Andhra Pradesh CM YS Jagan Reddy Reviews On AP Income Sources July 2023 - Sakshi
Sakshi News home page

రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌

Published Mon, Jul 17 2023 11:00 AM | Last Updated on Mon, Jul 17 2023 5:46 PM

CM Jagan Reddy Reviews On AP Income Sources July 2023 - Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ (కాంపెన్‌సేషన్‌ కాకుండా) పన్నుల వసూళ్లు జూన్‌ వరకూ 91శాతం లక్ష్యం చేరినట్లు అధికారులు వెల్లడించారు.

జూన్‌ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.  గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. 

2018–19తో పోలిస్తే..  తగ్గిన మద్యం అమ్మకాలు.
► 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు.
►2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులుకాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు.
►2018–19 ఏప్రిల్, మే, జూన్‌ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్‌ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్‌ 56.51 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్‌ అమ్మకాల్లో మైనస్‌ 5.28 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు వెల్లడించగా..ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలని, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. 

పెరిగిన రిజస్ట్రేషన్ల ఆదాయం
గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు ఉండగా.. ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. రీసర్వే పూర్తిచేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం అయ్యాయని, దాదాపు 5వేల రిజిస్ట్రేషన్‌ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రూ. 8.03 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌ సాధ్యమైందని అధికారులు సీఎంకు వివరించారు. 2018–19లో  ఈ శాఖనుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని తెలిపారు. కార్యకలాపాలను నిర్వహించిన 2724 మైనింగ్‌ లీజుల్లో 1555 చోట్ల తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ

ఏపీఎండీసీ ఆర్థిక పనితీరు మెరుగుపడిందన్న అధికారులు.
2020–21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22–23లో రూ.1806 కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం పెరగిందన్నారు అధికారులు. 2023–24 నాటికి రూ.4వేల కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా వేశారు. మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గుగనుల నుంచి ఏపీఎండీసీ భారీగా ఆదాయం తెచ్చుకుంటోందని, సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

గణనీయంగా ఆదాయల పెంపు: సీఎం జగన్‌
గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని అన్నారు సీఎ జగన్‌. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతంలో ఆదాయాలపరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతోపాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని తెలిపారు. రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని, అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు.

కలెక్టర్లతో భాగస్వామ్యం కావాలి: సీఎం జగన్‌
వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని సీఎం జగన్‌ సూచించారు. ఇవి కొనుగోలు దారులకు ఎంకరేజ్‌ చేసేలా ఉండాలని తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు.. జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించాలని, ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. ఆర్ధికశాఖ అధికారులు కూడా కలెక్టర్లతో నిరంతరం మాట్లాడాలన్నారు. దీనివల్ల ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతం అవుతాయని, ఎక్కడా లీకేజీలు లేకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని సీఎ జగన్‌ తెలిపారు.
ఇదీ చదవండి: విద్యుత్‌ పొదుపునకు కేరాఫ్‌ జగనన్న ఇళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement