కొత్త పంట
ఎర్ర అరటి పండు మనకు అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే, ఎర్ర ఆకులతో కూడిన అరటి చెట్టు అరుదనే చెప్పాలి. దీని ఆకు మాదిరిగానే కాయ కూడా ఎర్రగానే ఉంటుంది. కర్ణాటకలోని సిర్సికి చెందిన రైతు ప్రసాద్ కృష్ణ హెగ్డే ఈ అరుదైన అరటి వంగడాన్ని సంరక్షిస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో 80 అరటి రకాలను తన పొలంలో పెంచుతూ అరటి పంటల్లో వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. ప్లాస్టిక్ బనానా అనే మరో రకం కూడా ఈయన దగ్గర ఉంది. దీని ఆకులను భోజనం చేయటానికి వాడతారట.
మైసూరులో ఇటీవల 3 రోజుల పాటు సహజ సమృద్ధ, అక్షయకల్ప ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘అరటి పండుగ’ సందర్భంగా ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. 550 అరటి రకాలను సంరక్షిస్తున్న కేరళకు చెందిన వినోద్ నాయర్ 75 రకాల అరటి పండ్లను ఈ ఉత్సవంలో ప్రదర్శించటం మరో విశేషం. వినోద్ నాయర్‌తో పాటు 100 దేశీ అరటి రకాలను సంరక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్‌ను సైతం ఘనంగా సత్కరించారు.
ఆహార నిపుణురాలు, రచయిత్రి రత్న రాజయ్య అరటి పండుగలో మాట్లాడుతూ ఏదో ఒకే రకం అరటిని సాగు చేయటం ప్రమాదకరమని, ఏదైనా మొండి తెగులు సోకిందంటే మొత్తం ఆ అరటి రకమే అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం అరటి రకాల్లో జీవవైవిధ్యాన్ని మన తరం పరిరక్షించుకోవాలని పలుపునిచ్చారు.
ఎర్ర అరటి జగత్‌ప్రసిద్ధం
సహజ సమృద్ధ ఎన్జీవో డైరెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘అరటి బంగారంతో సమానం. అరటి ప్రపంచం పెద్దది. వందలాది వంగడాలున్నాయి. మానవ జీవితంలో పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో, ఆచార వ్యవహారాల్లో అరటి పండు సాంస్కృతిక అవసరం ఉంటుంది. ప్రతి రకం రుచి, రంగు, సైజు, చెట్టు ఎత్తులో వైవిధ్యభరితంగా ఉంటాయ’న్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి అరటి రకాలున్నాయి. ఆఫ్రికన్ జంజిబార్ స్ప్రౌట్ లాంగ్ బనానా, ఇండోనేషియా జావా బ్లూ బనానా, హవాయికి చెందిన తెల్ల చారల అరటితో పాటు దక్షిణాసియాకు సంబంధించి ఎర్ర అరటి రకాలు జగత్‌ప్రసిద్ధి గాంచాయన్నారు.
చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!
అరటికి భారతదేశం పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో వందల రకాల అరటి వంగడాలు కనిపిస్తాయి. భింకెల్ అనే రకం అరటి చెట్టు ఎత్తయిన దూలం మాదిరిగా ఉంటుంది. కేరళకు చెందిన పొడవాటి రకం అరటి గెలకు వెయ్యి కాయలుంటాయి. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పొడవైన అరటి రకం. కొడిగుడ్డు అంత చిన్న అరటి కాయ రకం కూడా ఉంది అన్నారు కృష్ణప్రసాద్. కర్ణాటకకు ప్రత్యేకమైన అరటి రకాలు ఉన్నాయన్నారు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న కావెండిష్ బ్రీడ్ల అరటి పంటలను సాగు చేయటం ప్రారంభమైన తర్వాత దేశీ వంగడాలు మరుగున పడిపోయాయంటున్నారు కృష్ణప్రసాద్. ఒకే రకం అరటి సాగు చేస్తే పనామా కుళ్లు తెగులు సోకే ముప్పు ఉందని చెబుతూ, ఈ తెగులు సోకిందంటే పంటంతా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు.
కార్డమమ్, నెండ్ర ఆర్గానిక్ సాగుకు అనుకూలం
సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పండ్లకు ఈ రోజుల్లో అధిక డిమాండ్ ఉందన్నారు కృష్ణప్రసాద్. సేంద్రియంగా సాగు చేయటం వల్ల భూమి కరువు బారిన పడకుండా ఉంటుంది. రసాయనాలకు ఖర్చుపెట్టే డబ్బు ఆదా అవుతుంది అన్నారాయన. కార్డమమ్, నేండ్ర అరటి రకాలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటానికి అనువైనవే కాక, మార్కెట్ డిమాండ్ రీత్యా కూడా ఇవి మేలైనవని దేశీ విత్తన నిపుణుడు కూడా అయన కృష్ణప్రసాద్ వివరించారు. అరటి సాళ్ల మధ్యన ముల్లంగి, ఆకుకూరలు, గుమ్మడి, బీన్స్, పసుపు, చిలగడదుంప పంటలను సాగు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్ వివరించారు.
ఇతర వివరాలకు.. 94821 15495.
Comments
Please login to add a commentAdd a comment