review meet
-
TSPSC పేపర్ లీక్..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్పీఎస్సీపై సమీక్ష చేపట్టారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాలలో పరీక్షల నిర్వహాణపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. టీఎస్పీఎస్సీకి కావాలసిన సిబ్బందిని, ఇతర వనరులు వెంటనే సమకూర్చాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మూసి అభివృద్ధి పై సమీక్ష: మూసి నది ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మూసిని పర్యటన ప్రాంతంగా డెవలప్ చేయాలని తెలిపారు. మూసి నది వెంట బ్రిడ్జీలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంతో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసిలో మురుగు నీటి తగ్గించే విధంగా అవసరమైన చోట మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహాణపై సమీక్ష: టెన్త్,ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలోలాగా పేపర్ లీక్‌లు జరగకుండా జాగ్రత్తపడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ,ప్రైవేటు విశ్వ విద్యాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అవసరం ఎక్కడ ఉందో వాటి వివరాలు వెంటనే ఇవ్వాలన్నారు. -
2025 జూన్‌కు పోలవరం తొలి దశ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశను 2025 జూన్‌కి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అమలుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తదితరులతో పోలవరం పనులపై సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, వాటిని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. డిజైన్ల ప్రతిపాదన, ఆమోదం నుంచి పనులు చేపట్టడం వరకూ పీపీఏ పాత్ర మరింత పెరగాలన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా డయాఫ్రమ్ వేస్తే సరిపోతుందా? అనే అంశంపై ఏం నిర్ణయం తీసుకున్నారని సీడబ్ల్యూసీని ప్రశ్నించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే మొగ్గుచూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్ వోరా చెప్పారు. కాఫర్ డ్యామ్‌లను మరింత పటిష్టం చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చించి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు పంకజ్‌కుమార్ సూచించారు. ఈ నివేదికల ఆధారంగా మరో సారి సమావేశమై కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, డయాఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో వరదలు తగ్గేలోగా వాటిపై తుది నిర్ణయం తీసుకంటే ఈ సీజన్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టవచ్చని, తద్వారా గడువులోగా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి: దోచుకునే బుద్ధి మీది రామోజీ! -
రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ (కాంపెన్సేషన్ కాకుండా) పన్నుల వసూళ్లు జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరినట్లు అధికారులు వెల్లడించారు. జూన్ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే.. తగ్గిన మద్యం అమ్మకాలు. ► 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు. ►2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులుకాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు. ►2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు వెల్లడించగా..ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలని, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. పెరిగిన రిజస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు ఉండగా.. ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. రీసర్వే పూర్తిచేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం అయ్యాయని, దాదాపు 5వేల రిజిస్ట్రేషన్ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రూ. 8.03 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ సాధ్యమైందని అధికారులు సీఎంకు వివరించారు. 2018–19లో ఈ శాఖనుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని తెలిపారు. కార్యకలాపాలను నిర్వహించిన 2724 మైనింగ్ లీజుల్లో 1555 చోట్ల తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ ఏపీఎండీసీ ఆర్థిక పనితీరు మెరుగుపడిందన్న అధికారులు. 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22–23లో రూ.1806 కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం పెరగిందన్నారు అధికారులు. 2023–24 నాటికి రూ.4వేల కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా వేశారు. మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గుగనుల నుంచి ఏపీఎండీసీ భారీగా ఆదాయం తెచ్చుకుంటోందని, సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. గణనీయంగా ఆదాయల పెంపు: సీఎం జగన్ గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని అన్నారు సీఎ జగన్. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతంలో ఆదాయాలపరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతోపాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని తెలిపారు. రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని, అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు. కలెక్టర్లతో భాగస్వామ్యం కావాలి: సీఎం జగన్ వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని సీఎం జగన్ సూచించారు. ఇవి కొనుగోలు దారులకు ఎంకరేజ్ చేసేలా ఉండాలని తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు.. జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించాలని, ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. ఆర్ధికశాఖ అధికారులు కూడా కలెక్టర్లతో నిరంతరం మాట్లాడాలన్నారు. దీనివల్ల ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతం అవుతాయని, ఎక్కడా లీకేజీలు లేకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని సీఎ జగన్ తెలిపారు. ఇదీ చదవండి: విద్యుత్ పొదుపునకు కేరాఫ్ జగనన్న ఇళ్లు -
175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందన్నారు. ‘‘గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకం. ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. చాలా ఉపయోగపడే కార్యక్రమం. వచ్చే 9 నెలలు అత్యంత కీలకం. 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది’’ అని సీఎం అన్నారు. ‘‘కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టం. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీని కోసం గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. పార్టీకి మేలు జరుగుతుంది. అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి వస్తుంది’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘‘ఇకపై గడపగడపకు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. పనితీరు బాగులేక టికెట్లు రాకుంటే నన్ను బాధ్యుడిని చేయొద్దు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. నెగిటివ్ మీడియా ద్వారా మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలన, మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలను నాడు-నేడు ద్వారా ప్రజల వద్దకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నెగిటివ్ స్టోరీలపై ఫ్యాక్ట్ చెక్ ఇస్తున్నాం. ఇందులో అంశాలపై అవగాహన పెంచుకోవాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సోషల్ మీడియా కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి. అబద్ధాలు, విష ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: జగనన్న సురక్ష.. జులై1 నుంచి సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు -
ఫ్యామిలీ డాక్టర్‌తో కోటి మందికిపైగా సేవలు
సాక్షి, గుంటూరు: వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా ఉంచాలి. అలాగే సమర్థవంతమైన ఎస్ఓపీలను పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం. ► వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు. నాలుగు వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదు. అధికారుల వివరణ ► కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్ బైట్, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్ కేర్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో వారికి శిక్షణ పూర్తయ్యింది. ► అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్తో బాధపడతున్నట్టు గుర్తింపు. ► వాళ్లందరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ స్ధాయిలో కంటి పరీక్షలు క్రమం తప్పకుండా కూడా చేయాలన్నారు. సికిల్ సెల్ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష సికిల్ సెల్ ఎనీమియా నివారణ కార్యక్రమంలో భాగంగా.. ఈ ఏడాది 6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్ హెల్త్‌లో భాగంగా ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. ► టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడి. అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితుల్ని గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ► ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను నమోదు చేయాలన్నారు. మెడికల్ కాలేజీలపైనా సీఎం సమీక్ష. ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే.. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు. -
మారుతున్న ఆర్థిక పరిస్థితులను గమనించాలి
ముంబై: మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బ్యాంకులను కోరారు. అప్పుడే తమ బ్యాలన్స్ షీట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని పరిమితం చేసుకోవచ్చన్నారు. కరోనా సంభవించినప్పటి నుంచి కల్లోల సమయంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించినట్టు అంగీకరించారు. సవాళ్లు ఉన్నప్పటికీ భారత బ్యాంకింగ్ రంగం బలంగా ఉందంటూ, ఎన్నో అంశాల్లో మెరుగుపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఎండీ, సీఈవోలతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. డిపాజిట్లలో వృద్ధి నిదానంగా ఉండడం, రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు, నూతన టెక్నాలజీ సొల్యూషన్లను అందిపుచ్చుకోవడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్బీఐ డేటా ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకుల డిపాజిట్లలో 9.6 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.2 శాతంతో పోలిస్తే తగ్గింది. కానీ, ఇదే కాలంలో రుణాల్లో వృద్ధి 6.5 శాతం నుంచి 17.9 శాతానికి పెరగడం గమనార్హం. -
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
-
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైఎస్ జగన్
-
Irrigation Projects: గడువులోగా పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఇరిగేషన్ ప్రాజెక్టులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా అధికారులతో సీఎం విస్తృత సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలను సీఎం నిర్దేశించారు. అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ►పోలవరంలో దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చ ►డౌన్ స్ట్రీం కాఫర్ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని తెలిపిన అధికారులు ►ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని తెలిపిన సీఎం ►వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలన్న సీఎం ►వెంటపడి మరీ పనులు చేయించుకోవాలన్న సీఎం ►ఆర్ అండ్ ఆర్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు ►ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నామన్న అధికారులు ►మొదటి ప్రాధాన్యత కింద తరలించాలనుకున్న వారిని ఆగస్టుకల్లా తరలించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ►మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించామన్న అధికారులు. ►3228 మంది ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9756 మందిని తరలించాలన్న అధికారులు. ►వీరిని త్వరగా పునరావాసం కల్పించాలన్న సీఎం. ►డీబీటీ పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలన్న సీఎం. ►నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1 నుంచి నీటి విడుదల, ఇదే ప్రాజెక్టులో టన్నెల్–2 పనులు, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్ –2లో ఫేజ్–2 పనులపైనా సీఎం సమీక్ష ►నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామన్న అధికారులు ►సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయన్న అధికారులు. మే 15 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామన్న అధికారులు సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని ఆదేశించిన సీఎం ►అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈసీజన్లో పనులు పూర్తిచేస్తామన్న అధికారులు ►120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేశామన్న అధికారులు. ►లైనింగ్ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ►పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్–2 పనులపై సీఎం సమీక్ష ►నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నామన్న అధికారులు ►ఇది మరింతగా పెంచి 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేస్తామన్న అధికారులు. టన్నెల్ 1 ద్వారా సెప్టెంబర్ నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం ►2023 నాటికి టన్నెల్ –2 సహా అన్నిరకాల పనులు పూర్తిచేసి.. రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ►వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న అధికారులు ►అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►వెలగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం ►వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపింగ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని ఆదేశం ►వంశధారపై నేరడి వద్ద బ్యారేజీకి సన్నాహాలపైనా సీఎం సమీక్ష. ►ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపుగా ఏపీనే భరిస్తోందని, బ్యారేజీ నిర్మాణం చేస్తే ఒడిశాకూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందన్న సీఎం. ►ఇరు రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరమన్న సీఎం. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష ►తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష. ►తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు. ►గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద పనులనూ వేగవంతం చేయాలన్న సీఎం. ►ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం ►తారకరామ తీర్థసాగర్‌లో రిజర్వాయర్ పనులు పూర్తికావొచ్చాయన్న అధికారులు. మిగిలిన పనులు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశాలు ►సారిపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని ఆదేశాలు ►టన్నెల్ సహా ఇతర పనులూ కొనసాగుతున్నాయన్న అధికారులు ►మహేంద్ర తనయ ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష ►ప్రాజెక్టును పూర్తిచేయడానికి తదేక దృష్టిపెట్టాలన్న సీఎం ►ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం ►ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ►మెయిన్ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలన్న సీఎం ►దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం సమీక్షా సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
46 జిల్లాల్లో మళ్లీ కరోనా ఉధృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఉధృతమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో గత కొన్ని వారాలుగా కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతోందని వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఆయా జిల్లాల్లో ఆంక్షలను కఠినతరం చేయాలని, జనం గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సామూహిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని సూచించింది. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య నమోదవుతోందని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో నిర్లక్ష్యం వీడకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 80 శాతానికి పైగా ఐసోలేషన్‌లోనే.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రాలు కోవిడ్ కేసుల్లో పెరుగుదలను లేదా పాజిటివిటీ పెరుగుదలను రిపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ చర్యల గురించి చర్చించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీ, వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల అందుబాటుపై సమీక్షించారు. ఈ 10 రాష్ట్రాల్లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు. 10 రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఒకవేళ బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి, ఆసుపత్రుల్లో చేర్చి వైద్య సేవలందించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే అధికారులు అందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించండి కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. కరోనా వ్యాక్సినేషన్‌ను సంతృప్తికర స్థాయిలో నిర్వహించడం ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని వివరించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని తెలిపింది. జిల్లాల వారీగా సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ల ఉనికిని గుర్తించేందుకు ఇన్సకాగ్ (ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం) ల్యాబ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. వ్యాక్సినేషన్లో వయోధికులకు ప్రాధాన్యం: ఐసీఎంఆర్ కొత్తగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది 45–60 ఏళ్లలోపు వారేనని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. సామూహిక వేడుకలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు హితవు పలికారు. ప్యాకేజీ నుంచి రాష్ట్రాలకు రూ.1,827 కోట్లు విడుదల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుర్చడానికి కేంద్ర సర్కారు కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్(ఈసీఆర్పీ–2) పేరిట ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీ కింద రూ.12,185 కోట్లు కేటాయించింది. తాజాగా ఇందులో 15 శాతం.. అంటే రూ.1,827.8 కోట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.281.98 కోట్లు, బిహార్‌కు రూ.154 కోట్లు, రాజస్తాన్‌కు రూ.132 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.131 కోట్లు ఇచ్చారు. -
ప్రగతికి ప్రతిబింబంగా అయోధ్య
న్యూఢిల్లీ: ఆలయ నగరి అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని మోదీ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మన మహోన్నత సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దాలని ఆదేశించారు. మనం సాధిస్తున్న ప్రగతిని అయోధ్య ప్రతిబింబించాలని అన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో యూపీ సీఎం యోగి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రతి భారతీయుడి సాంస్కృతిక చైతన్యంలో అయోధ్య నిక్షిప్తమై ఉందని మోదీ గుర్తుచేశారు. ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పారు. అయోధ్యను జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలని భావి తరాలు కోరుకునేలా నగర అభివృద్ధి ప్రణాళిక ఉండాలన్నారు. అన్ని వసతులతో గ్రీన్‌ఫీల్డ్ టౌన్షిప్ అయోధ్య సర్వతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ అధికారులు ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు ప్రతిపాదిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మోదీకి తెలియజేశారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, రోడ్లు, జాతీయ రహదారుల విస్తరణ గురించి వెల్లడించారు. అయోధ్యలో భక్తుల కోసం అన్ని వసతులతో కూడిన గ్రీన్‌ఫీల్డ్ టౌన్షిప్, ఆశ్రమాలు, మఠాలు, హోటళ్లు, వివిధ రాష్ట్రాలకు భవనాల నిర్మాణంపై సమీక్షా సమావేశంలో చర్చించారు. పర్యాటకులను ఆకర్శించే దిశగా టూరిస్టు ఫెసిలిటేషన్ సెంటర్, ప్రపంచ స్థాయి మ్యూజియం నిర్మించాలని నిర్ణయించారు. సరయు నదీ తీరంలో, ఘాట్లలో మౌలిక సదుపాయాలను కల్పనను వేగవంతం చేయాలని, నదిలో పడవ విహారాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయోధ్యలో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనలో యువశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. శనివారం సమీక్షా సమావేశం అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ నగరం ప్రాచీన, ఆధునికతల కలబోతగా మారాలని ఆకాంక్షించారు. -
పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది నా కల. దీన్ని విజయవంతం చేయాలని నేను తపన పడుతున్నాను. నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. నా కల మీ అందరి కల కావాలి. మనందరి కలతో పేదవాడి కల సాకారం కావాలి. అప్పుడే పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దిగ్విజయమవుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నదే మన లక్ష్యం కావాలని పేర్కొన్నారు. రూరల్, అర్బన్ కలిపి 9,024 లే అవుట్లలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా అన్ని లే అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వారం రోజుల్లో కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు సౌకర్యాల ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని చెప్పారు. వీటిపై మరింత ధ్యాస పెట్టలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా చార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశం మొత్తం మన వైపు చూస్తోంది రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల అని, గతంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ స్థాయిలో ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీఎం జగన్ చెప్పారు. ఇంత పెద్ద లక్ష్యం గురించి గతంలో ఎవరూ ఆలోచించలేదని, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందన్నారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా.. ఈ పనుల పట్ల అధికారులు అంకిత భావాన్ని ప్రదర్శించాలని, అప్పుడే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాకుండా, మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఇందుకు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నంబరు కేటాయించాలని ఆదేశించారు. అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలని, ఇందులో భాగంగా ప్రతి లేఅవుట్లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి.. ► జగనన్న కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావొచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. జూలై 10 నాటికి 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. ► ఆప్షన్లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభం కాగానే మొ దలు పెట్టి.. 2022 జూన్ నాటికి మొదటి విడత నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ► నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఐఐటీలు, ఇతర సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ► టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్లతో 18 నెలల్లో 2,08,160 యూనిట్లు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ -
హైకోర్టు సీజేలతో సీజేఐ జస్టిస్ రమణ సమీక్ష సమావేశం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమీక్షించారు. హైకోర్టుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆయన ఆరా తీశారు. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమీక్షా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కోర్టుల్లో పోస్టుల భర్తీని వేగవంతం చేయాల్సి ఉందని జూన్ 1, 2 తేదీల్లో జరిగిన ఈ వర్చువల్ సమావేశాల్లో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో న్యాయం అందించడంలో జరుగుతున్న జా ప్యానికి మౌలిక వసతుల లేమి, డిజిటల్ డివైడ్‌లు ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంతో ఆధునిక కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ‘నేషనల్ జ్యూడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాలని జస్టిస్ రమణ సూచించారు. ప్రస్తుతం 25 హైకోర్టుల్లో 1,080 మందికి గానూ 660 మంది జడ్జీలే ఉన్నారని న్యాయ శాఖ తెలిపింది. -
వ్యాక్సినేషన్ నెమ్మదించొద్దు.. రాష్ట్రాలకు ప్రధాని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగాల్సిన అవసరాన్ని రాష్ట్రాలకు తెలియజేయాలని ప్రధాని అన్నారు. వైద్య సదుపాయాలను మెరుగుపర్చడానికి రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని, మార్గనిర్దేశనం చేయాలని అధికారులకు సూచించారు. లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్న 12 రాష్ట్రాల పరిస్థితి, ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల గురించి అధికారులు ప్రధానికి తెలియచేశారు. మహమ్మారిని త్వరగా, సంపూర్ణంగా అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. పాజిటివిటీ రేటు 10% గాని, లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించడం, ఆసుపత్రుల్లో 60% కంటే పడకలు నిండిపోతే తీసుకోవాల్సిన చర్యలపై (స్థానికంగా ఆంక్షలు, లాక్డౌన్లు విధించడం) రాష్టాలకు పంపిన అడ్వైజరీ గురించి ప్రధానికి అధికారులు వివరించారు. అంతేగాక పరిస్థితులు సున్నితంగా ఉన్న రాష్ట్రాల గురించి ప్రధాని ప్రస్తావించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం తగ్గకూడదని, ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని అన్నారు. రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్ వృథా అవుతున్న తీరుపై మోదీ సమీక్షించారు. 17.7 కోట్ల డోసులు.. దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఏర్పడ్డ మందుల కొరతపై సమీక్ష జరిపారు. మందుల లభ్యతపై దృష్టిసారించాలన్నారు. రెమిడెసివిర్‌తో సహా కరోనా చికిత్సకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తి ప్రక్రియతో పాటు, వ్యాక్సిన్ల పురోగతి, రాబోయే కొద్ది నెలల్లో తయారు చేయవలసిన ఔషదాల ఉత్పత్తిని ప్రధాని సమీక్షించారు. సుమారు 17.7 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు అధికారులు ప్రధానికి తెలిపారు. మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావులతో ఫోన్లో మాట్లాడి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై ఆరా తీశారు. ఒడిశా, జార్ఖండ్ సీఎంలతోనూ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు
న్యూఢిల్లీ: 2022కల్లా అందరికీ ఇళ్లు పథకం లక్ష్యా న్ని చేరుకోవడంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించాలని ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరాక తొలి ‘ప్రగతి (ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సమీక్షా సమావేశం బుధవారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన(పట్టణ) పథకంలో ఎదురవుతున్న అవాంతరాలను ఎలా అధిగమించాలనే దానిపై సమీక్షించారు. ‘నీటి సంరక్షణపైన ప్రత్యేకంగా వానాకాలంలో తీసుకున్న చర్యలపైనా రాష్ట్రాలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ప్రధాని సూచించారు’ అని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మోదీ ప్రధానిగా ఎన్డీఏ తొలి పాలన కాలంలో ఇలాంటి 29 ‘ప్రగతి’ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.12లక్షల కోట్ల విలువైన 257 ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రజా సమస్యలు, అందరికీ ఆరోగ్యబీమా పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ అంశాలపైనా సమీక్ష జరిగింది. -
మంచి విద్య.. మెరుగైన ఉద్యోగం
సాక్షి, అమరావతి: విద్యార్థులు పాఠశాలల్లో చేరిన దగ్గర నుంచి ఉద్యోగాలు సంపాదించే స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇది తనకు అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రమాణాలు పెంచి వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య, దీన్ని బోధిస్తున్న సంస్థలు, ఎయిడెడ్ కాలేజీల్లో పరిస్థితులు తదితర అంశాలమీద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ బలంగా లేకపోతే పేదలు, మధ్య తరగతి పిల్లలు చదువుకోలేరని, అందువల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థను బతికించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు ఉండాలని, నాణ్యమైన విద్య అందించాలన్నారు. గత ప్రభుత్వం కావాలనే ఈ రంగాన్ని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యానించారు యూనివర్సిటీల దశ, దిశ మార్చండి.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను దెబ్బతీశారని, ఫలితంగా ప్రైవేటు కాలేజీల్లో లక్షలాది రూపాయలు పోసి చదువుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫీజులు భరించలేక విద్యార్థులు చదువులు మానుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల దశ, దిశ మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు పెంచి వాటి ప్రతిష్టను ఇనుమడింపచేయాలని సీఎం గట్టిగా చెప్పారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలను అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి నివేదించారు. వీసీల నియామకానికి సంబంధించి సెర్చి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నెలరోజుల్లోగా పూర్తి పారదర్శక విధానంలో అర్హత, అనుభవం ఉన్న వారిని వీసీలుగా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, ఇతర అధ్యాపక, సిబ్బంది పోస్టులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భర్తీల విషయంలో అవినీతికి, పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించారు. అన్ని యూనివర్సిటీల న్యాక్ గ్రేడ్ పెరిగేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచి విద్యార్థులకు తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపాలని అధికారులకు సూచించారు. ఫీజులను ప్రామాణీకరించాలి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తరువాత ఉన్నత విద్య చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. కాలేజీల ఫీజులు, ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంటు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, దీన్ని పరిశీలించి ప్రామాణీకరించాలని (స్టాండర్డెజ్) ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఫీజుల నిర్ధారణ వాస్తవిక దృక్పథంతో ఉండాలని అభిప్రాయపడ్డారు. లేకుంటే పేద, మధ్యతరగతి పిల్లలు ఫీజులు భరించలేరన్నారు. ‘ఇంజనీరింగ్ చదివే విద్యార్థికి ఏటా రూ. 33 వేలు ఖర్చు అవుతుందని ప్రభుత్వమే నిర్ధారించి, ఆ మేరకు రీయింబర్స్‌మెంటును ఖరారు చేసింది. అదే సమయంలో కొన్ని కాలేజీలు ఏటా రూ. 70 వేల నుంచి రూ. 1 లక్ష వరకు కూడా ఫీజుల వసూలుకు మళ్లీ ప్రభుత్వమే అనుమతి ఇస్తోంది. ఈ పద్ధతి మారాలి. విద్య అన్నది వ్యాపారం కాదు. దాన్ని లాభార్జన రంగంగా చూడకూడదు. దేశంలో చట్టం కూడా అదే చెబుతోంది’ అని సీఎం పేర్కొన్నారు. ఫీజురీయింబర్స్‌మెంటు కింద కాలేజీలకు అందాల్సిన డబ్బులు కనీసం మూడు నెలలకోసారైనా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అప్పుడే ఆ కాలేజీలు కూడా సక్రమంగా నడుస్తాయని అక్కడ పనిచేస్తున్న వారికి సకాలానికి వేతనాలు అందుతాయని పేర్కొన్నారు. భూములు పొంది, సంస్థలు ఏర్పాటు చేయని వాటి వివరాలు సేకరణ.. రాజధాని ప్రాంతంలో ప్రైవేటు యూనివర్సిటీలకు ఇబ్బడిముబ్బడిగా భూములు కేటాయింపు అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ఒక విధానం లేకుండా ఇష్టానుసారం గత ప్రభుత్వం భూములు కేటాయించిందని సీఎం వ్యాఖ్యానించారు. భూములు పొంది, సంస్థలను ఏర్పాటు చేయని వారి వివరాలను తయారుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒంగోలు, విజయనగరంలలో యూనివర్సిటీలు పెడతామంటూ ఎన్నికలకు ముందు హడావుడిగా జీవోలు ఇచ్చారని, కానీ వాటి నిర్మాణం, సిబ్బంది నియామకంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. మూడేళ్లలో వాటి ఏర్పాటు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా వర్సిటీలు, కాలేజీలు చదువు పూర్తిచేసుకుని బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకునేలా విద్యావ్యవస్థ ఉండాలని, వర్సిటీలు, కాలేజీల్లో ప్రమాణాలు పెంచి, వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ దిశగా సిలబస్‌లో మార్పులు చేయాలని, సిలబస్‌ను మెరుగుపరచడానికి ఒక కమిటీని వేయాలని ఆదేశించారు. కొత్త సిలబస్ వచ్చే విద్యాసంవత్సరం అమల్లోకి రావాలని గడువు విధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేముందు ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా వారి అర్హతలను నిర్ధారించాలని, ఏపీపీఎస్సీ నిర్దేశించుకున్న అర్హతలను ఒకసారి పరిశీలించాలని పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గానికో వృత్తి నైపుణ్య కేంద్రం విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఏ కోర్సులు పెట్టాలి, ఎలా అమలు చేయాలన్న ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థానిక పరిశ్రమల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో అభ్యర్థుల్లో నైపుణ్యాన్ని ఈ కేంద్రాల్లో నేర్పించాలని సూచించారు. అదే సమయంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్సులను మెరుగుపరచాలన్నారు. విశాఖపట్నం జిల్లా అరకులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఈ రెండు విద్యాసంస్థలను గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటుచేయడం సముచితమని అభిప్రాయపడ్డారు. రూ. 1,000 కోట్ల రూసా నిధులు కోల్పోయాం రూసా గ్రాంటు కింద కేంద్రం గత ఏడాది రూ. 67 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విడుదల చేయకుండా వేరే ఖర్చులకు దారి మళ్లించిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఏయూ, ఎస్వీ వర్సిటీలు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు ఉన్నాయని, అవి 100 కోట్లు ఖర్చు చేసి ఉంటే రూసా కింద రూ. 1,000 కోట్లు అందేవని, దాన్ని రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇలా కావడం విచారకరమని, ఇలా చేస్తే విద్యాసంస్థలు ఎలా మెరుగుపడతాయని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. వర్సిటీలలో మౌలిక సదుపాయాలకు ఎంత కావాలన్నా కేపిటల్ గ్రాంటుగా తాము ఇస్తామని, మొత్తం అన్ని యూనివర్సిటీలు న్యాక్ ఏప్లస్ గ్రేడులోకి తీసుకురావాలని ఆదేశించారు. ట్రిపుల్ ఐటీ నిధులూ పక్కదారి ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలను అధ్వానంగా మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ట్రిపుల్ ఐటీలకు సంబంధించి రూ. 400 కోట్లు ఉంటే అందులో రూ. 260 కోట్లు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎంకు అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటీల భవనాల నిర్మాణానికి నిధులు లేకుండా పోయాయని, ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలమంది విద్యార్థులను ప్రైవేటు భవనాల్లో ఉంచారని పేర్కొన్నారు. కాలేజీల అభివృద్ధిపై చర్చ సందర్భంగా జిల్లాకొక కాలేజీని రూ. 15 కోట్లతో అభివృద్ధి చేయిద్దామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. కొన్ని కాలేజీలనే అభివృద్ధి చేసే బదులు మౌలికంగా ముందుగా అవసరమయ్యే మంచి నీరు, ఫర్నీచర్, ఫ్యానులు, బ్లాక్‌బోర్డులు, ప్రహరీలు, పెయింటింగ్‌లు తదితర 9 అంశాల్లో అన్ని కాలేజీలను మెరుగుపర్చాలని వైఎస్ జగన్ సూచించారు. స్కూళ్ల మాదిరిగానే కాలేజీల ప్రస్తుత ఫొటోలు తీసుకొని రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపించాలన్నారు. వర్సిటీల పాలకమండళ్లను నెలరోజుల్లో పునర్నియమిస్తామని సీఎం తెలిపారు. 7వ పీఆర్సీకి సంబంధించి బకాయిలకు రూ. 340 కోట్లు అవసరమని అధికారులు పేర్కొనగా సీఎం ఇస్తామన్నారు. ట్రిపుల్ ఐటీలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటుచేస్తే వాటిని చేజేతులా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ పాదయాత్రలో తన వద్దకు వచ్చి విద్యార్థులు గోడుబెళ్లబోసుకున్నారని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో వెంటనే పనులు పూర్తిచేయాలని, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ పనులు త్వరితంగా మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీల్లో చదివే విద్యార్థుల్లో 50 శాతం మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ పరిస్థితులు మారాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ట్రిపుల్ ఐటీలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. సమీపంలోని రిజర్వాయర్ల నుంచి డైరెక్టుగా పైపులైనులు వేసి నీళ్లందించే ప్రయత్నాలు చేయాలన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్య ఘటనలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా విద్యాశాఖ మంత్రి, అధికారులు ఆయా క్యాంపస్‌లను తరుచూ సందర్శించాలని ఆదేశించారు. -
ఇంటర్ వరకు అమ్మ ఒడి
సాక్షి, అమరావతి: ‘అమ్మ ఒడి’ పథకాన్ని పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని చెప్పారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్ధులకూ అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖపై గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అమ్మ ఒడి పథకం అమలు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పోస్టుల భర్తీ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలని ఆదేశించారు. మంచినీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డులు, ఫ్యానులు ఏర్పాటు చేయాలని, ప్రహరీల నిర్మాణంతో పాటు మరమ్మతులుంటే పూర్తి చేసి రంగులు వేసి తీర్చిదిద్దాలన్నారు. ఈ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల ఫొటో తీసి రెండేళ్ల తరువాత రూపురేఖలు ఎలా మారాయో ప్రజలకు చూపించాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని దీనికోసం టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో అన్ని తరగతుల్లో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశం చేయాలని స్పష్టం చేశారు. హేతుబద్ధీకరణ పద్ధతిలో ప్రతి స్కూలులో 20 – 25 మంది విద్యార్ధులకు ఒక టీచర్ చొప్పున ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కావాలనే ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించారు.. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగార్చిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పుస్తకాలు అందని దుస్థితిని తాను స్వయంగా పాదయాత్రలో చూశానని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథాకానికి సంబంధించి ఆరు నెలల పాటు సరకుల బిల్లులు కూడా ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోగా ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో యూనిఫారాలను సైజుల ప్రకారం ఇవ్వకుండా విద్యార్ధులను ఇబ్బంది పెట్టారని, ఈసారి అలాకాకుండా వారే దుస్తులు కుట్టించుకొనేందుకు, షూలు, సాక్సులు కొనుక్కునేందుకు నేరుగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. తెల్లరేషన్ కార్డుదారులంతా అర్హులు: విద్యాశాఖ మంత్రి సురేష్ పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అమ్మ ఒడి పథకానికి అర్హులని, ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పిల్లలు బడిలో చేరడం నుంచి ఉద్యోగాలు పొందేవరకు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? ఉద్యోగ భద్రత కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సీఎం ఆదేశించారన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ముఖ చిత్రాలను మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. వైస్ చాన్స్‌లర్, అధ్యాపకులు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, దీనిపై త్వరలోనే సెర్చ్ కమిటీని నియమిస్తామని వివరంచారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. చదువుకోలేకపోతున్నామనే బాధతో పిల్లలు, చదివించలేకపోతున్నామనే ఆవేదనతో తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న అనేక ఘటనలను పాదయాత్రలో స్వయంగా నా కళ్లతో చూశా. భవిష్యత్ తరాలకు ప్రభుత్వం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. ప్రభుత్వ విద్యా సంస్థలను బతికించుకోవడం ద్వారానే పేద, మధ్య తరగతి పిల్లలను చదివించుకోగలం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
బోర్డర్ పరిస్థితిపై హోంశాఖ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షించింది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్షించారు. పాకిస్తాన్ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకురాగా, భారత దళాలు నౌషెరాలో పాక్ ఎఫ్ 16 జెట్‌ను కూల్చివేశాయి. భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధవిమానాలను భారత వైమానిక దళం దీటుగా తిప్పికొట్టింది. భారత్ ప్రతిఘటనతో పాక్ యుద్ధవిమానాలు వెనుతిరిగాయి. మరోవైపు పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్‌లోని పలు ఎయిర్‌బేస్‌ల నుంచి భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు చెప్పారు. -
పాకిస్థాన్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరో షాక్ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దాయాది పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ (అత్యంత సన్నిహిత) దేశం హోదాను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాక్‌కు జీవనాడీ అయిన సింధు నదీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రధాని మోదీ సంకేతాలు ఇచ్చారు. ఇందుకోసం సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. పాకిస్థాన్‌కు ఉదారంగా జలాలు పంపిణీ చేస్తూ ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో సింధు జలాలను మనమే అత్యధికంగా ఉపయోగించుకునేవిధంగా ప్రత్యామ్నాయాలను ఈ సమావేశంలో చర్చించారు. ఇక పాక్‌కు 1996లో భారత్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదా ఇచ్చింది. పాక్ మాత్రం మనకు ఆ హోదా ఇస్తామంటూ ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్నది కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ హోదా రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండబోదని అసోచామ్ పేర్కొంది. 2015-16లో భారత్ విదేశీ వాణిజ్యం విలువ 641 బిలియన్ డాలర్లు కాగా, అందులో పాక్ వాటా కేవలం 2.67 బిలియన్ డాలర్లుమాత్రమే. ఆ దేశానికి భారత్ చేసే ఎగుమతులు చాలా తక్కువ కావడంతో ఈ హోదా రద్దు చేసినా ఆ ప్రభావం పెద్దగా ఉండదని అసోచామ్ వివరించింది. అయితే, పాకిస్థాన్ పై పూర్తిస్థాయిలో ఆర్థిక యుద్ధం ప్రకటించాలని భావిస్తున్న ప్రధాని మోదీ.. ఇందులో ఎంఎఫ్ఎన్ హోదా రద్దు కీలకమని భావిస్తున్నారు. -
నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు
నెల్లూరు(టౌన్) : పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారి కనకనరసారెడ్డిలు తెలిపారు. గురువారం నెల్లూరులోని డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ విద్యాలయాలను సందర్శించి మౌలిక వసతులపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. మండల పరిధిలో పనిచేసే ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనితీరుపై వివరాలు ఇవ్వాలని ప్లానింగ్ కో–ఆర్డినేటర్ రమణారెడ్డికి తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్య కమిటీ వివరాలు శుక్రవారం లోపు అందజేయాలని సూచించారు. ప్రతి సోమవారం ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులతో సమావేశం జరుపుతామన్నారు. -
రైళ్లలో నేరాలను నియంత్రించాలి
గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పీ సుబ్బారావు నెల్లూరు(క్రైమ్): పక్కా ప్రణాళికతో రైళ్లలో నేరాలను నియంత్రించాలని గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పీ సుబ్బారావు సూచించారు. నెల్లూరు, తిరుపతి రైల్వే సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నెల్లూరు రైల్వే డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. రికార్డులను పరిశీలించి నేరనియంత్రణకు తీసుకుంటున్న చర్యలు.. రికవరీలు.. తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైళ్లలో నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు అన్ని రైళ్లలో బీట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. బీట్ సిబ్బంది వద్ద ఉన్న పుస్తకంలో సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు విధిగా ఉండాలని చెప్పారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే విజయవాడ, గుంతకల్‌లోని కంట్రోల్‌రూమ్, ఉన్నతాధికారులు, సమీపంలోని రైల్వే పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించాలని సూచించారు. రైళ్లలో విధిగా తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు తారసపడితే అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాలని కోరారు. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాల్లో బీట్ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసి 24 గంటలూ విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. గతేడాది సెప్టెంబర్‌లో నాన్‌క్యాడర్ ఐపీఎస్ అధికారి రత్నంపై దుండగులు దాడి చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో చీరాల నుంచి గూడూరు వరకు ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రైలు ప్రమాదాల్లో అనేక మంది గుర్తుతెలియని వ్యక్తులు మరణిస్తున్నారని, వీరిని గుర్తించేందుకు స్థానిక మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. మృతుల రైల్వే టికెట్ వివరాలకు ఆయా ప్రాంత రైల్వేపోలీసులకు రెడియో మెసేజ్ ఇవ్వాలన్నారు. పలు పోలీస్స్టేషన్లలో ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని డీజీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే భర్తీ చేస్తామని వివరించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి రైల్వే డీఎస్పీలు మోహన్‌రావు, సూర్యచంద్రరావు, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి సీఐలు నరసింహరాజు, దశరథరామారావు, కొండయ్య, సుబ్రహ్మణ్యం, కడప, యర్రగుంట్ల, ఒంగోలు, చీరాల ఎస్సైలు పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లుల వసూళ్లపై కథలొద్దు
విద్యుత్‌శాఖ సిబ్బందిపై సీఈ నందకుమార్ ఆగ్రహం నెల్లూరు (టౌన్): జిల్లా వ్యాప్తంగా గృహాలకు సంబంధించి బిల్లులు కట్టని 2408 సర్వీసులను తొలగించి ఉన్నామని, వాటి నుంచి సుమారు రూ. కోటి మేర బిల్లులు వసూలు కావాల్సి ఉందని, రెండు నెలలుగా బిల్లులు వసూళ్లు చేయమని చెబుతున్నా, ఎందుకు చేయడం లేదని విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈలపై ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విద్యుత్ భవనంలోని స్కాడా సమావేశ మందిరంలో డీఈలు, ఏడీఈలు, ఏఈలతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ డివిజన్లో 1827 సర్వీసులు ఉన్నాయన్నారు. నగరంలో ఇంతమంది కరెంట్ లేకుండానే నివశిస్తున్నారా.. వారికి సంబంధించిన మిగిలిన కనెక్షన్లు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మరమ్మతుల పేరుతో గంటల తరబడి సరఫరాను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీఈలు 33కేవీ, ఏఈలు 11కేవీ ఫీడర్లను ప్రతి నెలా తనిఖీ చేయాలని చెప్పినా ఎక్కడా అమలు కావడం లేదని మండిపడ్డారు. జిల్లాలో విద్యుత్ చోరీలపై వారంలో ఒకరోజు తనిఖీలు నిర్వహించి శనివారం నాడు నివేదిక అందించాలని ఆదేశించారు. వీధిలైట్లు, వాటర్ సర్వీసులకు మీటర్లు బిగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. హెచ్డీ, సీసీ మీటర్లకు ఏడీఈలు మాత్రమే రీడింగ్ తీయాలని ఆదేశించారు. ఆక్వా కల్చర్ సర్వీసులకు సంబంధించి మీటర్లను క్రాస్ చెకింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్ఈ కళాధరరావు, టెక్నికల్ డీఈ రమాదేవి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
స్టేడియం అభివృద్ధి పనులపై సమీక్ష
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు ఏపీఎంఐడీసీ అధికారులతో గురువారం సమీక్షించారు. ఆగస్టు నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. వాకింగ్‌ట్రాక్, అథ్లెటిక్స్ట్రాక్, ఎంట్రన్స్గేట్, ఇండోర్‌స్టేడియం, ఫ్లోరింగ్, ఇండోర్‌స్టేడియం డార్మెట్రీ, కాన్ఫరెన్స్‌హాల్ పనులను 40 రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. క్రీడాప్రాంగణంలో డ్రైనేజీ సిస్టమ్, మరుగుదొడ్లు, పెవిలియన్భవనం ఆధునీకరణ పనులు 80శాతం పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తే కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించి మరిన్ని క్రీడామౌలిక సదుపాయాలు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రవిశంకర్బాబు, డీఈఈ సీవీ రమణ, ఏఈ ఎం పుల్లయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
బహుళ పంటల సాగుతో ఆదాయాన్ని పెంచాలి కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు రూరల్ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ముత్యాల రాజు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వేఫీడర్స్ రోడ్డులోని పశుసంవర్థక శాఖ సమావేశ మందిరంలో ఫార్మర్ ప్రొడ్యూషర్స్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీఓ)ల ఏర్పాటు, వ్యవసాయంలో ఉపాధి హామీ పథకం అమలుపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో బుధవారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10లక్షలు ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణంను 11 లక్షలకు పెంచాలన్నారు. రైతులు బహుళ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడులు పెరగడం, మద్దతు ధర లభించక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. పెరుగుతున్న జనాభాకు అవసరమైన కూరగాయలను బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోనే కూరగాయలను సాగు చేస్తే రైతులకు ఎక్కువ ఆదాయం చేకూరుతుందన్నారు. ఉద్యానపంటలు, పాడి పరిశ్రమ, ఆక్వాసాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు రైతులకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను స్వయంగా అమ్ముకుని లాభపడేలా ఫార్మర్ ప్రొడ్యూషర్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిమ్మ రైతుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే హేమమహేశ్వరరావు, షిషరీస్ జేడీ సీతారామరాజు, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌కుమార్, నాబార్డు ఏజీఎం రమేష్‌బాబు, ఎల్డీఎం వెంకట్రావ్, ఆత్మ, మైక్రో ఇరిగేషన్, ఉద్యాన, శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.