సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు.
త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్‌ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్‌నందన్‌కుమార్ వివరించారు.
వెనకడుగు కాదు.. ముందడుగే
కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్‌పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు.
దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు.
తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్‌ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్‌ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు.
అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి
కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్‌లలోని 15 అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు.
కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం
కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment