సేంద్రీయ/ప్రకృతి సాగులో దేశీరకం కావేరీ మిర్చి తోట
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పూర్తి స్థాయిలో అనుసరిస్తే మిరప సాగులో చీడపీడలను సమర్థవంతంగా అధిగమించడంతోపాటు అధిక దిగుబడి పొందవచ్చని నిరూపిస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన రైతు పి. శరత్‌చంద్ర. పాణ్యం మండలం తొగరచేడులో తన మిత్రుడు వై.రామిరెడ్డితో కలిసి ఏడెకరాల్లో రెండేళ్లుగా మిరప పంటను శరత్ సాగు చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కారువంకలో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న లావణ్య రమణారెడ్డి వద్ద నుంచి కావేరి రకం దేశీ మిర్చి విత్తనాలు తెచ్చుకొని గత ఏడాది నుంచి సాగు చేస్తున్నారు. ఎకరానికి రెండు కిలోల విత్తనాన్ని గొర్రుతో సాళ్లుగా వెద పెట్టి మిరప పంటను సాగు చేయటం విశేషం. సాళ్ల మధ్య రెండు అడుగులు పెడుతున్నారు. మొక్కల మధ్య 9 అంగుళాల నుంచి ఒక అడుగు దూరం ఉంచుతున్నారు. మొలిచిన తర్వాత 2–3 వారాల్లో పోనాటు వేస్తున్నారు.
వెద పద్ధతిలో మిరప సాగు చేయటం వల్ల జెమినీ వైరస్‌ను తట్టుకునే శక్తి పెరిగినట్లు తాము గమనించామని శరత్ తెలిపారు. నారు పీకి మొక్క నాటినప్పుడు.. మొక్క తిరిగి వేరూనుకొని తిప్పుకునే లోగా జెమినీ వైరస్ సోకుతున్నదని, విత్తనం వెద పెట్టినప్పుడు ఆ సమస్య రాదన్నారు. గత ఏడాది ఎకరానికి 15–16 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి సాధించామని, అతివృష్టి వల్ల నష్టం జరిగినప్పటికీ ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామని అంటున్న శరత్ మాటల్లోనే వారి సాగు తీరుతెన్నులు..
ఘనజీవామృతం, వేపపిండి..
దుక్కిలో ఎకరానికి ఘనజీవామృతం 2 టన్నులు, వేపపిండి ఒక టన్ను వేశాం. మిరప విత్తనం వేసిన వెంటనే ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. మిరప విత్తనాలు మొలిచిన 15 రోజుల తర్వాత 20 లీ. నీటికి 40 ఎం.ఎల్. చొప్పున 10,000 పిపిఎం వేపనూనె పిచికారీ చేశాం. మొక్కలపై పచ్చదోమ, తామరపురగు గుడ్లుంటే దీని వల్ల పగిలిపోతాయి. ఆ తర్వాత వారానికి జీవామృతం పిచికారీ చేశాం. విత్తిన నెల తర్వాత ఎకరానికి టన్ను ఘనజీవామృతం, అర టన్ను వేపపిండి వేసి.. నీటి తడి ఇవ్వటంతో పాటు జీవామృతం పారించాము. 45వ రోజు పంచగవ్య (లీటరుకు 9 లీ. నీరు) పిచికారీ చేశాం. అప్పటినుంచి ప్రతి 15 రోజులకోసారి భూమిలో నీటి తడితోపాటు జీవామృతం పారించడం, పంచగవ్య పిచికారీ చేస్తున్నాం.
మిరపతోపాటు ఆముదం, బంతి, జొన్న
మిరప విత్తనాన్ని గొర్రుతో సాళ్లుగా వెదపెట్టిన తర్వాత.. ప్రతి 20 అడుగులకు ఒక ఆముదం మొక్క, ప్రతి 6 అడుగులకు ఒక బంతి మొక్క వేశాం. ఆముదం కొన్ని రకాల పురుగులను దరిచేరనీయదు. బంతిమొక్క వల్ల మిరప మొక్కలకు నులిపురుగుల (నెమటోడ్స్) సమస్య, వేరు కుళ్లు రాకుండా ఉంటాయి. బంతి పూలకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వస్తాయి కాబట్టి పరపరాగ సంపర్కం బాగా జరుగుతుంది. పొలం చుట్టూతా 3 వరుసలు పచ్చ జొన్న విత్తాం. తద్వారా బయటి నుంచి పొలం లోపలికి రసం పీల్చే పురుగులు రాకుండా జొన్న పంట కంచె మాదిరిగా ఉపయోగపడుతుంది. జొన్నలు తినటానికి పక్షులు వస్తాయి. మిరప మొక్కలపై కనిపించే పురుగూ పుట్రను కూడా పక్షులు తింటాయి. దోమ నివారణకు ఎకరానికి 30 నూనె పూసిన పసుపు రంగు అట్టలను, తామరపురుగులను అరికట్టేందుకు ఎకరానికి 30 నూనె పూసిన నీలం అట్టలను పెట్టాం. మగపురుగులను మట్టుబెట్టేందుకు ఎకరానికి పది ఫెరమోన్ ట్రాప్స్ ఏర్పాటు చేశాం. ఈ విధంగా చీడపీడలను జీవనియంత్రణ పద్ధతుల్లో పంటను రక్షించుకుంటున్నాం.
ఆకు ముడతకు ఉల్లిగడ్డ కషాయం
ఆకు ముడత కనిపిస్తే ఉల్లిగడ్డ కషాయం పిచికారీ చేస్తున్నాం. ఎకరానికి 5 లీ. కషాయం చాలు. 20 లీ. నీటికి ఒక లీ. కషాయం కలిíపి చల్లుతున్నాం. ఆకుముడతను అరికడితే జెమినీ వైరస్ రాదు. ఈ కషాయం ద్వారా పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. ఉల్లిగడ్డ కషాయం తయారీ విధానం : ఈ కషాయం ఒకసారి తయారు చేస్తే 6 నెలలు నిల్వ ఉంటుంది. కిలో ఉల్లి గడ్డలు, కిలో లవంగాలు, అర కిలో ఇంగువ, 100 గ్రా. పచ్చ కర్పూరం కలిపి పొడి చేసి 20 లీ. నీటిలో కలపాలి. అందులో 10 లీ. దేశీ/నాటు ఆవు మూత్రం, అర కిలో పేడ కలిపి.. పొయ్యి మీద పెట్టి 5 పొంగులు వచ్చే వరకూ మరిగించాలి. సుమారు 30 లీ. కషాయం సిద్ధమవుతుంది. వడకట్టి నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. 15–20 రోజులకోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేస్తే ఆకుముడత నుంచి మిరప తోటను కాపాడుకోవచ్చని మా అనుభవంలో రుజువైంది.
బవేరియా.. వర్టిసెల్లం..
పూత దశలో 3% (వంద లీ. నీటికి 3 లీ. పుల్లమజ్జిగ) పుల్ల మజ్జిగ పిచికారీ చేశాం. చిన్న పిందె దశలో సప్త ధాన్యాంకు కషాయం పిచికారీ చేశాం. పూత ఆగిపోయిన తర్వాత కూడా మరోసారి చల్లాం. విత్తిన 60–75 రోజుల మధ్యకాలంలో.. బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని (లీ. నీటికి 8 ఎం.ఎల్. చొప్పున) పిచికారీ చేశాం. ఇది చల్లిన 10–15 రోజుల మధ్యలో వర్టిసెల్లం లఖాని శిలీంధ్రాన్ని పిచికారీ చేశాం. తామరపురుగులు, దోమను అరికట్టడానికి ఈ శిలీంధ్రాలు బాగా తోడ్పడ్డాయి. మిరప పంటను ఆశించే చీడపీడలను సమర్థవంతంగా నివారించాలంటే ఇలా బహుముఖ వ్యూహాన్ని అమలు పరచక తప్పదు. జూలై 28న మిరప విత్తనం వేశాం. మార్చి 2 నుంచి మిరప పండ్లు కోస్తున్నాం. 60–70% కాయలు ఎర్రబడిన తర్వాత నీటితడితోపాటు జీవామృతం పారించిన రెండు వారాల తర్వాత మొదటిసారి మిర్చి పండ్లు కోస్తున్నాం. మొదటి కోతలో 80%, ఆ తర్వాత రెండు మూడు కోతల్లో మిగతావి కోసి ఎండబెట్టి, తేమ 10–15%కు తగ్గిన తర్వాత బస్తాలకు ఎత్తి అమ్ముతాం. లేదా కోల్డ్ స్టోరేజ్‌కి తరలిస్తాం.
ఈ ఏడాది అతివృష్టి వల్ల మిరప తోటలు దెబ్బతిన్నాయి. అయినా మా తోటలో ఎకరానికి 15 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ప్రకృతి సాగు ప్రారంభించిన గత ఏడాది ఎకరానికి 16 క్వింటాళ్ల వరకు ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే మిరప రైతులకు మా ప్రాంతంలో సగటున 18 క్వింటాళ్ల (అత్యధికంగా 24 క్వింటాళ్ల) దిగుబడి వస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రకృతి/సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి మాకు ఎకరానికి రూ. 40 వేలు– రూ. 50 వేలు ఖర్చు అయ్యింది. రసాయనాలు వేసే వారికి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. ఎండుమిర్చిని మనదేశం నుంచి చైనా వాళ్ళు కొనకపోవడం వల్ల ధర కొంత తగ్గింది. అయినా మాకు ఎకరానికి కనీసం రూ. 1,20,000 నికరాదాయం వస్తుందని ఆశిస్తున్నాం. మేం వేసింది దేశీ రకం కావేరి మిరప. పంట నుంచి తీసిన విత్తనాలనే అడిగిన రైతులకూ ఇస్తున్నాం.. మేమూ వాడుతున్నాం.
(పి. శరత్‌చంద్ర –99898 53366, వై.రామిరెడ్డి – 98667 60457)
Comments
Please login to add a commentAdd a comment