ఇంటర్‌ వరకు అమ్మ ఒడి | YS Jaganmohan Reddy extends Amma Odi to Inter students | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ వరకు అమ్మ ఒడి

Published Fri, Jun 28 2019 3:34 AM | Last Updated on Fri, Jun 28 2019 8:16 AM

YS Jaganmohan Reddy extends Amma Odi to Inter students - Sakshi

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘అమ్మ ఒడి’ పథకాన్ని పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్‌ చదివేవారికి కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని చెప్పారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్ధులకూ అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని వివరించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అమ్మ ఒడి పథకం అమలు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పోస్టుల భర్తీ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలని ఆదేశించారు. మంచినీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డులు, ఫ్యానులు ఏర్పాటు చేయాలని,  ప్రహరీల నిర్మాణంతో పాటు మరమ్మతులుంటే పూర్తి చేసి రంగులు వేసి తీర్చిదిద్దాలన్నారు.

ఈ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల ఫొటో తీసి రెండేళ్ల తరువాత రూపురేఖలు ఎలా మారాయో ప్రజలకు చూపించాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని దీనికోసం టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో అన్ని తరగతుల్లో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశం చేయాలని స్పష్టం చేశారు. హేతుబద్ధీకరణ పద్ధతిలో ప్రతి స్కూలులో 20 – 25 మంది విద్యార్ధులకు ఒక టీచర్‌ చొప్పున ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

కావాలనే ప్రైవేట్‌ స్కూళ్లకు మళ్లించారు..
గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగార్చిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో కూడా పుస్తకాలు అందని దుస్థితిని తాను స్వయంగా పాదయాత్రలో చూశానని ముఖ్యమంత్రి తెలిపారు.  గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథాకానికి సంబంధించి ఆరు నెలల పాటు సరకుల బిల్లులు కూడా ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్‌ స్కూళ్లకు మళ్లించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోగా ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో యూనిఫారాలను సైజుల ప్రకారం ఇవ్వకుండా విద్యార్ధులను ఇబ్బంది పెట్టారని, ఈసారి అలాకాకుండా వారే దుస్తులు కుట్టించుకొనేందుకు, షూలు, సాక్సులు కొనుక్కునేందుకు నేరుగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు.   

తెల్లరేషన్‌ కార్డుదారులంతా అర్హులు: విద్యాశాఖ మంత్రి సురేష్‌
పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారు మాత్రమే అమ్మ ఒడి పథకానికి అర్హులని, ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పిల్లలు బడిలో చేరడం నుంచి ఉద్యోగాలు పొందేవరకు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? ఉద్యోగ భద్రత కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సీఎం ఆదేశించారన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ముఖ చిత్రాలను మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు.  వైస్‌ చాన్స్‌లర్, అధ్యాపకులు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, దీనిపై త్వరలోనే సెర్చ్‌ కమిటీని నియమిస్తామని వివరంచారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు.

చదువుకోలేకపోతున్నామనే బాధతో పిల్లలు, చదివించలేకపోతున్నామనే ఆవేదనతో తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న అనేక ఘటనలను పాదయాత్రలో స్వయంగా నా కళ్లతో చూశా. భవిష్యత్‌ తరాలకు ప్రభుత్వం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. ప్రభుత్వ విద్యా సంస్థలను బతికించుకోవడం ద్వారానే పేద, మధ్య తరగతి పిల్లలను చదివించుకోగలం.

– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement