మిరపకు పునరుజ్జీవం.. నాకైతే నమ్మకం కుదిరింది! | Chilli Farming: Homeo Medicine Controlled Nalla Tamara Purugu | Sakshi
Sakshi News home page

మిరపకు పునరుజ్జీవం.. నాకైతే నమ్మకం కుదిరింది!

Published Tue, Feb 8 2022 8:12 PM | Last Updated on Tue, Feb 8 2022 8:19 PM

Chilli Farming: Homeo Medicine Controlled Nalla Tamara Purugu - Sakshi

మిరప తోటలో శ్రీనివాసరెడ్డి

నల్ల తామరపురుగు.. ఈ ఏడాది అనేక రాష్ట్రాల్లో మిరప తదితర పంటల పూతను ఆశించి రైతులకు పెనునష్టం కలిగించింది. యాదాద్రి జిల్లా భువనగిరికి సమీపంలోని రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి సూచించిన హోమియో మందుల వివరాలు, వాడే విధానంపై 2022 జనవరి 11న ‘సాక్షి సాగుబడి’లో కథనం ప్రచురించాం. ఈ నేపధ్యంలో.. పీకేద్దామనుకున్న తోటలను సైతం పునరుజ్జీవింపజేయటంలో హోమియో మందులు అద్భుత ఫలితాలనిస్తున్నాయని రైతులు స్వానుభవంతో చెబుతున్నారు. డా.వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్‌ శాస్త్రవేత్త కూడా హోమియో మందులతో మిరప చీడపీడల నియంత్రణలో సానుకూల ఫలితాలు వస్తున్నాయనటం విశేషం. 

రూ. 5 వేలతో గట్టెక్కాం...
మా ప్రాంతంలో నల్ల తామరపురుగు దెబ్బకు చాలా గ్రామాల్లో మిరప తోటలు పీకేశారు. తోటలు మిగిలిన రెండు, మూడు గ్రామాల్లో మాది కూడా ఒకటి. గత నవంబర్‌ నుంచి మా 10 ఎకరాల్లో మిరప పొలానికి హోమియో మందులు వాడుతున్నాను. 4–5 రోజుల వ్యవధిలో ఇప్పటికి పది సార్లు పిచికారీ చేశాను. నల్ల తామరపురుగు మీద బాగానే పనిచేశాయి. 10 ఎకరాలకు కలిపి ఎంత తక్కువనుకున్నా పురుగుమందుల ఖర్చు రూ. 2 లక్షలైనా అయ్యేది. హోమియో మందులకు మాకు రూ. 5 వేలతో సరిపోయింది. దిగుబడి నలుగురితో సమానంగా వస్తున్నది. పురుగుమందులు వాడి మాకన్నా తక్కువగా దిగుబడితో సరిపెట్టుకుంటున్న కూడా ఉన్నారు. పంట మొదటి నుంచీ హోమియో మందులు మాత్రమే వాడితే ఇంకా బాగుంటుంది. వచ్చే సంవత్సరం నేనైతే మొదటి నుంచీ హోమియో మందులే వాడతా.    
– యెనిరెడ్డి శ్రీనివాసరెడ్డి (83286 72773), మిరప రైతు, గొరిజవోలు గుంట పాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా

రూ. 5 వేలతో గట్టెక్కాం...
మా ప్రాంతంలో నల్ల తామరపురుగు దెబ్బకు చాలా గ్రామాల్లో మిరప తోటలు పీకేశారు. తోటలు మిగిలిన రెండు, మూడు గ్రామాల్లో మాది కూడా ఒకటి. గత నవంబర్‌ నుంచి మా 10 ఎకరాల్లో మిరప పొలానికి హోమియో మందులు వాడుతున్నాను. 4–5 రోజుల వ్యవధిలో ఇప్పటికి పది సార్లు పిచికారీ చేశాను. నల్ల తామరపురుగు మీద బాగానే పనిచేశాయి. 10 ఎకరాలకు కలిపి ఎంత తక్కువనుకున్నా పురుగుమందుల ఖర్చు రూ. 2 లక్షలైనా అయ్యేది. హోమియో మందులకు మాకు రూ. 5 వేలతో సరిపోయింది. దిగుబడి నలుగురితో సమానంగా వస్తున్నది. పురుగుమందులు వాడి మాకన్నా తక్కువగా దిగుబడితో సరిపెట్టుకుంటున్న కూడా ఉన్నారు. పంట మొదటి నుంచీ హోమియో మందులు మాత్రమే వాడితే ఇంకా బాగుంటుంది. వచ్చే సంవత్సరం నేనైతే మొదటి నుంచీ హోమియో మందులే వాడతా.    
– యెనిరెడ్డి శ్రీనివాసరెడ్డి (83286 72773), మిరప రైతు, గొరిజవోలు గుంట పాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా

నాకైతే నమ్మకం కుదిరింది!
6 ఎకరాల్లో మిరప వేస్తే ఈ ఏడాది నల్ల తామరపురుగు సోకి నాశనమైంది. ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి పెట్టా. అయినా, పురుగు తీవ్రంగా నష్టపరిచింది. నెల రోజులు ఏమీ చేయకుండా వదిలేశా. ఇక గొడ్లకు మేపుదాం అనుకున్నా. ఆ దశలో 3 వారాల క్రితం ‘సాక్షి సాగుబడి’లో హోమియో మందులతో తామరపురుగును నియంత్రించవచ్చని కథనం చదివి తెలుసుకున్నా. ఆర్నేరియా డయాడెమా 30 మందును పిచికారీ చేశాను. చాలా బాగా పనిచేసింది. ఇప్పటికి 2 రోజుల వ్యవధితో 5 డోసులు పిచికారీ చేశాను. ఎర్రగా మారిన తోట అంతా ఆకుపచ్చగా మారింది. ఇగుర్లు, పూత వస్తున్నది. హోమియో మందుల సంగతి ముందే తెలిసి ఉంటే పంట నష్టం చాలా తగ్గి ఉండేది. ఖర్చు కూడా తక్కువే. ఇంగ్లిష్‌ (రసాయనిక పురుగు) మందులు ఎకరానికి పిచికారీకి రూ. 3 వేల వరకు ఖర్చవుతుంది. దీనికి రూ. 60–70 చాలు. 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్‌. హోమియో మందు కలిపి చల్లితే చాలు. నాతో పాటు మా వూళ్లో ఇంకో 15 మంది రైతులు కూడా హోమియో వాడుతున్నారు. 
– బండారు దేవేందర్‌రెడ్డి (96188 85878), మిరప రైతు, బీరోలు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా

తామరపురుగు కంట్రోల్‌ అయ్యింది
15 ఎకరాల కౌలు భూమిలో మిరప సాగు చేస్తున్నాం. నెల రోజుల నుంచి 4–5 రోజులకోసారి హోమియో మందులు పిచికారీ చేస్తున్నాను. నల్ల తామరపరుగు పూర్తిగా పోలేదు గానీ కంట్రోల్‌లోకి వచ్చింది. పూత, ఇగుర్లు వస్తున్నాయి. పంట మొదటి నుంచీ ఇంగ్లిష్‌ (రసాయన పురుగు) మందులు వాడలేదు. నూనెలు వాడేవాడిని. బూడిద తెగులు, తెల్లదోమ, తామరపురుగులకు హోమియో మందులు నెల నుంచి ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేస్తున్నాను. బాగానే పనిచేస్తున్నాయి. సమస్యలు పెరగలేదు. అలాగని పూర్తిగానూ పోలేదు. ఆకుముడత రాలేదు. ఎకరానికి 12.15 క్వింటాళ్ల ఎండు మిరప దిగుబడి వస్తుంది. ఇంకో ఇద్దరు ముగ్గురు రైతులు కూడా వాడుతున్నారు. నూనెల కన్నా హోమియో మందుల ఖరీదు కూడా తక్కువే. 
– బొమ్మసాని సాంబయ్య (84669 23488), మిరప రైతు, అయనూర్, రాయచూర్‌ జిల్లా, కర్ణాటక

హోమియో మందుల పిచికారీ ఇలా..
ద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు బాల్‌రెడ్డి ప్రత్యేక పద్ధతిని సూచిస్తున్నారు. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి,  సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎం.ఎల్‌.ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలకొట్టినట్టు వేగంగా ఉపాలి. ఆ తర్వాత ఆ సీసాలోని మిశ్రమాన్ని 20 లీటర్ల తైవాన్ స్ప్రేయర్‌ ట్యాంక్‌లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్‌. కంటే ఎక్కువ మందు వాడవద్దు. అలా చేస్తే మందు పనిచేయదని, మోతాదు మించితే ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చని బాల్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, 2,3 హోమియో మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి పిచికారీ చేయకూడదన్నారు. స్ప్రేయర్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే ఫలితాలు వస్తాయన్నారు. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్ప్రేయర్‌ ను, బాటిళ్లను శుభ్రంగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయన్నారు. (క్లిక్‌: మిన్నల్లి పనిపట్టే వై.ఎన్‌. ద్రావణం!)

రెండు పిచికారీలతో సత్ఫలితాలు
మిరప పంటపై ఆశించిన వెస్ట్రన్‌ తామరపురుగును నియంత్రించడానికి హోమియో మందులు తుజ 30, ఆర్నేరియా డైడిమా 30 పిచికారీ చేస్తే సానుకూల ప్రభావం కనిపించింది. రెండు సార్లు మాత్రమే ఈ మందులను వేర్వేరుగా వాడాము. పురుగు తాకిడి నుంచి తట్టుకొని పూత నిలబడడానికి, కొత్త పూత, పిందె రావడానికి ఈ మందులు ఉపయోగపడ్డాయి. నల్ల తామరపురుగుల సంఖ్య తగ్గింది. రసాయనాలతో పోల్చితే ఈ హోమియో మందులు ఖర్చు తక్కువే కాకుండా.. మనుషులకు కూడా హానికరం కాదు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంది. 
– డా. ఎ.రజని (99898 09554), సీనియర్‌ శాస్త్రవేత్త, డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement