Infrastructure and development
-
ఎన్విడియాతో రిలయన్స్ జట్టు
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్‌కి చెందిన కొత్త డేటా సెంటర్లో ఎన్విడియాకి చెందిన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను వినియోగించనున్నారు. ఎన్విడియా ఏఐ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్‌లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ‘చిప్‌ల డిజైనింగ్‌లో భారత్‌కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్విడియా చిప్‌లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్‌గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు .. భారత్‌లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్‌గా భారత్: అంబానీ భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్‌లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.ఇన్ఫీ, టీసీఎస్‌లతో కూడా.. భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్విడియా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్విడియా మోడల్‌ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్విడియా తమ హాపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది. -
Vice President Jagdeep Dhankhar: పరస్పర సహకారం మరింతగా పెరగాలి
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ఆకాంక్షించారు. ఇండియా–ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ–ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ (డీఎఫ్‌టీపీ) స్కీముతో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోందని ధన్కడ్ చెప్పారు. అలాగే, కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలు, అంతరిక్ష రంగంలాంటి విషయాల్లో భారత్‌తో ఆఫ్రికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చన్నారు. సీఐఐ ఇండియా–ఆఫ్రికా బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్కడ్ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారత్ 12.37 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. 85 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలవగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్, ఆఫ్రికా కలిసి పని చేయొచ్చని ధన్కడ్ చెప్పారు. -
Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ
ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ! చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు? స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం. ప్రహరీలు... టాయిలెట్లను మరచిపోతుంటుంది. హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం. వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది. ‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’ అంటున్నారు రోటరీ క్లబ్ గవర్నర్ డా.శంకర్‌రెడ్డి. ‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన. ‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్ల సర్వీస్‌ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్‌లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్లు, హ్యాండ్ వాష్ స్టేషన్లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్‌రూమ్‌లో బెంచీలతో మొదలైన మా సర్వీస్‌లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్ అనారోగ్యాలు పొంచి ఉంటాయి. మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్‌వే. లోటో కంపెనీ షూస్ మార్కెట్లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ప్రోగ్రామ్ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం. మేము సర్వీస్ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్‌గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్ గ్రూప్ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం. తక్షణ సాయం! ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇది సమష్టి సేవ! రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపి మా పరిధిలో 113 క్లబ్లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్‌కు çసర్వీస్ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్‌లైన్ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్‌వెల్స్ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్‌కి ఆర్వో ప్లాంట్ నా డబ్బుతో పెట్టించాను. ‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్‌లో ఉంది, అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక నేను సర్వీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. శ్రీమంతులకు స్వాగతం! జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్ విధానంలో ‘హ్యాపీ స్కూల్’ కాన్సెప్ట్ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్‌గా గుర్తించాలంటే... కాంపౌండ్ వాల్, పాఠశాల భవనం, డిజిటల్ క్లాస్ రూములు, నీటి వసతి, టాయిలెట్లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ నిధులతో పూర్తి చేయవచ్చు. గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్ నగరం, మెట్రో రైల్వే స్టేషన్లలో 65 వాటర్ కూలర్లనిచ్చాం. నీలోఫర్, ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌కి వైద్యపరికరాలు, స్పర్శ్ పేరుతో క్యాన్సర్ బాధితులకు పాలియేటివ్ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్‌లు ఇచ్చింది రోటరీ క్లబ్. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. – వాకా మంజులా రెడ్డి ఫొటో: గడిగె బాలస్వామి -
మౌలికానికి రూ.60,000 కోట్ల రుణ వితరణ
ముంబై: మౌలిక రంగానికి రుణాలను మంజూరు చేసే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023– 2024) రూ.60,000 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.8,000 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే, 2024 మార్చి నాటికి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్ల రుణాలను ఆమోదించనున్నట్టు నాబ్‌ఫిడ్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ వెల్లడించారు. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకముందే భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గత వారంలోనే ఈ సంస్థ రూ.10వేల కోట్లను సమీకరించగా, వీటికి సంబంధించిన బాండ్లను బీఎస్ఈలో సంస్థ మంగళవారం లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాజ్‌కిరణ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. సంస్థ ఇష్యూకి ఐదు రెట్ల స్పందన రావడం గమనార్హం. పదేళ్ల బాండ్‌పై 7.43 శాతం వార్షిక రేటును ఆఫర్ చేసింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.18,000 కోట్లను పంపిణీ చేశాం. ఈ ఏడాది రూ.60000 కోట్ల రుణ పుస్తకాన్ని సాధిస్తామని భావిస్తున్నాం. రుణ ఆమోదాలు మాత్రం రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చు’’అని రాయ్ వివరించారు. ప్రైవేటు ప్రాజెక్టులకూ తోడ్పాటు ఈ సంస్థ 60 శాతం రుణాలను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకే ఇస్తోంది. జూన్ త్రైమాసికంలో మాత్రం సంస్థ మంజూరు చేసిన రుణాలన్నీ కూడా ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించినవే కావడం గమానార్హం. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రైవేటు రుణాల వాటా పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలు, థర్మల్ ప్లాంట్లు, డేటా కేంద్రాలు, సిటీ గ్యాస్ పంపిణీ, రోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లకు నాబ్‌ఫిడ్ రుణాలను ఇస్తుంటుంది. ప్రస్తుతం 30 శాతం రుణాలను గ్రీన్‌ఫీల్డ్ ఆస్తులకు ఇస్తుంటే, 20 శాతం మానిటైజేషన్ ఆస్తులకు, మిగిలినది నిర్వహణలోని ఆస్తులకు ఇస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ల రంగంపైనా ఆసక్తితో ఉన్నట్టు రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. రానున్న కొత్త విమానాశ్రయాలన్నీ కూడా ఆర్థికంగా సురక్షితమైనవేనన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పన్ను రహిత బాండ్ల గురించి అడగ్గా, సమీప కాలంలో ఈ యోచన లేదన్నారు. -
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
సాక్షి, న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల కల్పన, అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం భేష్ అని గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ప్రశంసించారు. దేశంలోనే వ్యాపార పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంలా ఉందని కీర్తించారు. ఏపీ అందిస్తున్న సహకారంతో వ్యాపార విస్తరణకు, కొత్త వ్యాపార కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు వారు వెల్లడించారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో వివిధ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు మాట్లాడారు. కోవిడ్ వంటి కఠినతర పరిస్థితుల్లోనూ ఏపీ అందించిన సహకారం మరువలేనిదంటూ కొనియాడారు. ఈ సదస్సులో ఎవరెవరు ఏమన్నారంటే.. పెట్టుబడులను రెట్టింపు చేస్తాం – యమగుచి, ఎండీ, టోరే ఇండస్ట్రీస్ (జపాన్) ఇక్కడ రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు వ్యాపార యూనిట్లు ప్రారంభించాం. అదే సమయంలో కోవిడ్ మొదలైంది. ఏపీ ప్రభుత్వ మద్దతుతో జూన్ 2020లో ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాం. 2030 నాటికి మా ప్రస్తుత పెట్టుబడిని రెండింతలు కంటే ఎక్కువ పెట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఏపీ సహకారంతో మరింత విస్తరిస్తాం – రోషన్ గుణవర్ధన, డైరెక్టర్, ఎవర్టన్ టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇటలీ) ఏపీలో మేం గణనీయంగా అభివృద్ధి చెందాం. ఏపీ టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కానప్పటికీ, ఏపీపై నమ్మకం ఉంచాం. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది గొప్పగా ఉంది. ప్రభుత్వం అందించిన సహకారంతోనే మేం ఇక్కడ యూనిట్లు ఏర్పాటుచేశాం. మా యూనిట్లలో 99శాతం మంది ఉద్యోగులు స్థానికులే. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఏపీ సర్కారు మాకు మద్దతుగా ఉన్నందుకు ప్రభుత్వం, అధికారులకు కృతజ్ఞతలు. ఏపీలో ప్రభుత్వ సహకారంతో మరింత విస్తరించేందుకు ఎదురుచూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం – సెర్గియో లీ, డైరెక్టర్, అపాచీ, గ్రూప్ (తైవాన్) 2006లో షూ తయారీ సంస్థను స్థాపించాం. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న తొమ్మిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వ మద్దతు లేకుండా కంపెనీ విజయం సాధ్యంకాదు. ఎంఓయూపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంతకం చేస్తే ఇప్పుడు మేం పనిచేస్తున్నాం. అపాచీ ఇండియా–2 ప్రాజెక్టు కోసం మేమిప్పుడు ఏపీతో కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం. ఏపీలో అసాధారణ మద్దతు – ఫణి కునార్, సీఎండీ, సెయింట్, గోబైన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్రాన్స్) రెండు దశాబ్దాల్లో మేం రూ.12,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాం. కోవిడ్ సమయంలో ఏపీలో ఫ్యాక్టరీ ప్రారంభించాం. ఏపీ అసాధారణ మద్దతుతో మేం ప్రారంభించిన యూనిట్ అత్యంత సంపన్నమైన యూనిట్‌గా మారింది. ఇక్కడి ప్రజల ప్రతిభ, నిబద్ధతతో కూడిన పరిపాలనా యంత్రాంగం, రాజకీయ నాయకత్వం మేం మరింత విజయవంతమయ్యేందుకు తోడ్పడింది. దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎంచుకుంటే, ఏపీ స్వర్గధామంగా ఉంటుంది. ఏపీలో మంచి వాతావరణం – రవిసన్నారెడ్డి, శ్రీసిటీ ఫౌండర్, ఎండీ ఏపీలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉంది. ఈ సదస్సుకు 60 దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు రావడం సంతోషం. ఢిల్లీ సదస్సు విజయవంతమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. మార్చిలో విశాఖలో జరగబోయే సమ్మిట్ మరింత విజవయంతం అవుతుంది. ముఖ్యమంత్రికి భవిష్యత్తు దార్శనికత – సుచిత్ర ఎల్లా, సీఐఐ సదరన్ చాప్టర్ అధ్యక్షురాలు పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉంది. సీఐఐ ఎక్కువ కాలం దివంగత సీఎం వైఎస్సార్‌తో కలిసి పనిచేసింది. సీఎం వైఎస్ జగన్‌కు భవిష్యత్తు దార్శనికత ఉంది. తద్వారా ఏపీ ప్రగతిశీల అభివృద్ధిని చూస్తోంది. గ్లోబల్ ఎకనామిక్ చెయిన్ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోంది. ప్రపంచస్థాయి కార్ల ఉత్పత్తికి ఏపీ సహకారం – టే జిన్ పార్క్, ఎండీ, కియా మోటర్స్, (కొరియా) రాష్ట్రంలో కియా నిర్వహణకు వనరుల మద్దతుతో పాటు ఆటోమోటివ్ బెల్ట్ చైన్‌ను అభివృద్ధి చేయడం, పెంపొందించడంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్‌లతో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కార్ల ఉత్పత్తికి ప్రభుత్వం మాకు సహాయం చేసింది. కృష్ణపట్నం, చెన్నై వంటి ప్రధాన ఓడరేవులకు కనెక్టివిటీ సౌలభ్యంతో పాటు 95 దేశాలలో మా కార్లను విక్రయించడానికి వీలు కల్పించింది. కోవిడ్ సమయంలోనూ సురక్షితంగా కార్ల తయారీకి మాకు మద్దతిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వ్యాపార విస్తరణకు దేశంలో ఏపీ ఉత్తమం – దీపక్ ధర్మరాజన్ అయ్యర్, ప్రెసిడెంట్, క్యాడ్బరీ ఇండియా (యూఎస్ఏ) ఏపీతో భాగస్వామి కావడం మాకు గర్వకారణం. శ్రీసిటీలో మేం మా వ్యాపార యూనిట్లను ప్రారంభించినప్పటి నుండి ఏపీ చురుకైన మద్దతిస్తోంది. రూ.2,500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా 6వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించాం. సంస్థలో 80శాతం మంది ఉద్యోగులు స్థానికులే. ఇప్పటికే ఆరు ఆపరేటింగ్ యూనిట్లు ఉండగా, త్వరలో మరొకటి అందుబాటులోకి రానుంది. దేశం మొత్తంలోనే అత్యుత్తమ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను తెచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మేం దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నా.. ఏపీ అత్యుత్తమం. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం జగన్ పెద్ద ఆస్తి – సుమంత్ సిన్హా, అసోచామ్ అధ్యక్షుడు ఏపీకు పెద్ద సీఎం జగన్ పెద్ద ఆస్తి. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. ఏపీని గమ్యస్థానంగా ఎంచుకోవాలని పారిశ్రామికవేత్తలందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు స్నేహ పూర్వకంగా ఉన్నాయి. రాష్ట్ర జీడీపీ 50 బిలియన్ డాలర్లకు పైగా దేశంలో ఎనిమిదో స్థానంలోఉంది. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తొలి స్థానంలో ఉంది. రెన్యువబుల్, క్లీన్ ఎనర్జీలో ముందంజలో ఉంది. ఏపీకి పారిశ్రామిక వేత్తలు రావడానికి సహాయ అందించడానికి సీఎం ముందుచూపుతో ఉన్నారు. నిస్సందేహంగా పెట్టుబడులు పెట్టొచ్చు – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో సింగిల్ విండో సిస్టమ్‌తో అన్ని విధాలా సహకారం ఉంటుంది. పెట్టుబడుల అనుమతులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందిస్తుంది. 23 శాఖల పరిధిలో 93 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశాబివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశ్రామికవేత్తలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్‌గా ఉంటున్న ఏపీలో పెట్టుబడులు నిస్సందేహంగా పెట్టొచ్చు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌సెల్ ఉంది. విశాఖలో సదస్సుకు పారిశ్రామిక వేత్తలంతా హాజరు కావాలి. ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం – దేవయాని ఘోష్, నాస్కామ్ అధ్యక్షురాలు ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఏపీతో కలిసి పని చేస్తున్నాం. డీప్‌టెక్ రంగంలో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం హైపర్ డిజిటల్ యుగంలోకి వెళ్తున్నాం. దీనికి కావాల్సిన వనరులన్నీ ఏపీలో ఉన్నాయి. రాష్ట్రానికి తీరప్రాంతం పెద్ద అడ్వాంటేజ్. బెస్ట్ పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్రపంచం ఎదురు చూస్తున్న ఎనర్జీ, లాజిస్టిక్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఏపీకి సామర్థ్యం ఉంది. సీఎం డాక్యుమెంట్ ఆకట్టుకుంది. -
చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లను అందచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా నివాసాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్–జగనన్న కాలనీల రూపంలో ఏకంగా పట్టణాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 18.63 లక్షలు సాధారణ గృహాలు. సాధారణ ఇళ్లలో 16.67 లక్షల గృహాల శంకుస్థాపనలు పూర్తి కాగా, నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 8,485 లేఅవుట్లలో విద్యుత్ సర్వే పూర్తి ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్న 8,485 లేఅవుట్లలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సర్వే పూర్తయింది. 3,248 లేఅవుట్లలో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు లాంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. 1,411 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరాకు సంబంధించి 1,561 లేఅవుట్లలో పనులు ప్రారంభించారు. 6,012 లేఅవుట్లలో పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. 1.40 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2.09 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 1,46,440 ఇళ్లకు విద్యుత్, 1,40,986 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణాలు పూర్తయిన వెంటనే విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్సార్–జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 50 ఇళ్లకు పైగా ఉన్న లేఅవుట్లలో స్వాగత ఆర్చ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.50 కోట్లతో 1,127 లేఅవుట్లలో ఆర్చ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వసతులపై ప్రత్యేక దృష్టి వైఎస్సార్–జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి వెంటనే నీరు, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న సమయంలో నీరు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రెయిన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్ మురారి గ్రామంలోని వైఎస్సార్–జగనన్న కాలనీలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న సిబ్బంది -
మౌలికానికి బ్యాంకింగ్ సహకారం కీలకం
న్యూఢిల్లీ: మౌలిక రంగ లక్ష్యాల సాధనకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న రూ. 111 లక్షల కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్ట్ లక్ష్యాల సాధనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా తగిన ప్రొడక్టులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జోషి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► దేశంలో అన్ని రంగాల పురోగతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అనుసంధానకర్త లాంటిది. అందువల్ల ఈ రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎంఐ) వంటి ఇతర కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎన్ఐపీ కీలక పాత్ర పోషించనుంది. ► పీఎం గతిశక్తి పోర్టల్ ఆధ్వర్యంలో మొత్తం రూ.111 లక్షల కోట్ల కేటాయింపులతో ఎన్ఐపీ ప్రాజెక్టులను పర్యవేక్షించడం జరుగుతోంది. 6,800 ప్రాజెక్ట్‌లతో ప్రారంభమైన ఎన్ఐపీ, ఇప్పుడు 34 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెక్టార్లను కవర్ చేస్తూ 9,000 ప్రాజెక్ట్‌లకు విస్తరించింది. ► ఈ ప్రాజెక్టులకు పెట్టుబడిలో 44 శాతం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల ద్వారా నిధులు సమకూరుస్తున్నా యి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు దాదాపు 30 శాతం వాటాతో ఈ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం. ► ఎన్ఐపీ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు క్రియాశీలంగా, పరస్పర సహకారంతో పనిచేసే విధానాన్ని అవలంబించాలి. అప్పుడే పెట్టుబడుల అవసరాలు తీరతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు సకాలంలో అందుబాటులోకి వస్తాయి. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం అవసరమైన బాండ్లు, డెరివేటివ్ మార్కెట్ల అభివృద్ధిసహా దేశంలో దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ వనరుల అభివృద్ధికి 2021లో ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ)ని ఏర్పాటు చేసింది. ఎన్ఏబీఎఫ్ఐడీ కోసం ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ఈక్విటీ మూలధనం,రూ. 5,000 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. మౌలికరంగంలో పురోగతికి ఈ చర్య ఎంతో దోహదపడింది. ► మౌలిక రంగం పురోగతికి పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒకదాని ప్రయత్నాలకు మరొకటి ప్రభావితం కాకుండా, ప్రత్యామ్నాయంగా ఈక్విటీ– డెట్ ప్రొడక్టుల మిశ్రమాన్ని ప్రాజెక్టులకు అందించడం ముఖ్యం. ► ప్రాజెక్ట్‌ల వాస్తవ అవసరాలతో అనుసంధానమైన రుణ ప్రొడక్టుల రూపకల్పన అవసరం. ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న సబ్ సెక్టార్లలో ప్రాజెక్టులకు సేవలందించే సంస్థాగత సామర్థ్యాన్ని నిరంతరం మందింపు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటున్న ఎకానమీ భారత్ ఎకానమీ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని పటిష్టంగా నిలబడగలుగుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. భారత్ ఎకానమీ 2022–23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్నట్లు పేర్కొన్నారు. 10 నెలల తర్వాత నవంబర్‌లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు (5.8 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టం 8.39 శాతానికి దిగివచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు. -
పేదల గూడు.. మౌలిక తోడు
కర్నూలు(అర్బన్): పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తోంది. జిల్లాలో మొత్తం 672 జగనన్న లేఅవుట్ల ఉన్నాయి. వీటిలో పలు లే అవుట్లకు సరైన దారి సౌకర్యం లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ నిర్మాణాల్లో వేగం పెరగడం లేదు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని 46 లేఅవుట్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.2.35 కోట్లు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.25 లక్షలతో గోడౌన్ల నిర్మాణం ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు సిమెంట్, స్టీల్ తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడకూడదనే భావనతో జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో అదనంగా గోడౌన్లను నిర్మించనున్నారు. ఆదోని, హొళగుంద, ఉడుములపాడు, దొరపల్లిగుట్ట, నందికొట్కూరులోని పగిడ్యాల రోడ్లో ఈ గోడౌన్లను నిర్మించనున్నారు. ఒక్కో గోడౌన్ నిర్మాణానికి రూ.5 లక్షలు వెచ్చించనున్నారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ పనులు చేపట్టనున్నారు. అందుబాటులో ఇసుక గృహాలు నిర్మించుకుంటున్న పేదలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇసుకను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 28 పెద్ద లేఅవుట్లను గుర్తించి వాటిలో ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 12,737 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచారు. లబ్ధిదారులకు సంబంధిత మండల ఏఈ ఇండెంట్‌ను రైజ్ చేసిన వెంటనే, ఆయా సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఇసుకను అందించి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. చాలా సంతోషం మాకు ఎమ్మిగనూరు రోడ్డులోని మంచాల కాలనీ 1లో ఇల్లు మంజూరైంది. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో వంక దాటి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కాలనీలోకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు మంజూరు చేయడం చాలా సంతోషం. రోడ్డు వేస్తే ఇంటి నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. – జంగం పంకజ, మంత్రాలయం గృహ నిర్మాణాల్లో వేగం పెరిగింది లేఅవుట్లలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోంది. దీంతో గృహ నిర్మాణాల్లో వేగం పెరిగింది. జగనన్న కాలనీలకు ప్రత్యేకాధికారులను నిర్మించాం. వీరు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంది. – నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఉపయోగకరం మా ఇల్లు బేస్మెంట్ లెవెల్ పూర్తయి, గోడల పని జరుగుతోంది. కాలనీలోకి వెళ్లేందుకు రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్రోచ్ రోడ్డు వేస్తామని అధికారులు చెబుతున్నారు. గృహాలు నిర్మించుకుంటున్న మా లాంటి వారికి ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది. – ఎద్దులదొడ్డి భువనేశ్వరి, పత్తికొండ -
పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది నా కల. దీన్ని విజయవంతం చేయాలని నేను తపన పడుతున్నాను. నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. నా కల మీ అందరి కల కావాలి. మనందరి కలతో పేదవాడి కల సాకారం కావాలి. అప్పుడే పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దిగ్విజయమవుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నదే మన లక్ష్యం కావాలని పేర్కొన్నారు. రూరల్, అర్బన్ కలిపి 9,024 లే అవుట్లలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా అన్ని లే అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వారం రోజుల్లో కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు సౌకర్యాల ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని చెప్పారు. వీటిపై మరింత ధ్యాస పెట్టలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా చార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశం మొత్తం మన వైపు చూస్తోంది రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల అని, గతంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ స్థాయిలో ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీఎం జగన్ చెప్పారు. ఇంత పెద్ద లక్ష్యం గురించి గతంలో ఎవరూ ఆలోచించలేదని, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందన్నారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా.. ఈ పనుల పట్ల అధికారులు అంకిత భావాన్ని ప్రదర్శించాలని, అప్పుడే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాకుండా, మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఇందుకు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నంబరు కేటాయించాలని ఆదేశించారు. అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలని, ఇందులో భాగంగా ప్రతి లేఅవుట్లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి.. ► జగనన్న కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావొచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. జూలై 10 నాటికి 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. ► ఆప్షన్లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభం కాగానే మొ దలు పెట్టి.. 2022 జూన్ నాటికి మొదటి విడత నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ► నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఐఐటీలు, ఇతర సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ► టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్లతో 18 నెలల్లో 2,08,160 యూనిట్లు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ -
ప్రగతి పథంలో 'పల్లెలు'
వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో రోజూ తాగునీటితో పాటు ఇతర అవసరాల కోసం పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని ఇళ్లకు కొత్తగా కుళాయిలు ఏర్పాటు చేసింది. గ్రామంలో 564 ఇళ్లు ఉండగా 2020 ఏప్రిల్ తర్వాత ఒక్క ఏడాదిలో 308 ఇళ్లలో కుళాయిలు ఏర్పాటయ్యాయి. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ప్రజల కనీస అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాల కల్పనను తొలి ప్రాధాన్యంగా చేపట్టి పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. కేవలం ఒక్క ఏడాది కాలంలో రాష్ట్రంలో 11.38 లక్షల ఇళ్లలో ప్రభుత్వం కొత్తగా మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసింది. ఇక గత 20 నెలల వ్యవధిలో మొత్తం 12,57,434 ఇళ్లకు కొత్తగా నీటి కుళాయి వసతి కల్పించారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వంద శాతం ఇళ్లలో నీటి కుళాయిల ఏర్పాటు పూర్తికాగా ఇతర చోట్ల పురోగతిలో సాగుతున్నాయి. 1,493 గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయిల ఏర్పాటు పూర్తయినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు చెబుతున్నారు. దాదాపు రూ.12 వేల కోట్లు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. తొలిదశలో రూ.4,800 కోట్లతో పనులు చేపట్టారు. రూ.8,368 కోట్లతో భవనాల నిర్మాణాలు.. గ్రామీణ ప్రజలు మండల కేంద్రాలు, పట్టణాల దాకా వెళ్లి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ ఆ ఊరిలోనే అందుబాటులో ఉండేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాలనను పల్లెల చెంతకు చేర్చింది. గ్రామ సచివాలయాల నుంచి రైతుల అన్ని అవసరాలు తీర్చేలా రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగా అందించేందుకు హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో వివిధ రకాల భవనాల నిర్మాణానికి రూ.8,368 కోట్లు మంజూరు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక కేవలం ఆరు నెలల వ్యవధిలో 1.34 లక్షల మందిని కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించిన విషయం తెలిసిందే. అన్ని గ్రామాల్లో ఆయా కార్యాలయాలకు ప్రత్యేక భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వడివడిగా నిర్మాణాలు.. రాష్ట్రంలో 5,210 గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాలు పూర్తి కాగా 1,495 చోట్ల పూర్తయ్యే దశలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1,183 కోట్లు ఖర్చు చేసింది. రూ.2,300.61 కోట్లతో 10,408 చోట్ల రైతు భరోసా కేంద్రాలకు అదనపు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. 1,545 భవనాలు ఇప్పటికే పూర్తవగా, మరో 243 పూర్తయ్యే దశలో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణానికి రూ.357.88 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేసింది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణానికి రూ. 191.61 కోట్లు, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు రూ. 335.38 కోట్లు, గ్రామాల్లో పాలసేకరణ కేంద్ర భవన నిర్మాణాలకు రూ.57.29 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేసినట్టు అధికారులు వెల్లడించారు. గ్రామీణ రోడ్లకు రూ. 973.64 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట మరమ్మతులకు రూ.973.64 కోట్లు ఖర్చు చేసినట్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పీఎంజీఎస్‌వై పథకం ద్వారా రూ.246.50 కోట్లతో 345 కి.మీ మేర కొత్తగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటిదాకా సరైన రోడ్డు వసతి లేని చిన్నచిన్న గ్రామాలకు కొత్తగా రహదారి సదుపాయం కల్పించేందుకు రూ. 332 కోట్లు ఖర్చు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం అంబటివారిపాలెం, తాటికాయలవారిపాలెం, పోతవరం గ్రామాలకు వెళ్లాలంటే పొలాల మధ్య ఉండే మట్టి రోడ్డే దిక్కు. వర్షం కురిసిందంటే నల్లరేగడి పొలాల్లో మట్టి రోడ్డులో నాలుగు చక్రాల వాహనంలో ప్రయాణం అసాధ్యమే. సాధారణ రోజుల్లో కూడా అక్కడి రైతులు ధాన్యం బస్తాలను ట్రాక్టర్లులో తరలించే వీలులేక ఎడ్ల బండ్లపైనే ఇంటికి తీసుకొస్తారు. రెండు నెలల క్రితం మట్టి రోడ్డు స్థానంలో రావులపాలెం ప్రధాన రహదారి నుంచి అంబటివారిపాలెం వరకు రెండు కిలోమీటర్ల మేర కొత్తగా తారు రోడ్డును ప్రభుత్వం నిర్మించింది. రేగడి నేలలో రోడ్డు కుంగిపోకుండా ఎక్కువ కాలం మన్నేలా అత్యంత ఆధునిక జియో మ్యాట్ టెక్నాలజీతో రూ.2.20 కోట్లతో రహదారి సదుపాయం కల్పించడంతో మూడు గ్రామాలకు ఇక్కట్లు తొలిగాయి. -
చైనా సరిహద్దులో మౌలిక వసతులు: ఆర్మీ
న్యూఢిల్లీ/బీజింగ్: చైనాతో డోక్లామ్ ఉద్రిక్తత నేపథ్యంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.అత్యవసర సమయాల్లో భద్రతా బలగాలను సరిహద్దుకు వేగంగా తరలించేందుకు వీలుగా రోడ్లు, ఇతర మౌలిక వసతుల్ని మెరుగుపర్చాలని తమ ఇంజినీరింగ్ విభాగం కోర్ ఆఫ్ ఇంజినీర్స్ (సీవోఈ)ను ఆదేశించింది. ఆర్మీ సూచనల మేరకు మౌలిక వసతుల మెరుగుదలకు కొండల్ని ధ్వంసం చేసే యంత్రాలు, పరికరాలతో పాటు బలగాలను యుద్ధ రంగానికి వేగంగా తరలించేందుకు అవసరమైన ట్రాకుల కోసం సీవోఈ ఆర్డర్లు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కోర్ ఆఫ్ ఇంజినీర్స్ మందుపాతరలను గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఆర్మీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే 1,000 డ్యూయెల్ ట్రాక్ మైన్ డిటెక్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చిందని వెల్లడించాయి. డ్యామ్‌లు నిర్మించడం లేదు: చైనా టిబెట్‌లోని యార్లుంగ్ జాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై జల విద్యుత్ కోసం ఎలాంటి డ్యామ్‌లు నిర్మించట్లేదని చైనా అధికారిక వార్తాసంస్థ గ్లోబల్ టైమ్స్ చెప్పింది. టిబెట్ లో చైనా ప్రావిన్స్‌లకు సమీపంలోని నదులపైనే ప్రాజెక్టులను చేపట్టామంది. -
మౌలిక సదుపాయాలకు రూ.1100 కోట్లు
మంత్రి బాలరాజు పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1100 కోట్లు మంజూరు చేసినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వంతాడపల్లి నుంచి అడ్డుమండ వరకు రూ.కోటి 79 లక్షలతో నిర్మించే తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తుంపాడ, గుత్తులపుట్టు గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలు, రూ.13.50 లక్షలతో నిర్మించిన గుత్తులపుట్టు జీసీసీ గిడ్డంగిని ప్రారంభించారు. పాడేరులోని పంచాయతీ కార్యాలయం వెనుక సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుంపాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక్క పాడేరు మండలం అభివృద్ధికే రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. గిరిజనులకు విద్య, వైద్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గిరిజన యువత ఉపాధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్, ఆర్డీవో ఎం.గణపతిరావు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఈఈలు సుబ్బారావు, మురళీకృష్ణ, ఎం.ఆర్.జి.నాయుడు, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు, డీసీసీ కార్యదర్శి సతీష్‌వర్మ, పలు పంచాయతీల సర్పంచ్‌లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి పాడేరు: కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులంతా గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి బాలరాజు కోరారు. స్పెషల్ డీఎస్సీ 2013 ద్వారా ఎంపికైన 56 మంది ఉపాధ్యాయులకు శనివారం రాత్రి ఐటీడీఏ కార్యాలయంలో ఆయన నియామకపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వసతి, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది చలి కాలానికి ముందే గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లోని విద్యార్థులందరికీ రగ్గులు పంపిణీ చేశామని చెప్పారు. ఉపాధ్యాయులంతా సాటి గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేసి మంచి గిరిజన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.