![Ayodhya should manifest finest of our traditions - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/27/A.jpg.webp?itok=CHm__EUf)
న్యూఢిల్లీ: ఆలయ నగరి అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని మోదీ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మన మహోన్నత సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దాలని ఆదేశించారు. మనం సాధిస్తున్న ప్రగతిని అయోధ్య ప్రతిబింబించాలని అన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో యూపీ సీఎం యోగి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రతి భారతీయుడి సాంస్కృతిక చైతన్యంలో అయోధ్య నిక్షిప్తమై ఉందని మోదీ గుర్తుచేశారు. ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పారు. అయోధ్యను జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలని భావి తరాలు కోరుకునేలా నగర అభివృద్ధి ప్రణాళిక ఉండాలన్నారు.
అన్ని వసతులతో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్
అయోధ్య సర్వతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ అధికారులు ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు ప్రతిపాదిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మోదీకి తెలియజేశారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, రోడ్లు, జాతీయ రహదారుల విస్తరణ గురించి వెల్లడించారు. అయోధ్యలో భక్తుల కోసం అన్ని వసతులతో కూడిన గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్, ఆశ్రమాలు, మఠాలు, హోటళ్లు, వివిధ రాష్ట్రాలకు భవనాల నిర్మాణంపై సమీక్షా సమావేశంలో చర్చించారు. పర్యాటకులను ఆకర్శించే దిశగా టూరిస్టు ఫెసిలిటేషన్ సెంటర్, ప్రపంచ స్థాయి మ్యూజియం నిర్మించాలని నిర్ణయించారు. సరయు నదీ తీరంలో, ఘాట్లలో మౌలిక సదుపాయాలను కల్పనను వేగవంతం చేయాలని, నదిలో పడవ విహారాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయోధ్యలో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనలో యువశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. శనివారం సమీక్షా సమావేశం అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ నగరం ప్రాచీన, ఆధునికతల కలబోతగా మారాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment