చీడపీడలపై ‘ప్రకృతి’ అస్త్రం! | Green Super Rice cultivation without Pest | Sakshi
Sakshi News home page

చీడపీడలపై ‘ప్రకృతి’ అస్త్రం!

Published Tue, May 2 2017 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

చీడపీడలపై ‘ప్రకృతి’ అస్త్రం! - Sakshi

చీడపీడలపై ‘ప్రకృతి’ అస్త్రం!

వృత్తిరీత్యా న్యాయవాదైనా భేషజాలు లేకుండా ప్రకృతికి ప్రణమిల్లి సాగు బాట పట్టారాయన. ప్రకృతి నియమాలకు తలొగ్గి జీవిస్తేనే మనుగడ సజావుగా సాగుతుందని నమ్మి ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తున్నారు. చీడపీడలు లేని పంటల సాగుతో సాటి రైతులకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రకృతి సేద్యం అనగానే అధిక శ్రమ చేయాల్సిందేనన్న అభిప్రాయం అవాస్తవమని ఆచరణ ద్వారా రుజువు చేస్తున్నారు.

15 ఏళ్లు న్యాయవాదిగా పనిచేశాక గడ్డం సత్యనారాయణ రెడ్డి మనసు వ్యవసాయం వైపు మళ్లింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నాగారం ఆయన స్వగ్రామం.   పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి తెలుసుకొని 2002లో శిక్షణకు హాజరయ్యారు. అప్పటి నుంచి తన 16 ఎకరాల పొలాన్ని కౌలుకు ఇవ్వటం మానుకున్నారు. పత్తి, పసుపు, కంది, వరి పంటలను స్వయంగా తానే సాగు చేస్తున్నారు. ఏ పంటను సాగు చేసినా దుక్కిలో ఆముదం, వేపపిండి, వర్మీ కంపోస్టులను తప్పనిసరిగా వేసుకుంటారు. పంటకాలంలో ఒకే ఒక్కసారి జీవామృతం ఇస్తారు. గత ఐదారేళ్ల నుంచి చీడపీడలు ఆశించకపోవటం వల్ల కషాయాలు పిచికారీ చేయాల్సిన అవసరం రావడం లేదు.  

పత్తి పంటకీ చీడపీడల్లేవు!
2016 ఖరీఫ్‌లో ఎకరాలో సంకర జాతి రకం పత్తిని సాగు చేశారు. దుక్కిలో ఎకరాకు 5 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేశారు. 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 50 రోజుల దశలో పైరుపై పిచికారీ చేశారు. పత్తి పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కూలీలకు రూ. 7 వేలు ఖర్చయింది. రూ. 40 వేల నికరాదాయం లభించింది.

చీడపీడలు లేని గ్రీన్‌ సూపర్‌ రైస్‌ సాగు
2016 ఖరీఫ్‌లో 4 ఎకరాల్లో గ్రీన్‌ సూపర్‌ రైస్‌ (ఎస్‌.ఎ.ఎల్‌.–10)ను సాగు చేశారు. వరి నాట్లకు ముందు జీలుగ, జనుము సాగు చేసి దమ్ములో కలియదున్నారు. దుక్కిలో ఎకరాకు 10 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేశారు. 40 రోజుల దశలో ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించారు. వేపనూనె ఎకరానికి లీటరు చొప్పున రెండు విడతలు పిచికారీ చేశారు. నీటిని నిలవ గట్టి కలుపు సమస్యను నివారించారు. పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఎకరాకు 40 క్వింటాళ్లకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది.  నాట్లు, నూర్పిడికి ఎకరాకు రూ. 12 వేలు ఖర్చయింది. విత్తనంగా రైతులకు అందించేందుకు ధాన్యాన్ని నిల్వ చేశారు.  

సేంద్రియ పసుపుతో ఎకరాకు రూ.3 లక్షలు
ప్రకృతి సేద్య విధానంలో ఎకరాలో పసుపును సాగు చేశారు. దుక్కిలో  2 క్వింటాళ్లు వేపపిండి, 5 క్వింటాళ్లు వర్మికంపోస్టు వేశారు. 60 రోజులకు ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించారు. పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఎకరాకు 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పసుపు కొమ్ములను పొడిగా మార్చి అమ్ముతున్నారు. క్వింటా కొమ్ములకు 80 కిలోల పొడి వస్తుంది. కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ. 3 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఇది మార్కెట్‌ ధరకు రెండింతలు. సేంద్రియ పసుపు పొడి కోసం అమెరికా నుంచి ఆర్డర్లు వస్తున్నట్టు ఆయన చెప్పారు.  

కంది నాటితే.. దిగుబడుల మోతే...
నాట్లు వేసే పద్ధతిలో కందిని సాగు చేసి ఆయన మంచి దిగుబడి సాధించారు. గత ఖరీఫ్‌లో బీఎస్‌ఎంఆర్‌ –736 కంది రకాన్ని ఎకరాకు 2 కిలోల విత్తనం వాడారు. మేలో పాలిథిన్‌ సంచుల్లో ఎర్రమట్టి, కంపోస్టును కలిపి.. సంచికి రెండు విత్తనాలు చొప్పున విత్తారు. 45 రోజులకు కంది మొక్కలు రెండున్నర అడుగుల ఎత్తు పెరిగాయి. దుక్కిలో ఎకరాకు 5 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు, 2 క్వింటాళ్ల వేపపిండి, 3 క్వింటాళ్లు ఆముదం పిండి వేశారు. మొక్కల మధ్య 3, సాళ్ల మధ్య 5 అడుగుల ఎడం ఉండేలా నాటారు. పూతదశలో జీవామృతాన్ని నీటి ద్వారా ఇచ్చారు. కాయ దశలో వేపనూనె చల్లారు. పంటను ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఫిబ్రవరిలో నూర్చితే ఎకరాకు 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌ రూ. 5,500 చొప్పున అమ్మారు. రూ. 50 వేల నికరాదాయం లభించింది.

హైదరాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం.) వారు సత్యనారాయణ రెడ్డిని సేంద్రియ రైతుగా గుర్తించి ప్రోత్సహించారు. బోరు మోటారును స్విచ్‌ ఆన్, ఆఫ్‌ చేయడానికి ‘కిసాన్‌ రాజా’ పరికరాలను మొబైల్‌ ద్వారా ఆయన వాడుతున్నారు. సత్యనారాయణరెడ్డి స్ఫూర్తితో పరిసర గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు రసాయన సేద్యాన్ని వదిలి ప్రకృతి సేద్యాన్ని చేపట్టడం విశేషం. వెలిగిన దీపమే మరికొన్ని దీపాలను వెలిగిస్తుందనే సూక్తిని నిజం చేసిన  సేంద్రియ వ్యవసాయ దీప్తి సత్యనారాయణ రెడ్డి.
– పన్నాల కమలాకర్‌ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల జిల్లా
ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి, సాక్షి ఫొటో జర్నలిస్టు


ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేయాలి
పొలం ఉన్న ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడే రైతులు బాగుపడతారు.  పదిహేనేళ్ల నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నా. 68 ఏళ్ల వయసులోనూ నా పనులన్నీ నేనే చేసుకుంటున్నా. రసాయన ఎరువులు వేయకుండా పండించిన సహజ ఆహారం తీసుకోవటం వల్లనే ఇది సాధ్యమయింది. బీపీ, షుగర్‌ లాంటి రోగాలు లేవ#. ఆదాయం కోసం కాకపోయినా కుటుంబం కోసం కొంత విస్తీర్ణంలోనయినా రైతులు ప్రకృతి సేద్యం చేయాలి.
– గడ్డం సత్యనారాయణ రెడ్డి (88973 29237),
నాగారం, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement