రాష్ట్రంలో గృహశోభ | AP CM Jagan to distribute house site pattas in Srikalahasti | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో గృహశోభ

Published Tue, Dec 29 2020 4:51 AM | Last Updated on Tue, Dec 29 2020 4:54 AM

AP CM Jagan to distribute house site pattas in Srikalahasti - Sakshi

చిత్తూరు జిల్లా ఊరందూరులో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మహిళలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ జరుగుతోందని.. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ మొదలు కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీతో పాటు, రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం, మరో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.

అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లలో చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో 2.50 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఊరందూరు లేఅవుట్‌లో ఏకంగా 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్లాన్‌ చాలా చక్కగా ఉంది. ఇక్కడే ఆర్బీకే కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్, ఆటో స్టాండ్, వైఎస్సార్‌ జనతా బజార్, కల్యాణ మండపాలు, వార్డు సచివాలయం, పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు రానున్నాయి’ అని చెప్పారు. ఇక్కడ మార్కెట్‌ రేటు ప్రకారం ఒక్కో ప్లాటు విలువ రూ.7 లక్షలు ఉంటుందన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు ఈ ఆస్తిని ఇస్తున్నానని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాను
► ‘‘అక్క చెల్లెమ్మలకు అన్ని విధాలా అండగా ఉంటానని మాట ఇచ్చాను. 18 నెలలుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6,352 కోట్లు వారి చేతిలో పెట్టాం. విద్యా దీవెన పథకం ద్వారా 18.52 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.4 వేల కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద 15.56 లక్షల తల్లులకు రూ.1,221 కోట్లు ఇచ్చాం.

► ఆసరా కింద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు తొలి ఏడాదిలో 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు ఇచ్చాం. చేయూతలో వారి చేయి పట్టుకుని నడిపిస్తూ 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు చేతికి అందించాం. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకంలో 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం పథకంలో 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.492 కోట్లు ఇచ్చాం.


ఆ కష్టాలు స్వయంగా చూశాను
► నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో సొంతిల్లు లేని వారి కష్టాలు స్వయంగా చూశాను. 25 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. కానీ ఇవాళ దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తున్నాం. మొత్తంగా 1.24 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది.

► ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తాం. తర్వాత ఇల్లు కట్టిస్తాం.
ఊళ్లు రాబోతున్నాయి

► 17 వేల రెవెన్యూ గ్రామాల్లో 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీల లేఅవుట్లు వేసి, గతంలోలా 224 చదరపు అడుగుల్లో కాకుండా, 340 చదరపు అడుగుల్లో ఇళ్లు కట్టిస్తున్నామంటే అవి కాలనీలు కావు.. ఊళ్లు రాబోతున్నాయి. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నాం.  

► రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల్లో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్‌ విలువ దాదాపు రూ.25,530 కోట్లు. అంత ఆస్తిని 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్‌ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్‌ ట్యాంక్‌ ఉంటాయి. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, మరో రెండు ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాం.


ఇళ్ల నిర్మాణం.. టిడ్కో ఇళ్లు
► తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది మొదలు పెడతాం. ఇవి కాక 2.62 లక్షల టిడ్కో ఇళ్లు అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. ఇందుకు దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

► టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే సేల్‌ అగ్రిమెంట్‌ ఇస్తున్నాం. ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చే జగనన్న స్కీమ్‌ కావాలా? లేక రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్‌ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్‌ కోరితే ఒకే ఒక్కరు చంద్రబాబు స్కీమ్‌ కోరారు.  

► 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. మొత్తంగా టిడ్కో ఇళ్లకు ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.4,287 కోట్ల భారం పడుతున్నా చిరునవ్వుతో భరిస్తున్నాం.


ఎందరికో ఉపాధి.. ఆర్థిక పురోగతి
► ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, ఆటో వాళ్లు.. ఇలా 30 రకాల వృత్తుల వారు లక్షలాది మందికి లబ్ధి కలుగుతుంది.

► తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్‌ టన్నుల మెటల్‌ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్‌ వస్తుంది’’ సీఎం జగన్‌ అన్నారు.  

► అనంతరం లబ్ధిదారులు పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు సీఎం ఇంటి పట్టాలు అందజేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, ఊరందూరు లేఅవుట్‌లోని మోడల్‌ హౌస్‌ను సంబంధిత లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మదుసూధనరెడ్డి, భూమన, రోజా, చెవిరెడ్డి, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  

అక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకూడదా?
► అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైతే, డెమొగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ (కులపరమైన అసమతుల్యం) వస్తుందని చంద్రబాబు మనుషులు కొందరు కొన్ని చోట్ల కోర్టుకు వెళితే, కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 3.74 లక్షల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం.

► విశాఖపట్నంలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం తెలుపలేదు. వాటితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వాటిపై స్టే తీసుకొచ్చారు. రాజమండ్రిలో ఆవ భూములు అని చెప్పి స్టే తెచ్చారు. దాని వల్ల 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలంటే అవరోధం ఏర్పడింది.

► నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు దుర్మార్గులు, రాక్షసులు. అవి ఏపీఐఐసీ భూములని, మైనింగ్‌ భూములంటూ కోర్టుకు పోయారు. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ మేరకు ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. వీళ్లందరికీ దేవుడు మొట్టికాయలు వేస్తాడు. న్యాయం జరుగుతుంది. త్వరలో మిగిలిపోయిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం.


అన్నా మీరు విన్నారు.. ఆదుకున్నారు
అన్నా.. నా పేరు పుష్ప. మా ఆయన తిరుమల్‌రావు కూలీ పని చేస్తాడు. మాకిద్దరు చిన్న పిల్లలు. మాకు సొంతిల్లు లేదు. దీంతో నా బిడ్డ పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. నాకు అన్నదమ్ములు లేరు. ఈ పరిస్థితిలో సొంత అన్నలా ఆదుకుంటూ మీరు నాకు ఇంటి పట్టా ఇస్తున్నారు. మీ వల్ల నాలాగే రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. మీ పాదయాత్రలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకుంటూ నవరత్నాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వైఎస్సార్‌ ఆసరా, చేయూత ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇళ్ల పట్టా ఇవ్వడం గొప్ప కార్యక్రమం. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షల మందికి పైగా స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించడం లేదు. పైగా మా (మహిళలు) పేరుతోనే ఇస్తున్నారు.    
 – పుష్ప, ఏర్పేడు, చిత్తూరు

మాకు అడ్రస్‌ ఇచ్చారన్నా..
నా పేరు జ్యోతి. మాకు ఇద్దరు పిల్లలు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు ‘నేను ఉన్నాను చెల్లెమ్మా’ అంటూ అమ్మ ప్రేమను,
నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. అన్నా.. మేము చెరువు కట్టపై ఉంటున్నాం. వానకు, ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. ఇన్నాళ్లూ ఎవరూ ఏమీ చేయలేదు. నా ఊరు ఇది అని చెప్పుకునేందుకు అడ్రస్‌ లేని వాళ్లం. అటువంటి సమయంలో మీరు మాకు అడ్రస్‌ ఇచ్చారు. ఇప్పుడు నా ఊరుపేరు ‘జే సిటీ’. నా ఇంటి నంబర్‌ 305. (భావోద్వేగానికి లోనవుతూ) నాలాగే ఆ కట్టపై ఉన్న మరో 25 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు కట్టిస్తున్నారు. ‘నీకేమి మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు. మీ అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది’ అని మా ఆయన
మా బిడ్డతో అంటున్నాడు. మీ వల్లే నాకు ఈ గౌరవం. పండుగ అంటే ఇదే అన్నా.
– జ్యోతి, అమ్మపాలెం చెరువు కట్ట

అన్ని పథకాల్లో అక్కచెల్లెమ్మలకే ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో డబ్చు జమ చేశాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇస్తున్నాం.
ఆలయ ట్రస్టు బోర్డు పదవులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పోస్టులు, బీసీ కార్పొరేషన్లలో, రాజకీయ నియామకాల్లో 50 శాతం వారికే చెందాలని చట్టాలు చేశాం. ఇది మీ అందరి ప్రభుత్వం.. మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం.. అని గర్వంగా చెబుతున్నాను.       

సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement