న్యూఢిల్లీ: మౌలిక రంగ లక్ష్యాల సాధనకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న రూ. 111 లక్షల కోట్ల నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) ప్రాజెక్ట్ లక్ష్యాల సాధనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా తగిన ప్రొడక్టులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జోషి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
► దేశంలో అన్ని రంగాల పురోగతికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక అనుసంధానకర్త లాంటిది. అందువల్ల ఈ రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎంఐ) వంటి ఇతర కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎన్‌ఐపీ కీలక పాత్ర పోషించనుంది.
► పీఎం గతిశక్తి పోర్టల్ ఆధ్వర్యంలో మొత్తం రూ.111 లక్షల కోట్ల కేటాయింపులతో ఎన్‌ఐపీ ప్రాజెక్టులను పర్యవేక్షించడం జరుగుతోంది. 6,800 ప్రాజెక్ట్‌లతో ప్రారంభమైన ఎన్‌ఐపీ, ఇప్పుడు 34 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెక్టార్‌లను కవర్ చేస్తూ 9,000 ప్రాజెక్ట్‌లకు విస్తరించింది.
► ఈ ప్రాజెక్టులకు పెట్టుబడిలో 44 శాతం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల ద్వారా నిధులు సమకూరుస్తున్నా యి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు దాదాపు 30 శాతం వాటాతో ఈ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం.
► ఎన్‌ఐపీ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు క్రియాశీలంగా, పరస్పర సహకారంతో పనిచేసే విధానాన్ని అవలంబించాలి. అప్పుడే పెట్టుబడుల అవసరాలు తీరతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు సకాలంలో అందుబాటులోకి వస్తాయి.
► ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం అవసరమైన బాండ్‌లు, డెరివేటివ్ మార్కెట్‌ల అభివృద్ధిసహా దేశంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రుణ వనరుల అభివృద్ధికి 2021లో ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ)ని ఏర్పాటు చేసింది. ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ కోసం ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ఈక్విటీ మూలధనం,రూ. 5,000 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. మౌలికరంగంలో పురోగతికి ఈ చర్య ఎంతో దోహదపడింది.
► మౌలిక రంగం పురోగతికి పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒకదాని ప్రయత్నాలకు మరొకటి ప్రభావితం కాకుండా, ప్రత్యామ్నాయంగా ఈక్విటీ– డెట్ ప్రొడక్టుల మిశ్రమాన్ని ప్రాజెక్టులకు అందించడం ముఖ్యం.
► ప్రాజెక్ట్‌ల వాస్తవ అవసరాలతో అనుసంధానమైన రుణ ప్రొడక్టుల రూపకల్పన అవసరం. ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న సబ్ సెక్టార్‌లలో ప్రాజెక్టులకు సేవలందించే సంస్థాగత సామర్థ్యాన్ని నిరంతరం మందింపు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ రంగ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటున్న ఎకానమీ
భారత్ ఎకానమీ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని పటిష్టంగా నిలబడగలుగుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. భారత్ ఎకానమీ 2022–23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్నట్లు పేర్కొన్నారు. 10 నెలల తర్వాత నవంబర్‌లో ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు (5.8 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టం 8.39 శాతానికి దిగివచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు.
మౌలికానికి బ్యాంకింగ్ సహకారం కీలకం
Published Fri, Jan 6 2023 4:22 AM | Last Updated on Fri, Jan 6 2023 4:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment