ముంబై: మౌలిక రంగానికి రుణాలను మంజూరు చేసే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (నాబ్‌ఫిడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023– 2024) రూ.60,000 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.8,000 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే, 2024 మార్చి నాటికి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్ల రుణాలను ఆమోదించనున్నట్టు నాబ్‌ఫిడ్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ వెల్లడించారు.
ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకముందే భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గత వారంలోనే ఈ సంస్థ రూ.10వేల కోట్లను సమీకరించగా, వీటికి సంబంధించిన బాండ్లను బీఎస్‌ఈలో సంస్థ మంగళవారం లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాజ్‌కిరణ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. సంస్థ ఇష్యూకి ఐదు రెట్ల స్పందన రావడం గమనార్హం. పదేళ్ల బాండ్‌పై 7.43 శాతం వార్షిక రేటును ఆఫర్ చేసింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.18,000 కోట్లను పంపిణీ చేశాం. ఈ ఏడాది రూ.60000 కోట్ల రుణ పుస్తకాన్ని సాధిస్తామని భావిస్తున్నాం. రుణ ఆమోదాలు మాత్రం రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చు’’అని రాయ్ వివరించారు.
ప్రైవేటు ప్రాజెక్టులకూ తోడ్పాటు
ఈ సంస్థ 60 శాతం రుణాలను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకే ఇస్తోంది. జూన్ త్రైమాసికంలో మాత్రం సంస్థ మంజూరు చేసిన రుణాలన్నీ కూడా ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించినవే కావడం గమానార్హం. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రైవేటు రుణాల వాటా పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలు, థర్మల్ ప్లాంట్లు, డేటా కేంద్రాలు, సిటీ గ్యాస్ పంపిణీ, రోడ్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లకు నాబ్‌ఫిడ్ రుణాలను ఇస్తుంటుంది.
ప్రస్తుతం 30 శాతం రుణాలను గ్రీన్‌ఫీల్డ్ ఆస్తులకు ఇస్తుంటే, 20 శాతం మానిటైజేషన్ ఆస్తులకు, మిగిలినది నిర్వహణలోని ఆస్తులకు ఇస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ల రంగంపైనా ఆసక్తితో ఉన్నట్టు రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. రానున్న కొత్త విమానాశ్రయాలన్నీ కూడా ఆర్థికంగా సురక్షితమైనవేనన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పన్ను రహిత బాండ్ల గురించి అడగ్గా, సమీప కాలంలో ఈ యోచన లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment