సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశను 2025 జూన్‌కి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అమలుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తదితరులతో పోలవరం పనులపై సమీక్షించారు.
డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, వాటిని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు.
డిజైన్ల ప్రతిపాదన, ఆమోదం నుంచి పనులు చేపట్టడం వరకూ పీపీఏ పాత్ర మరింత పెరగాలన్నారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా డయాఫ్రమ్ వేస్తే సరిపోతుందా? అనే అంశంపై ఏం నిర్ణయం తీసుకున్నారని సీడబ్ల్యూసీని ప్రశ్నించారు.
కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే మొగ్గుచూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్ వోరా చెప్పారు. కాఫర్ డ్యామ్‌లను మరింత పటిష్టం చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చించి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు పంకజ్‌కుమార్ సూచించారు.
ఈ నివేదికల ఆధారంగా మరో సారి సమావేశమై కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, డయాఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో వరదలు తగ్గేలోగా వాటిపై తుది నిర్ణయం తీసుకంటే ఈ సీజన్‌లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టవచ్చని, తద్వారా గడువులోగా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండి: దోచుకునే బుద్ధి మీది రామోజీ!
Comments
Please login to add a commentAdd a comment