ఇళ్ల స్థలాల పంపిణీ: భావోద్వేగానికి లోనైన జ్యోతి
సాక్షి, చిత్తూరు: ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, పేదల పక్షపాతి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అక్కాచెల్లెమ్మలు ధన్యవాదాలు చెబుతున్నారు. ఒక అన్నలా తమకు అండగా ఉంటున్నందుకు రుణపడి ఉంటామంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా చిత్తూరు జిల్లాలోని ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ సోమవారం శ్రీకారం చుట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీ, వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్దిదారులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏర్పేడు మండలానికి చెందిన పుష్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం పథకాల ద్వారా తమ కుటుంబమంతా లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. ‘‘ అన్నా నా పేరు పుష్ప.. మా ఆయన తిరుమల్‌రావు.. కూలీపని చేస్తాడు.. మాకిద్దరు చిన్న పిల్లలు వాళ్లను చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉంటా. మాకు సొంతిళ్లు లేదు. ఈ కారణంగా నా పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. బిడ్డను ఎత్తుకుని అద్దెంటికి వెళ్తే వెళ్లగొట్టారు. నాకు అన్నాదమ్ముళ్లు లేరు. అమ్మకు అక్కా, నేనే. ఆనాడు ఎంత బాధ పడ్డానో నేడు అంతకంటే ఎక్కువ సంతోపడుతున్నాను.
మా అన్న నాకు ఇంటి పట్టా ఇస్తున్నాడు. నాలాగే రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. పాదయాత్రలో భాగంగా నేను విన్నాను ఉన్నాను చేస్తాను అని చెప్పారు. నవరత్నాలు ఒక్కొక్కటిటా నెరవేరుస్తున్నారు. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, జగనన్న విద్యాకానుక ఇలా ఒక్కటేమిటి పేదలకు లబ్ది చేకూరేలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్నింటిలో పేదలకు ఇళ్ల పట్టా ఇవ్వడం అత్యంత గొప్పది. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టివ్వడం లేదు. మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తున్న మీకు రుణపడి ఉంటాం’’ అని ఉద్వేగానికి గురయ్యారు.(చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్)
వేదిక మీద మాట్లాడుతున్న పుష్ప
నా ఇంటి నెంబరు 305.. జ్యోతి కన్నీటిపర్యంతం
‘‘అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి మాకు ఇద్దరు పిల్లలు. అన్నా.. పండుగ అంటే ఇదేనన్నా. మాకోసం ముందుగానే సంక్రాంతి పండుగ తీసుకువచ్చారు. ఉగాదికే పట్టాలు రావాల్సింది. మాకోసం ఎన్నో అవాంతరాలు దాటి నేడు కలను సాకారం చేశారు. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయంది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు నేను ఉన్నాను చెల్లెమ్మా అంటూ అమ్మ ప్రేమను, నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటా. మేం చెరువు కట్టమీద ఉంటాం. సొంతస్థలం లేదు. అడ్రస్ లేని నాకు అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ.. 305 నా ఇంటి నెంబరు. ఇన్నాళ్లు వానకు తడిసేవాళ్లం. ఎండకు ఎండేవాళ్లం. ఏ నాయకుడు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.
కానీ నువ్వు కరోనా సమయంలో కూడా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నావు. మా ఇంట్లో వాళ్లందరం ప్రభుత్వ పథకాలు పొందుతున్నాం. నాకు తల్లీదండ్రీ నువ్వే అన్నా. ఒక విషయం చెప్పనా అన్నా.. నన్ను సరదాకైనా మా ఆయన ఒక్క మాట అనడం లేదు. ‘‘మీకేమమ్మా మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు’’అంటాడు. అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది అని నా బిడ్డకు చెప్తాడు. నాకు ఇంతటి గౌరవం కల్పించినందుకు పాదాభివందనాలు చేస్తున్నా. కట్టమీద ఉన్న అందరికీ ఇళ్లు వచ్చాయి. అందరి తరఫున కృతజ్ఞతలు. మా అన్నే అధికారంలో ఉండాలి. మన బిడ్డల తరంలో కూడా అన్నే ఉండాలా. కష్టం మన ఇంటి గడప కూడా దాటనివ్వకుండా చూస్తాడు’’ అంటూ కన్నీటి పర్యమంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment