AP CM YS Jagan Reviews On Housing Scheme - Sakshi
Sakshi News home page

పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్‌

Published Fri, Jun 25 2021 4:46 AM | Last Updated on Fri, Jun 25 2021 5:39 PM

AP CM YS Jagan reviews on housing scheme, - Sakshi

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది నా కల. దీన్ని విజయవంతం చేయాలని నేను తపన పడుతున్నాను. నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. నా కల మీ అందరి కల కావాలి. మనందరి కలతో పేదవాడి కల సాకారం కావాలి. అప్పుడే పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దిగ్విజయమవుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నదే మన లక్ష్యం కావాలని పేర్కొన్నారు.

రూరల్, అర్బన్‌ కలిపి 9,024 లే అవుట్లలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా అన్ని లే అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వారం రోజుల్లో కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు సౌకర్యాల ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని చెప్పారు. వీటిపై మరింత ధ్యాస పెట్టలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా చార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దేశం మొత్తం మన వైపు చూస్తోంది
రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల అని, గతంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ స్థాయిలో ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు. ఇంత పెద్ద లక్ష్యం గురించి గతంలో ఎవరూ ఆలోచించలేదని, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందన్నారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు.

మనసా, వాచా, కర్మణా.. ఈ పనుల పట్ల అధికారులు అంకిత భావాన్ని ప్రదర్శించాలని, అప్పుడే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాకుండా, మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఇందుకు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నంబరు కేటాయించాలని ఆదేశించారు. అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలని, ఇందులో భాగంగా ప్రతి లేఅవుట్‌లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీని ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి..
► జగనన్న కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావొచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. జూలై 10 నాటికి 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు.
► ఆప్షన్‌లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభం కాగానే మొ దలు పెట్టి.. 2022 జూన్‌ నాటికి మొదటి విడత నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
► నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు ఐఐటీలు, ఇతర సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
► టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్లతో 18 నెలల్లో 2,08,160 యూనిట్లు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.  

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement