19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు | Software Engineer quit job and Takes up Organic Farming | Sakshi
Sakshi News home page

19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు

Published Tue, Dec 10 2024 12:15 PM | Last Updated on Tue, Dec 10 2024 1:29 PM

Software Engineer quit job and  Takes up Organic Farming

 నిరంతర పని ఒత్తిడి, అసంతృప్తితో  పాలేకర్‌ శిక్షణ  పొంది 8 ఏళ్లుగా సంతృప్తికరంగా   ప్రకృతి సేద్యం 

3 ఎకరాల్లో వరి, మినుము, పెసలు, నువ్వులు తదితర పంటల సాగు

6 కుటుంబాలకు ఏడాది  పొడవునా ఆరోగ్యమైన దేశీ వరి బియ్యం,   పప్పులు సరఫరా

మిగతా రైతుల కన్నా తన నికారాదాయం  ఎక్కువే అంటున్న మునిపల్లె హరినాద్‌ ప్రస్ధానంపై ప్రత్యేక కథనం

దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్‌(52) భావించారు. గుంటూరు జిల్లా  పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్‌. 1994లో బీటెక్‌ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.  అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు  నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని  ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. 

ముందు నుంచే అధ్యయనం
విదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్‌ మార్కెట్‌లలో లభించే ఆర్గానిక్‌ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్‌లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు.  ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్‌ పాలేకర్‌ శిక్షణా శిబిరంలో హరినాధ్‌ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్‌ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)

దిబ్బపై ఉద్యాన పంటలు
మాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్‌ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్‌లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్‌ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. 

గోదావరి ఇసుకలు, కట్టుయానం...
ప్రకృతి సేద్యానికి అనువైన  దేశీ వరి రకాల సాగుపై హరినాద్‌ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్‌ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు.  ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్‌ రైస్‌ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.

సంపూర్ణ సంతృప్తి, సంతోషం!
ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్‌ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్‌ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. 
– మునిపల్లె హరినాద్‌ (93805 16443). 
మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా    

ఈ ఏడాది జీవామృతమూ లేదు!
పొలం దుక్కి చేయటం, రొటోవేటర్‌ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్‌తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్‌. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు.  

నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్‌కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్‌ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్‌ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు.  

– సయ్యద్‌ యాసిన్, 
సాక్షి,  పొన్నూరు, గుంటూరు జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement