మిరప తోటలో అంతర పంటగా సాగు చేసిన చామ దుంపలతో రైతు చింతా వరప్రసాద్
అధిక వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణ పరిస్థితులు తామర పురుగు విజృంభించడానికి దోహదపడ్డాయి. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మిర్చి పంట కాలంలో ఎకరానికి 25–30 నుంచి బస్తాల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఇప్పటికే 12–13 బస్తాల చొప్పున వాడి ఉంటారు. మార్చి వరకు దఫదఫాలుగా ఈ ఎరువులు వేస్తూ.. తరచూ పురుగుమందులు పిచికారీ చేస్తూ ఉంటారు. అధిక రసాయనాలతో మిర్చిని ఏకపంటగా సాగు చేయటం వల్లనే తామరపురుగు విజృంభించింది. విపరీతంగా రసాయనాలు గుప్పించి ఏటా మిరప సాగు చేసే భూముల్లో సేంద్రియ కర్బనం 0.3 – 0.4 మేరకు మాత్రమే మిగిలి ఉంటుంది. మొక్కలు రసాయనిక ఎరువుల వల్ల ఏపుగా పెరిగినా రోగనిరోధకశక్తి సన్నగిల్లిపోతున్నది. అందువల్లనే మిరప పంటకు ఇప్పుడు తామర పురుగులు ఆశిస్తున్నాయి. తామర పురుగులు ఆశించిన తోటల్లో పూత రాలుతున్నది. ఆకుల పైముడత వల్ల కొత్త పూత రావటం లేదు. అనేక రకాల రసాయనిక పురుగుమందులు కలిపి పిచికారీ చేయటం వల్ల సమస్య మరింత జటిలం అవుతున్నది.
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరపను సాగు చేసే రైతులు చీడపీడల నుంచి చాలా వరకు రక్షణ పొందుతున్నారు. అంతర పంటలు వేయటం.. జిగురు పూసిన పసుపు, నీలిరంగు అట్టలు పెద్ద ఎత్తున పెట్టుకోవటం.. ఘనజీవామృతం, జీవామృతంతోపాటు కషాయాలు, ద్రావణాలు వాడటం ద్వారా చీడపీడలను ఎదుర్కొనే శక్తి పంటలకు చేకూరుతున్నది.
రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతులు కూడా ఇప్పటికైనా వెంటనే మిరప తోటల్లో జిగురు అట్టలు పెట్టుకోవాలి. నీలిరంగు అట్టలు ఎకరానికి 5–10 పెట్టుకుంటే పురుగు తీవ్రత తెలుస్తుంది. ఇప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎకరానికి 50 నుంచి 100 వరకు పెట్టుకుంటే పురుగును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.
మిరప మొక్కల మధ్య ఏదో ఒక అంతర పంట ఉండేలా చూడాలి. అక్కడక్కడా బంతి మొక్కలు నాటుకోవాలి. మిరప మొక్కల మధ్య కొత్తిమీర, ఉల్లి, ముల్లంగి వంటి అంతర పంటల విత్తనాలు విత్తుకుంటే కొద్ది రోజుల్లోనే మొలకెత్తి చీడపీడల నియంత్రణలో ప్రభావాన్ని చూపుతాయి. వీటితోపాటు.. మిరప పొలం చుట్టూతా 3 వరుసలు సజ్జ, మొక్కజొన్న, జొన్న విత్తుకుంటే చీడపీడల నుంచి రక్షణ కల్పిస్తాయి.
4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు
►మిరప పంటపై తామరపురుగులను అరికట్టడానికి వేప నూనె లేదా వేప గింజల కషాయం, అగ్ని అస్త్రం, నల్లేరు కషాయంలను ఒకదాని తర్వాత మరొకటి 4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు చేస్తే పంటను రక్షించుకోవచ్చు.
►1,000–1,500 పిపిఎం వేపనూనె పనిచేయదు. 10,000 పిపిఎం వేప నూనె మార్కెట్లో దొరికితే వాడుకోవచ్చు. అర లీటరు వేపనూనెను ఎమల్సిఫయర్ లేదా 100 గ్రాముల సబ్బు పొడిని 200 లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి.
►10,000 పిపిఎం వేప నూనె దొరక్కపోతే.. 5% వేపగింజల కషాయాన్ని వెంటనే పిచికారీ చేస్తే పంటను రక్షించుకోవచ్చు. వేప నూనెను లేదా 5% వేప గింజల కషాయాన్ని 4 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి.
►ఆ తర్వాత 4 రోజులకు అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. 100 లీ. నీటికి 4 లీ. అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. ఆ తర్వాత 4 రోజులకు నల్లేరు కషాయం పిచికారీ చేయాలి. మళ్లీ ఇదే వరుసలో వీటిని పిచికారీ చేయటం ద్వారా మిరప పంటను తామరపురుగుల నుంచే కాదు ఇతర చీడ పీడల నుంచి కూడా రక్షించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు తెలియజెబుతున్నాయి.
తామర పురుగు రానీయను
గత సంవత్సరం ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప సాగు చేశాను. మంచి ధర వచ్చింది. ఈ ఏడాది 1.6 ఎకరాలలో మిర్చి విత్తనాలను వెద పద్ధతిలో ట్రాక్టర్ సీడ్ డ్రిల్‌తో వేసుకొని ఖర్చులు తగ్గించుకున్నా. 70 రోజుల పంట. పూత వస్తోంది. వేపగింజల కషాయం, నీమాస్త్రం రెండేసి సార్లు పిచికారీ చేశా. బొబ్బర రాకుండా గానుగ నుంచి తెచ్చిన వేప నూనె పిచికారీ చేశా. ఇప్పటికైతే తామరపురుగులు కనిపించలేదు. రోజూ పొలాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నా. తామరపురుగులను 90% రానీయను.
– చింతా వరప్రసాద్ (91211 47705),
కొప్పర్రు, పెదనందిపాడు మం.,
గుంటూరు జిల్లా
జిగురు అట్టలు, కషాయాలతో ఉపయోగం
9 ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తున్నా. ఇందులో 2.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మిగతా పొలానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నా. పచ్చిమిర్చి – ఉల్లిపాయ కషాయం, వేపగింజల కషాయం పిచికారీ చేశాను. పసుపు జిగురు అట్టలు పెట్టాను. మిరప పువ్వుపై 10–15 తామరపురుగులు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 4–5కు తగ్గింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు మాత్రమే వాడిన పొలం కన్నా.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. జిగురు అట్టలు, వేపగింజల కషాయం బాగా
ఉపయోగపడ్డాయి.
– బైకా వెంకటేశ్వరరెడ్డి
(96667 13343),
మానుకొండవారిపాలెం,
చిలకలూరిపేట మం., గుంటూరు జిల్లా
చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment