకరాల వరకు బోరుబావులే ఆధారం. మిగతా లక్ష ఎకరాల్లో వర్షాధారంపై ఆరుతడి పంటలను సాగుచేస్తారు. గతేడాది ఖరీఫ్‌లో సరైన వర్షాలు లేక నీటివనరులన్నీ ఎడారిలా మారాయి. 65 వేల హెక్టార్లలో బోరుబావుల ఆధారంగా పంటలను సాగుచేయగా సగానికి పైగా ఎండిపోయాయి. ముందుగా కురిసిన కొద్దిపాటి వర్షాలకు ఆరుతడి పంటలను సాగుచేయగా ఆ తరువాత వర్షాలు ముఖం చాటేయడంతో ఎండిపోయాయి. ఫలితంగా సాగుకోసం పెట్టిన పెట్టుబడులు రాకపోగా రైతులకు అప్పులే మిగిలాయి. ఎరువులు, విత్తనాలు సిద్ధం ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకోసం ఎరువులు, విత్తనాల కొరతలేకుండా సాగు అంచనాకు తగ్గట్టుగా వ్యవసాయశాఖ అధికారులు ముందుగానే సిద్ధం చేశారు. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 45,450 క్వింటాళ్ల అన్నిరకాల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 26,981 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను సైతం సిద్ధంగా ఉంచారు. జూన్‌లో ఖరీఫ్ ప్రారంభం కానున్నందున ముందుగా సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలతో పాటు బోర్ల ఆధారంగా సాగుచేసేందుకు దొడ్డురకానికి సంబంధించిన వరి విత్తనాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిశాకే విత్తుకోవాలి జూన్‌లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురిశాకనే పంటలను విత్తుకోవాలి. వర్షాలు లేక భూగర్భజలాలు 40 మీటర్ల లోతులోకి పడిపోయాయి. బోర్లలో సైతం నీటిఊటలు ఘణనీయంగా పడిపోయాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. అప్పుడే పంటలు సాగుచేయాలి. ముందుగా పంటలను సాగుచేస్తే గత ఖరీఫ్ మాదిరిగా పంటలు ఎదిగాక నీటి తడులు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. – పరుశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
విత్తనరంగంలో తెలంగాణ ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: విత్తనరంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బుకార్ టిజాని ప్రశంసించారు. రోమ్ పర్యటనలో భాగంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు ఆయనతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుకార్ మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇతర దేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు నాణ్యమైన విత్తనం అందించేలా చేయాలన్నది ఎఫ్ఏవో నిబంధనల్లో ఒక కీలకమైన అంశమని చెప్పారు. భారత్ ఇప్పటికే ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనాభివృద్ధి కోసం ఎఫ్‌ఏవోకు తెలంగాణ సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్‌లో విత్తన పార్కును నెలకొల్పి 400 విత్తన కంపెనీలకు అవసరమైన వసతులు కల్పించడం అభినందనీయవన్నారు. అంతర్జాతీయ విత్తనోద్యమంలో తాము తెలంగాణతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో విత్తనోత్పత్తి, విత్తనాభివృద్ధికి గల అవకాశాలను వివరించారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా రాష్ట్రాన్ని గుర్తిస్తున్నామని ఎఫ్ఏవో ప్రకటించినట్లు కేశవులు తెలిపారు. అందులో భాగంగా ఎఫ్ఏవో బృందం వచ్చే జూన్, జూలైల్లో రాష్ట్రానికి రానుందని పేర్కొన్నారు. -
‘విత్తన వ్యవస్థతోనే దేశాల ఆహార భద్రత’
సాక్షి, హైదరాబాద్: బలమైన విత్తన వ్యవస్థతోనే దేశాల ఆహార భద్రత ఆధారపడి ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన్ పట్నాయక్, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, ఇండో జర్మన్ విత్తన కోఆపరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ‘మేలైన విత్తన నాణ్యతకు.. పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం’అనే అంశంపై మంగళవారం వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో విత్తన కేంద్రంగా తెలంగాణ ఇప్పటికే నిలబడిందన్నారు. ప్రపంచ విత్తనరంగంలో అభివృద్ధి ఐదు శాతముంటే, దేశంలో 12–15 శాతం ఉందన్నారు. మళ్లీ హరిత విప్లవం సాధించడంలో మేలైన విత్తనానిదే ప్రధాన పాత్రన్నారు. దేశంలో సాగయ్యే అన్ని పంటల విత్తనోత్పత్తి తెలంగాణలోనే సాధ్యమని, అందుకే విత్తన భాండాగారంగా వెలుగొందుతుందన్నారు. దేశంలో మరో 150 విత్తన హబ్‌లను ఏర్పాటు చేస్తామని పట్నాయక్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు బలంగా ఉంటే, ధ్రువీకరణ బలహీనంగా ఉందన్నారు. రెండు వ్యవస్థలు బలంగా ఉంటేనే విత్తన వ్యవస్థ బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, మేనేజ్ డీజీ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
‘సిరి’పైనే పొగాకు రైతుల గురి
మునుపెన్నడూ లేని విధంగా పొగాకు రైతులు ఈ ఏడాది సిరి అనే రకం పొగాకు విత్తనాలపై అమితాసక్తి చూపారు. దక్షిణ ప్రాంత తేలిక నేల ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గతంలో సిరి, వీటీ 1158, ఎన్ 98, జీ 11 తదితర రకాలను పొగాకు నారుమడి కోసం రైతులు, నర్సరీ వ్యాపారులు ఉపయోగించగా.. ఈ ఏడాది దీనికి భిన్నంగా సిరి రకం విత్తనాల వైపు మొగ్గు చూపారు. దక్షిణ ప్రాంత రైతులందరూ సిరి విత్తనాలతోనే నార్లు పోశారు. రైతుల ఆసక్తి మేరకు రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్ఐ) విత్తనాభివృద్ధి శాస్త్రవేత్తలు సిరి విత్తనాలనే రైతుల కోసం అందించారు. రాజమహేంద్రవరంతోపాటు, కందుకూరులో విత్తనాలను కిలో రూ.900 చొప్పన విక్రయించారు. ఈ ఏడాది దాదాపు 8 వేల కిలోల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రైతుల కోసం ఉత్తర ప్రాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నర్సరీ వ్యాపారులు కూడా సిరి విత్తనాలతోనే పొగాకు నారుమడులు పెట్టారు. ఉత్తర ప్రాంతానికి అనువైన కన్సన్, ఎల్టీ కన్సన్తోపాటు ఐటీసీ విత్తన రకాలు ఇక్కడ రైతులు ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరం నారుమడికి గరిష్టంగా నాలుగు కేజీల విత్తనాలను రైతులు వాడుతున్నారు. అధిక దిగుబడులను ఇవ్వడంతోపాటు ఆకుముడత అతి తక్కువగా ఉంటోంది. అందువల్లే రైతులు సిరి పొగాకు విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారు దిగుబడి ఎక్కువ ఆకుముడత తక్కువ ఇతర విత్తనాలతో పోల్చుకుంటే సిరి విత్తనాలు దిగుబడి బాగా వస్తుంది. పైగా ఆకుముడత తక్కువగా ఉంటోంది. అందుకే సిరి విత్తనాలనే నారుమడులకు ఉపయోగిస్తున్నాం. – బాలు కోటిరెడ్డి (89853 11626), పొగాకు రైతు, కనిగిరి, ప్రకాశం జిల్లా విత్తనాలకు డిమాండ్ పెరిగింది గతేడాది వరకు ఎన్ 98, జీ 11 విత్తనాలను ఉపయోగించేవాళ్లం. ఈ ఏడాది సిరి విత్తనాలనే కొనుగోలు చేశాం. కందుకూరులో విత్తనాలు అయిపోవడంతో రాజమహేంద్రవరం వచ్చి తీసుకున్నాం. – జి. అబ్దుల్లా, కొండాపురం, నెల్లూరు జిల్లా – పలుకూరి కోటేశ్వరరెడ్డి, సాక్షి, రాజమహేంద్రవరం -
ప్రైవేటు దోపిడీ
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: సాగర్ కుడి కాలువ కింద నీటిని విడుదల చేస్తున్న ప్రభుత్వం రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తనాల కోసం బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులు ఏ రకం విత్తనాలు సాగు చేయాలో సూచించిన ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదే అదనుగా వ్యాపారులు విత్తనాల ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 25 కేజీల బస్తా విత్తనాలపై రూ.800 నుంచి రూ.1500 వరకు పెంచారు. దీంతో రైతులకు విత్తన కొనుగోల్లు భారంగా మారాయి. ఈ ధరలకు పేదరైతులు విత్తనాలు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, విత్తన వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని, ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఎన్‌ఎల్‌ఆర్ 145 ఇవ్వని ప్రభుత్వం.. సాగర్ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో వరిసాగు కానుంది. కొమ్మమూరు కెనాల్ పరిధిలో 72,800 ఎకరాలు ఉండగా గుండ్లకమ్మతో పాటు చెరువుల పరిధిలోని ఆయకట్టుతో కలుపుకుంటే మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. తొందరగా దిగుబడి ఇచ్చే వరి రకాలను సాగు చేయాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రధానంగా ఎన్‌ఎల్‌ఆర్ 34449 తోపాటు ఎన్‌ఎల్‌ఆర్ 145 రకాలను సాగు చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వమే ఏపీ సీడ్స్ ద్వారా వరి విత్తనాలు సరఫరా చేస్తుందని అధికారులు ప్రకటించారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం సాగవనున్న విస్తీర్ణానికి 80 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. ఏపీ సీడ్స్ వద్ద మూడు వేల క్వింటాళ్ల ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం విత్తనాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా రైతాంగం దాదాపు 50 శాత విస్తీర్ణంలో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి సాగుచేస్తారు. ఈ రకం తక్కువ నీటితో పండించుకోవచ్చు. పైపెచ్చు 130 రోజుల్లోనే పంటకాలం ఉంటుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో వినియోగిస్తుంది . దీంతో రైతులు సులభంగానే మద్దతు ధరతో ధాన్యాన్ని అమ్ముకొనే వెసులు బాటు ఉంటుంది. అందుకే రైతులు ఈ రకం వరి విత్తనాలకోసం ఎదురు చూస్తుంటారు. కానీ ప్రభుత్వం ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకరాలేదు. ఎన్‌ఎల్‌ఆర్ 34449 విత్తనాలను.. అది కూడా 80 వేల క్వింటాళ్లు అవసరమైతే మూడు వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలు 12 వేల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి. దీంతో రైతులు రెండు రకాల విత్తనాలకోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుబాటులో లేని ఎన్‌ఎల్‌ఆర్ రకం.. ప్రభుత్వం ఏపీ సీడ్స్ ద్వారా తగినన్ని విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు అధిక రేట్లకు కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం విత్తనాలు (25 కిలోల బస్తా) కిలో రూ.28.15 ప్రకారం రూ.703.75గా ఉంది. ప్రభుత్వం కిలోకు రూ.5 సబ్సీడీ ఇస్తోంది. సబ్సీడీ పోను రైతు రూ.588.75 చెల్లించాలి. కానీ ఇవే ఇత్తనాలు బయట మార్కెట్లో రూ. 1300 అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో రైతు అదనంగా రూ.711.25 చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు 50 శాతం రైతులు సాగు చేసే ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో రైతుల ఈ రకం విత్తనాలను ప్రైవేటు వ్యాపారుల వద్ద అధికధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం 30 కిలోల బస్తా రూ.2 వేల నుంచి 2200 వరకూ అమ్ముతున్నారు. ఇది రైతులు కొనలేని ధర. ఒకరకంగా చెప్పాలంటే వ్యాపారులు అవకాశం చూసుకొని దోపిడీ చేస్తున్నట్లే. ఒక పక్క ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు అధికంగా సాగుచేయాలని సూచిస్తున్న వ్యవసాయాధికారులు విత్తనాలను మాత్రం సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు అధికారులు సీడ్ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వం ద్వారా విత్తనాలు సరఫరా చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీని వెనుక రూ.కోట్లలో చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో కరువు తాండవిస్తోంది. పశ్చిమ ప్రకాశం తో పాటు తూర్పు ప్రాంతంలోనూ పంటలులేవు. దీంతో రైతాంగం కుదేలయింది. ఈ పరిస్థితిలో ఈ ఏడాది సాగర్ నీళ్లు వస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా ఒక పండించుకుందామంటే కొనలేని పరిస్థితిలో విత్తనాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రైవేటు దోపిడీని అరికట్టాల్సి ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయాలి. -
వానకు ముందే విత్తనం..!
సాధారణంగా తొలకరిలో మంచి వర్షం పడిన తర్వాత మెట్ట భూములను దుక్కి చేసి, మళ్లీ వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తుంటారు. అయితే, దుక్కి చేసిన తర్వాత విత్తనాలు వేయడానికి పదునయ్యే అంత వర్షం పడక పోతే..? ఆశతో రైతులు వరుణుడి రాక కోసం రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇటువంటి విపత్కర దుర్భిక్ష పరిస్థితులే ఏర్పడ్డాయి.. అయినా, పొలాలన్నీ, రోజులన్నీ ఒకేలా ఉండవు. అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మక వర్షాధార జీవవైవిధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఒకటికి పది రకాల పచ్చని పంటలతో అలరారుతున్నాయి. తొలకరికి ముందే విత్తనాలు వేయటం వల్ల 70 రోజులుగా పంటలు అలరారుతున్నాయి. ఈ పొలాలు పచ్చని పంటలతో అలరారుతూంటే.. పరిసర పొలాలు మాత్రం ఖరీఫ్ సాగుకు వర్షం కోసం ఎదురుచూస్తూ బావురుమంటున్నాయి..! కరువు పరిస్థితులను అధిగమించాలంటే అనంతపురం తదితర కరువు ప్రాంత రైతులు వేరుశనగ లాంటి ఒకే పంట వేసే అలవాటుకు, రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తిపలకడమే ఉత్తమం. ఒక ఎకరా పొలం ఉన్నా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల మిశ్రమ సాగుకు ఉపక్రమించడమే మేలని తాజా అనుభవాలు చాటిచెబుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతువులు, వర్షాలు గతితప్పడంతో పంటల సాగు సమయంలో కూడా మార్పు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ(జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిలో అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ఖరీఫ్ పంటల సాగు (ప్రీ మాన్సూన్ క్రాప్ సోయింగ్) చేపట్టారు. జెడ్బీఎన్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. టి.విజయకుమార్ సారథ్యంలో డీపీఎం వి.లక్ష్మానాయక్, టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా తొలకరికి ముందే సాగు సాగుతోంది. మే నెల లోనే విత్తనం.. అనంతపురం జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సాగు అనగానే జూన్ 15 నుంచి జూలై 31 వరకు పంటల సాగుకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఒక నెల ముందే మే నెల మూడో వారంలో వర్షాలు పడక ముందే విత్తనాలు వేసే ముందస్తు ముంగారు(ఖరీఫ్) సాగు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన తొమ్మిది క్లస్టర్ల పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో మే మూడో వారంలో 12 నుంచి 15 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలు కలిపి విత్తారు. భూమిని రైతుల నుంచి అధికారులు మూడేళ్ల కాలపరిమితితో దత్తత తీసుకుని ముందస్తు పంటలు వేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, కుందుర్పి మండలం బండమీదపల్లి, వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, రాప్తాడు మండలం మరూరు, అమడగూరు మండలం గాజులవారిపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, మడకశిర మండలం నీలకంఠాపురం, అదే మండలం గుండుమల, కూడేరు మండలం జయపురం గ్రామాల్లో ముందస్తు ఖరీఫ్ పంటల సాగవుతున్నాయి. ఇందుకోసం ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ/ఉద్యాన విద్యావంతులను నాచురల్ ఫార్మింగ్ ఫెలో(ఎన్ఎఫ్ఎఫ్)గా నియమించారు. ఈ ఫెలో తనకు కేటాయించిన క్లస్టర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ఒక ఎకరాలో పంటల వైవిధ్యంతో ముందస్తు ఖరీఫ్ సాగుతోపాటు 36 సెంట్లలో ప్రత్యేకంగా ఫైవ్ లేయర్(ఐదంచెల వ్యవసాయ) పద్ధతిలో ఆకుకూరల నుంచి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సాధించేలా పంటలు పండించి రైతులకు చూపాలన్నది లక్ష్యం. ఒక ఎకరాకు ఆవుపేడ, మూత్రం, బెల్లం, సున్నం, పప్పుదినుసుల పిండి, పుట్టమన్నుతో తయారు చేసిన 400 కిలోల ఘన జీవామృతం పొడిని పొలంలో వెదజల్లారు. మరుసటి రోజు ఒక ఎకరాకు 12 నుంచి 15 రకాల విత్తనాలు కలిపి 17 నుంచి 20 కిలోల వరకు పొలంలో వెదజల్లారు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలసంద, అనుములు, మినుములు, కంది, రెండు రకాల చిక్కుడు, నువ్వులు, ఆముదం తదితర విత్తనాలు కలిపి వెదజల్లారు. వానల్లేకపోయినా.. విత్తే ముందు గోమూత్రం, బూడిద, ఇంగువతో తయారు చేసిన ‘బీజరక్ష’ ద్రావణంతో విత్తన శుద్ధి చేశారు. విత్తిన తర్వాత వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎకరాకు రెండు ట్రాక్టర్ల వరకు వెదజల్లి.. ఒక అంగుళం ఎత్తున మల్చింగ్(ఆచ్చాదన) చేశారు. ఒట్టి నేలల్లో విత్తనం వేసిన తర్వాత ఒకట్రెండు సార్లు తేలికపాటి తుంపర్లు పడ్డాయి. అనుకున్న విధంగా మొలకలు బాగానే వచ్చాయి. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరు వర్షం పడింది. ఆ తర్వాత రెండు నెలల పాటు వాన చినుకే లేదు. అయినా, ముందస్తు ఖరీఫ్ పంటలు పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యలో గోమూత్రంతో తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పిచికారీ చేశారు. ఆగస్టు 11 నాటికి ఆముదం గెల వేయగా, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర కంకులు ఏర్పడి గింజ పట్టాయి. పెసర, అలసంద కాయలు వచ్చాయి. ఇతర పంటలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సజ్జ లాంటి పంటలు ఐదారు పక్కకొమ్మలతో గుబురుగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. వాటి నుంచి మరో ఐదారు కంకులు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ. పది వేల పెట్టుబడి ఎకరానికి విత్తనాలకు రూ.1,500 వరకు ఖర్చయింది. వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఆచ్చాదన కోసం ఎకరానికి రూ.4 వేల వరకు ఖర్చయింది. ఎకరానికి ఘన, ద్రవ జీవామృతం తయారీకి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఖర్చయింది. దుక్కి, కూలీలతో కలిపి ఎకరాకు రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి అన్ని పంటల ద్వారా కనీసం రూ.25 వేలు విలువ చేసే దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీనితోపాటు, 36 సెంట్ల భూమిలో ఐదంచెల వ్యవసాయం చేపట్టారు. వివిధ ఎత్తుల్లో పెరిగే పండ్ల చెట్లు, 20–30 రకాల పంటలు కలిపి సాగు చేసేలా ప్రణాళిక తయారు చేశారు. రక్షణ కవచంగా మిత్రపురుగులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడంతోపాటు ఏకదళ, ద్విదళ పంటలు కలిపి సాగు చేస్తుండడంతో ఈ పొలాల్లో మిత్రపురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్షింతల పురుగు, గొల్లబామ, సాలె పురుగులు, చీమలు, కందిరీగలు, తేనెటీగలు, పెంకు పురుగులు కనిపించాయి. ఇవి శత్రుపురుగుల దాడి నుంచి పంటలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఘన, ద్రవజీవామృతం వాడటం వల్ల మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. గాలిలో ఉండేæ తేమను, నత్రజని సంగ్రహించి భూమికి అందిస్తున్నాయి. మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతున్నదని, పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని జెడ్బీఎన్ఎఫ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడక పోవడంతో తేనెటీగలు తుట్టెలు కడుతున్నాయి. పక్షల గూళ్లు అల్లుకోవడం కూడా కనిపించింది. ‘ముందస్తు ఖరీఫ్ కు విత్తనాలు వేస్తున్నప్పుడు కొందరు ఎగతాళి చేసినా మేం వెనుకడుగు వేయలేదు. ఇపుడు రైతులు ఆసక్తిగా ఈ పంటలు చూస్తున్నారు..’ అని జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం వి.లక్ష్మానాయక్ (8886614354), టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ సంతోషంగా చెబుతున్నారు. పంటలను పరిశీలిస్తున్న విజయకుమార్ తదితరులు ముందస్తు ఖరీఫ్ పంటల చుట్టూ ఖాళీ పొలాలే – రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ -
దేశీ విత్తనాలు, గోవులను రక్షించుకోవాలి
హైదరాబాద్: దేశీ విత్తనాలు, దేశీ గోవులను రక్షించుకోవాలని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి పిలుపునిచ్చారు. బహుళజాతి సంస్థలు అధిక దిగుబడి ఆశ చూపి సంకర జాతి విత్తన సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ సేద్యంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల భూసారం నాశనమవుతోందని, ఆ పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల జనం రోగాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూసారాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ఈ వ్యవసాయానికి వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసి దేశీ విత్తన సాగును ప్రోత్సహించాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆడిటోరియంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ దేశీ విత్తనోత్సవం రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకం.. దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలని విద్యారణ్య భారతీస్వామి సూచించారు. దేశీ ఆవు మలమూత్రాలతో తయారయ్యే ఎరువు, జీవామృతంతో పెట్టుబడి అవసరంలేని ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకమన్నారు. మాతా నిర్మలానంద భారతి మాట్లాడుతూ అమృతంలా ఉండాల్సిన ఆహారం కాస్తా విషంగా మారుతోందని, దీనికి ప్రకృతి సాగే పరిష్కారమని చెప్పారు. మాతా విజయేశ్వరీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో బీపీ, షుగర్, కాళ్ల, కీళ్ల నోప్పులు అనే మాటలు సర్వసాధారణం అయ్యాయన్నారు. రోగాలు కొనితెచ్చే వ్యవసాయం మాని ఆరోగ్యాన్ని పెంచే ప్రకృతి సాగు చేపట్టాలని కోరారు. దేశీ విత్తనాలకు మంచి స్పందన.. విత్తనోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో దేశీ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. వందలాది మంది ప్రకృతి సాగు రైతులు ఈ స్టాళ్లను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, ఒరిశా, ఏపీ, బిహార్, ఛత్తీస్‌గఢ్ తదతర రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన వివిధ రకాల వరితో పాటు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల సహజసిద్ధ విత్తనాలను రైతులు ఆసక్తిగా పరిశీలించారు. నాలుగేళ్లుగా ప్రకృతి సాగు మా వారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే. అయితే వ్యవసాయంపై మక్కువ. గ్రామంలో మాకున్న 25 ఎకరాల్లో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరితో పాటు పండ్ల తోటలను పెంచుతున్నాం. దేశీ విత్తనోత్సవంలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ దేశీ విత్తనాలు కొనుగోలు చేశాం. – కృష్ణవేణి, జయలక్ష్మిపురం, ఖమ్మం జిల్లా ప్రకృతి సాగువైపు అడుగులేస్తున్నారు దేశీ విత్తనోత్సవానికి మంచి స్పందన వస్తోంది. ప్రకృతి సాగుపై ఆసక్తితో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల రైతులు కూడా హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలను స్వయంగా చూస్తున్న రైతులు క్రమేణా ఈ విధానంవైపు అడుగులేస్తున్నారు. – విజయ్‌రాం, సేవ్ సంస్థ అధ్యక్షుడు, విత్తనోత్సవ నిర్వాహకుడు -
ఇకపై సబ్సిడీ ధరకే విత్తనాల సరఫరా
* తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం * విత్తన కంపెనీలకు ముందే సబ్సిడీ చెల్లింపు * విధానాన్ని మార్చనున్న రాష్ర్ట ప్రభుత్వం * అన్నదాతలకు తొలగనున్న ఇబ్బందులు * వ్యవసాయ శాఖ వర్గాలతో కేసీఆర్ సమీక్ష * విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలకు ఆదేశం * గ్రామ స్థాయిలోనూ విత్తనాల సరఫరా సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీ విత్తనాలనే సరఫరా చేయాలని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విత్తనాలకు రైతులు పూర్తి ధర చెల్లిస్తే తర్వాత వారి ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము చేరుతోంది. అయితే ఈ విధానాన్ని మార్చాలని, విత్తన కంపెనీలకు ముందే సబ్సిడీ చెల్లించి ఆ మేరకు రైతులకు సబ్సిడీ ధరకే విత్తనాలు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నిర్ణయించారు. గురువారం ఆయన సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్ రావు, వ్యవ సాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్సిడీ విత్తనాల సరఫరాపై చర్చ జరిగింది. నిజానికి చాలా ఏళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలనే సరఫరా చేస్తూ వచ్చింది. కొన్ని విత్తనాలను 50 శాతం సబ్సిడీపై, మరి కొన్నింటిని 33 శాతం సబ్సిడీపై రైతులకు అందించింది. అయితే రెండేళ్లుగా ఈ పద్ధతిని మార్చారు. సబ్సిడీని నగదు రూపేణా చెల్లించాలన్న ఉద్దేశంతో విత్తనాల మొత్తం ధరను రైతులు ముందే చెల్లించే విధంగా మార్పులు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా విత్తనాలు కావాల్సిన రైతు నిర్ధారిత ధర మేరకు మీసేవలో డబ్బులు చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్‌ను విత్తన సరఫరా కేంద్రంలో ఇచ్చి విత్తనాలు పొందవచ్చు. ఆ తర్వాత ఆ రైతుకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము అతని బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. ఈ విధానంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఏడాది కూడా ఇదే విధానం అమలు చే స్తూ విత్తనాల సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా దీనిపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ పాత పద్ధతికే మొగ్గు చూపారు. రాష్ట్రంలో సీడ్స్ కార్పొరేషన్, హాకా, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ వంటి సంస్థలు సబ్సిడీ విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. సబ్సిడీ నిధులను ప్రభుత్వం ఈ సంస్థలకు నేరుగా అందించనుంది. దీంతో ఇకపై రైతులు సబ్సిడీపోగా మిగిలిన డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. కాగా, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఈ సందర్భంగా ఆదేశించారు. మరోవైపు తొలకరి సమీపిస్తున్న నేపథ్యంలో తగినన్ని విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచినట్టు మంత్రి పోచారం ఈ సమీక్ష అనంతరం మీడియాకు తెలిపారు. విత్తనాల కోసం రైతులు రోడ్ల మీదకు వచ్చి అందోళన చేసే పరిస్థితి రాకుండా సబ్సిడీ విత్తనాలను గ్రామ స్థాయిలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వరి విత్తనాలు అవసరమైన స్థాయిలో ఉన్నాయన్నారు. అలాగే ఈ సీజన్లో సుమారు 1.75 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పింపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. మిగిలిన విత్తనాలను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే 17.44 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 6 లక్షల టన్నుల ఎరువుల్ని సమకూర్చామన్నారు. పంటలు వేసే సమయానికి మిగిలిన ఎరువులనూ అందుబాటులో ఉంచుతామని మంత్రి భరోసా ఇచ్చారు.