శనివారం నగరంలో జరిగిన విత్తనోత్సవంలో మాట్లాడుతున్న విద్యారణ్య భారతీస్వామి
హైదరాబాద్: దేశీ విత్తనాలు, దేశీ గోవులను రక్షించుకోవాలని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి పిలుపునిచ్చారు. బహుళజాతి సంస్థలు అధిక దిగుబడి ఆశ చూపి సంకర జాతి విత్తన సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ సేద్యంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల భూసారం నాశనమవుతోందని, ఆ పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల జనం రోగాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూసారాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ఈ వ్యవసాయానికి వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసి దేశీ విత్తన సాగును ప్రోత్సహించాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆడిటోరియంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ దేశీ విత్తనోత్సవం రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం..
దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలని విద్యారణ్య భారతీస్వామి సూచించారు. దేశీ ఆవు మలమూత్రాలతో తయారయ్యే ఎరువు, జీవామృతంతో పెట్టుబడి అవసరంలేని ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకమన్నారు. మాతా నిర్మలానంద భారతి మాట్లాడుతూ అమృతంలా ఉండాల్సిన ఆహారం కాస్తా విషంగా మారుతోందని, దీనికి ప్రకృతి సాగే పరిష్కారమని చెప్పారు. మాతా విజయేశ్వరీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో బీపీ, షుగర్, కాళ్ల, కీళ్ల నోప్పులు అనే మాటలు సర్వసాధారణం అయ్యాయన్నారు. రోగాలు కొనితెచ్చే వ్యవసాయం మాని ఆరోగ్యాన్ని పెంచే ప్రకృతి సాగు చేపట్టాలని కోరారు.
దేశీ విత్తనాలకు మంచి స్పందన..
విత్తనోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో దేశీ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. వందలాది మంది ప్రకృతి సాగు రైతులు ఈ స్టాళ్లను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, ఒరిశా, ఏపీ, బిహార్, ఛత్తీస్‌గఢ్ తదతర రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన వివిధ రకాల వరితో పాటు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల సహజసిద్ధ విత్తనాలను రైతులు ఆసక్తిగా పరిశీలించారు.
నాలుగేళ్లుగా ప్రకృతి సాగు
మా వారు, నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లమే. అయితే వ్యవసాయంపై మక్కువ. గ్రామంలో మాకున్న 25 ఎకరాల్లో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరితో పాటు పండ్ల తోటలను పెంచుతున్నాం. దేశీ విత్తనోత్సవంలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ దేశీ విత్తనాలు కొనుగోలు చేశాం.
– కృష్ణవేణి, జయలక్ష్మిపురం, ఖమ్మం జిల్లా
ప్రకృతి సాగువైపు అడుగులేస్తున్నారు
దేశీ విత్తనోత్సవానికి మంచి స్పందన వస్తోంది. ప్రకృతి సాగుపై ఆసక్తితో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల రైతులు కూడా హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలను స్వయంగా చూస్తున్న రైతులు క్రమేణా ఈ విధానంవైపు అడుగులేస్తున్నారు.
– విజయ్‌రాం, సేవ్ సంస్థ అధ్యక్షుడు, విత్తనోత్సవ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment