పంటల్లో క్రిమి సంహారక మందుల ప్రభావం రోజురోజుకీ అధికమవుతోంది. ఆహార పదార్థాల్లో విష పదార్థాలూ పెరిగిపోతున్నాయి. దీంతో ఆధునిక రైతులు.. రసాయన సేద్యానికి స్వస్తి పలికి.. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి విపత్తుల్లోనూ అందరికన్నా మిన్నగా వ్యవసాయంలో రాణిస్తున్నారు. ఆశావహమైన, ఆరోగ్యదాయకమైన దిగుబడులు సాధిస్తూ లాభాల బాట పడుతున్నారు. అందుకు సాక్ష్యమే ఈ యువ రైతు.
ఇతనిది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం. 37 ఏళ్ల ఈ రైతు పేరు కంగోను బాల శశికాంత్. బీఏ చదివారు. పుడమి ఆరోగ్యంగా ఉండాలి.. మనం పండించే పంట ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఆలోచనతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ లాభాల బాట పడుతున్నాడు.
తామర పురుగును తట్టుకొని..
ఈ ఏడాది మిర్చి రైతులను నల్ల తామర పురుగు ఆగమాగం చేసింది. పురుగు తాకిడికి మిర్చి సాగు చేసిన వారిలో అత్యధిక శాతం మంది రైతులు పంటను పీకేసి ఇతర పంటలు వేసుకున్నారు. మిర్చి పంటను కొనసాగించి అనేక రకాల రసాయన క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన రైతులు మాత్రం ఎకరాకు క్వింటా నుండి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. శాస్త్రవేత్తలకు కూడా పూర్తిస్థాయిలో అంతుచిక్కని ఈ పురుగుతో యావత్ మిర్చి రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ రైతు మాత్రం ప్రకృతి వ్యవసాయంతో పురుగు తీవ్రతను నియంత్రించగలిగారు.
సీవీఆర్ పద్ధతిలో పురుగు కట్టడి..
ఈ ఏడాది ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని 80 సెంట్లు భూమిలో బ్యాడిగీ 355 రకం, 20 సెంట్లులో నవ్య రకం మిర్చిని శశికాంత్ సాగు చేశారు. ఇతని పంటనూ తామర పురుగు ఆశించింది. సీవీఆర్ పద్ధతిని అనుసరించి మట్టి ద్రావణం పిచికారీతో పురుగు తీవ్రతను కట్టడి చేయగలిగారు. పంటపై పురుగు ప్రభావం తగ్గింది.
సాధారణంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా మిర్చి దిగుబడులు ఎకరాకు 20–25 క్వింటాళ్ల వరకూ వస్తుంది. అయితే నల్ల తామరపురుగు తాకిడికి ఈ రైతు పొలంలోనూ దిగుబడి సగానికి తగ్గింది. ఎకరాకు 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎకరాకు కౌలు రూ. 60 వేలు, ఇతరత్రా మరో రూ. 60 వేల చొప్పున రూ. 1.20 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది.
దోమ, పురుగు నుంచి పంటకు రక్షణ చేకూర్చేందుకు పసుపు జిగురు అట్టలు, అక్కడక్కడా బంతిపూల మొక్కలు, టొమాటో మొక్కలు, నువ్వులు, ఆవాల మొక్కలతో పాటు గట్ల వెంబడి ఎత్తుగా పెరిగే మొక్కలను సాగు చేశారు.
ధర ఆశాజనకం..
కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన మిరపకాయలకు బహిరంగ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. మార్కెట్లో రసాయనాలతో పండించిన మిర్చి క్వింటా సుమారు రూ. 19 వేలు ఉంటే, ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన ఈ రకం ధర రూ. 30 వేల నుంచి 40 వేల వరకు పలుకుతోంది. శశికాంత్ పండించిన మిరపకాయలు చూడటానికి వంకర్లుగా. ముడతలుగా కనిపించినప్పటికీ, ఈ రకం గురించి తెలిసిన వాళ్లు మాత్రం వదిలిపెట్టరు. ఈ మిరప కాయను ఎక్కువగా పచ్చళ్లకు, రంగుల తయారీకి వినియోగిస్తారు. – జి. వికర్తన్ రెడ్డి, సాక్షి, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా
సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు
మన నేలలో మనం పోషక విలువలతో పండించిన పంటను విదేశీయుల కన్నా.. మనవారికే ఎక్కువగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్వంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాను. వెబ్‌సైట్లు, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటున్నాను. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ వంటి నగరాలలోని వారు కేజీ రూ. 500 చొప్పున నేరుగా కొంటున్నారు. పంట పండించటంలో కన్నా అమ్ముకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నది. – కె. బాల శశికాంత్ (97030 74787), ముట్లూరు, వట్టిచెరుకూరు మం., గుంటూరు జిల్లా
వేసవిలో కూరగాయల సాగుపై శిక్షణ
సేంద్రియ విధానంలో వేసవిలో కూరగాయల సాగుపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతి పేట దగ్గర గల నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఫిబ్రవరి 6 (ఆదివారం)న రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు డా. యాదగిరి, చౌటుప్పల్ మహిళా రైతు రజితారెడ్డి, కీసర రైతు రమేష్ శిక్షణ ఇస్తారు. వంగ, బెండ, టొమాటో, గోరుచిక్కుడు, బీర, కాకర, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర సాగు పద్ధతులు, కషాయాలు, ద్రావణాల తయారీ తదితర విషయాలపై శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి.. 98493 12629, 70939 73999.
Comments
Please login to add a commentAdd a comment