green field
-
Khammam: గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జిపై ప్రమాదం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా-మధిర మధ్య భారీ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జిపై సిమెంట్ కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వంతెన మీద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హెచ్డీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. -
మౌలికానికి రూ.60,000 కోట్ల రుణ వితరణ
ముంబై: మౌలిక రంగానికి రుణాలను మంజూరు చేసే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023– 2024) రూ.60,000 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.8,000 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే, 2024 మార్చి నాటికి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్ల రుణాలను ఆమోదించనున్నట్టు నాబ్‌ఫిడ్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ వెల్లడించారు. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకముందే భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గత వారంలోనే ఈ సంస్థ రూ.10వేల కోట్లను సమీకరించగా, వీటికి సంబంధించిన బాండ్లను బీఎస్ఈలో సంస్థ మంగళవారం లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాజ్‌కిరణ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. సంస్థ ఇష్యూకి ఐదు రెట్ల స్పందన రావడం గమనార్హం. పదేళ్ల బాండ్‌పై 7.43 శాతం వార్షిక రేటును ఆఫర్ చేసింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.18,000 కోట్లను పంపిణీ చేశాం. ఈ ఏడాది రూ.60000 కోట్ల రుణ పుస్తకాన్ని సాధిస్తామని భావిస్తున్నాం. రుణ ఆమోదాలు మాత్రం రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చు’’అని రాయ్ వివరించారు. ప్రైవేటు ప్రాజెక్టులకూ తోడ్పాటు ఈ సంస్థ 60 శాతం రుణాలను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకే ఇస్తోంది. జూన్ త్రైమాసికంలో మాత్రం సంస్థ మంజూరు చేసిన రుణాలన్నీ కూడా ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించినవే కావడం గమానార్హం. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రైవేటు రుణాల వాటా పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలు, థర్మల్ ప్లాంట్లు, డేటా కేంద్రాలు, సిటీ గ్యాస్ పంపిణీ, రోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లకు నాబ్‌ఫిడ్ రుణాలను ఇస్తుంటుంది. ప్రస్తుతం 30 శాతం రుణాలను గ్రీన్‌ఫీల్డ్ ఆస్తులకు ఇస్తుంటే, 20 శాతం మానిటైజేషన్ ఆస్తులకు, మిగిలినది నిర్వహణలోని ఆస్తులకు ఇస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ల రంగంపైనా ఆసక్తితో ఉన్నట్టు రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. రానున్న కొత్త విమానాశ్రయాలన్నీ కూడా ఆర్థికంగా సురక్షితమైనవేనన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పన్ను రహిత బాండ్ల గురించి అడగ్గా, సమీప కాలంలో ఈ యోచన లేదన్నారు. -
విజయవాడ - బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే
నూతన జిల్లా శ్రీసత్యసాయి నుంచి ఇటు విజయవాడకు, అటు పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేందుకు ‘మార్గం’ సుగమమైంది. బెంగళూరు, కడప, విజయవాడ (బీకేవీ) ఎక్స్‌ప్రెస్ వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో దూరాభారం తగ్గనుంది. ప్రస్తుతం విజయవాడకు చేరాలంటే దాదాపు 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్లేలా నాలుగు వరుసల రహదారి నిర్మించనుండటంతో నాలుగు నుంచి ఐదు గంటల్లోనే విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది. సాక్షి, పుట్టపర్తి: బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. జిల్లాలో 75 కి.మీ మేర విస్తరించనున్న ఈ రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సుఖవంతంగా సాగేలా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల, ఓడీచెరువు, నల్లమాడ, ముదిగుబ్బ , కదిరి మండలాల్లో సాగే గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూసేకరణకు సంబంధించి అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 2 వేల ఎకరాలు సేకరించనున్నారు. కోడూరు నుంచి ప్రారంభం.. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారి –44 నుంచి నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే మొదలవుతుంది. అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలోని వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం, ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మీదుగా పామూరు, కనిగిరి, చీమకుర్తి, పెద్ద ఉయ్యాలవాడ, బొద్దికూరపాడు, నాగంబొట్లపాళెం, కంకుపాడు, అద్దంకి, ముప్పవరం వరకు రోడ్డు నిర్మాణం సాగనుంది. జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా.. జిల్లాలో 75 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరించనుంది. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఎన్‌హెచ్–44 వద్ద మొదలై చాగిలేరు, గోరంట్ల మండలంలోని బూదిలి, జక్కసముద్రం, పుట్టపర్తి మండలంలోని అమగొండపాళ్యం, సాతర్లపల్లి, ఓడీచెరువు మండలం కొండకమర్ల, నల్లమాడ మండలం వేళ్లమద్ది, కదిరి మండలంలోని పట్నం, తలుపుల మండలంలోని లక్కసముద్రం, ముదిగుబ్బ మండలంలోని దేవరగుడి వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది. భూసేకరణ ఇలా... జాతీయ రహదారి నిర్మాణానికి 90 మీటర్ల వెడల్పున భూమిని సేకరించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 వేల ఎకరాల భూసేకరణకు త్వరలోనే 3–ఏ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భూసేకరణలో భాగంగా ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారీగా వివరాలు సిద్ధం చేస్తున్నారు. డీపీఆర్ ప్రకారం ఏయే రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పెరిగిన భూమి విలువ... నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బీకేవీ ఎక్స్‌ప్రెస్ వే కోసం సర్వే ప్రారంభించింది. భూసేకరణకు సంబంధించిన రాళ్లు ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ బాగా పెరిగింది. భూముల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ రహదారి పూర్తయితే విజయవాడ – బెంVýæళూరు మధ్య ప్రయాణం సుఖవంతంగా సాగనుంది. రహదారిపైకి వెళ్లేందుకు 13 చోట్లే అనుమతి.. బీకేవీ ఎక్స్‌ప్రెస్ వే పైకి వెళ్లేందుకు వాహనదారులు అన్ని చోట్ల అవకాశం ఉండదు. వాహనాల స్పీడ్, భద్రతా ప్రమాణాల మేరకు... మూడు జిల్లాల్లో కేవలం 13 చోట్ల మాత్రమే రహదారిలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అవకాశం కల్పిస్తూ రూపకల్పన చేశారు. డీపీఆర్ రూపకల్పన విజయవాడ– బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ.పీ.ఆర్)రూపకల్పనలో ఉన్నాం. త్వరలోనే భూసేకరణ పూర్తవుతుంది. –రామకృష్ణ , ప్రాజెక్డ్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
గ్రీన్ ఫీల్డ్ కాలనీల నిర్మాణానికి సహకరించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణాలను కూడా చేపట్టిన నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసేలా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఙప్తి చేశారు. ప్రస్తుతం పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) కింద గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని నిబంధన విధించారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించడానికి భారీగా ఖర్చవుతుందని.. అంత వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం సాధ్యం కాదన్నారు. గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే వాటిలో లబ్ధిదారులు నివాసం ఉండలేరని వివరించారు. అప్పుడు ఇళ్ల స్థలాల సేకరణ, ఇంటి నిర్మాణానికి చేసిన వ్యయం నిరర్ధకమవుతుందని, పీఎంఏవై పథకం ద్వారా ఆశించిన లక్ష్యాలను సాధించలేమన్నారు. గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాల్లో కీలకమైన లక్ష్యాన్ని (ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు జీవించేలా పట్టణాలు, గ్రామాలను తీర్చిదిద్దడం) దేశం అధిగమిస్తుందని వివరించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ మంగళవారం లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ.. మహత్తర లక్ష్యం... ► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2022 నాటికి మురికివాడల్లో నివసిస్తున్న వారితోపాటూ అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యం మహత్తరమైనది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు పీఎంఏవై పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా అమలవుతోన్న మహత్తర సంక్షేమ పథకాల్లో పీఎంఏవై పథకం ఒకటి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం వల్ల ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఎస్డీజీలను దేశం అధిగమిస్తుంది. పీఎంఏవై లక్ష్యం సాధించాలంటే.. ► సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరికీ ఇళ్లు పథకాన్ని కేంద్రం చేపట్టింది. గత ఏడేళ్లగా 308.2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. భారీ ఎత్తున కాలనీల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి కేంద్ర వాటా కింద రూ.2.99 లక్షల కోట్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం మూడు అంశాలపై ఆధారపడింది. అవేమిటంటే.. 1. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలను మంజూరు చేయడం 2.ఆ స్థలంలో పక్కా ఇంటిని నిర్మించుకోవడానికి సహాయం అందించడం 3.ఆ ఇంటిని నిర్మించుకున్న కాలనీ, లేఅవుట్లలో రహదారులు, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, మురుగునీటి కాలువలు లాంటి కనీస సదుపాయాలను కల్పించడం. మిషన్ పూర్తయ్యేలోగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం.. ► ప్రజాసాధికారతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన అందరికీ ఇళ్లు పథకం తరహాలోనే రాష్ట్రంలో 68,381 ఎకరాలను 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేశాం. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీకే రూ.23,535 కోట్లను ఖర్చు చేశాం. ఇందులో 28.30 లక్షల ఇళ్లను 17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో రూ.50,944 కోట్లతో చేపట్టాం. ► ఇళ్లను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయడానికి అడిషినల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ర్యాంకులో అన్ని జిల్లాల్లోనూ ‘జాయింట్ కలెక్టర్, హౌసింగ్’ పేరుతో ప్రత్యేక పోస్టును ఏర్పాటు చేశాం. ఈ పోస్టుల్లో యువ ఐఏఎస్ అధికారులను నియమించాం. మిషన్ గడువు ముగిసేలోగా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే విశ్వాసం ఉంది. కనీస సదుపాయాలు కల్పిస్తేనే లక్ష్యం సాకారం.. ► గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే పీఎంఏవై పథకం లక్ష్యం సాకారం కాదు. రాష్ట్రంలో 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.34,109 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ► పీఎంఏవై పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికే రూ.23,535 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి అయ్యే భారీ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు. ► పీఎంఏవై పథకం సాకారం కావాలంటే గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ అంశంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడానికి నిధులు ఇచ్చేలా కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని కోరుతున్నా. -
‘జియో’కు ఏం ఎక్కువ, మాకేం తక్కువా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలను కాదని ఇంకా ఆవిర్భవించని ‘జియో ఇనిస్టిట్యూట్’ విద్యా సంస్థకు ‘ఎమినెన్స్ (అత్యున్నత)’ హోదాను కేంద్ర ప్రభుత్వ కల్పించడాన్ని ఈ హోదా కోసం జియోతో పోటీ పడిన సంస్థలేవీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అలా పోటీ పడిన 27 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఓపీ జిందాల్ యూనివర్శటీ, అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీ, అశోక యూనివర్శిటీ, నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంస్థల పురోగతి రికార్డును పరిగణలోకి తీసుకోకుండా ఎంత అద్భుతమైన ప్రణాళికలను చూపించినప్పటికీ రాబోయే విద్యా సంస్థ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని ఎలా విశ్వసిస్తారని ఈ హోదా దక్కని విద్యా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ‘జియో ఇనిస్టిట్యూట్’ను ప్రతిపాదించిన రిలయెన్స్ గ్రూపునకు దేశంలో చాలా మంచి పేరున్నందున, ఆ గ్రూప్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నందున, విద్యా సంస్థ కోసం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందున, సంస్థను ఏర్పాటు చేసిన 10 ఏళ్లలోనే ప్రపంచంలోని టాప్ 500 ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిస్తుందని పూర్తి విశ్వాసం కలిగినందున ఆ సంస్థకు ‘ఎమినెన్స్’ హోదా ఇచ్చామని ఇటు ఎంపిక కమిటీ, అటు కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే ఈ హోదా కోసం యూజీసీ ప్రతిపాదించిన ప్రమాణాల మేరకే హోదా ఇచ్చారా ? అన్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పడం లేదు. ‘గ్రీన్‌ఫీల్డ్’ కేటగిరీ కింద ఇచ్చామంటూ చెప్పిందే చెబుతూ సమర్థించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయోత్నిస్తోంది. ఎందులో జియోతో తాము సరితూగమో చెప్పండని ఈ గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కిందనే దరఖాస్తు చేసుకున్న తమిళనాడులోని ప్రతిపాదిత క్రియా యూనివర్శిటీ (దీనికి మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సలహాదారు), ఒరిస్సా వేదాంత యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని ప్రముఖ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ కింద ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, యూనివర్శిటీ, డీమ్డ్ యూనివర్శిటీ హోదాలేని ఉన్నత విద్యా సంస్థలు గ్రీన్‌ఫీల్డ్ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని 2017, నవంబర్ 17న యూజీసీ వివరణ ఇచ్చిందని, ఆ వివరణ మేరకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. తమ సంస్థలో భారతీయ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా గణనీయంగా చదువుతున్నారని పేర్కొంది. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఒకే ఒక్క సంస్థకు అత్యున్నత హోదా ఇస్తున్నారని తెలియడంతో అది కాస్త జియోకే దక్కుతుందని తాము భావించామని, అందుకు ఆ సంస్థకు, ప్రభుత్వానికున్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సమీకరణలు కారణం కావొచ్చని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని విద్యా సంస్థల యాజమాన్యాలు మీడియా ముందు వ్యాఖ్యానించాయి. ‘ఎమినెన్స్’ హోదా కింద ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రోత్సహకాలు ఏమీ ఉండకపోయినా విద్యా సంస్థపై పెట్టే పెట్టుబడులకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. చదవండి: రిలయెన్స్ మీద అంత మోజెందుకు? -
రిలయెన్స్ మీద అంత మోజెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని మూడు ప్రముఖ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలతోపాటు మరో మూడు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు కూడా సోమవారం నాడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (ఘనత వహించిన లేదా అత్యున్నత)’ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ప్రైవేటు రంగంలో ఇంకా పురుడు కూడా పోసుకోని ‘జియో ఇనిస్టిట్యూట్’కు ఎలా ఈ హోదా కల్పిస్తారంటూ సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఒక్కసారిగా వెల్లువెత్తిన విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ముందుగా తికమక పడిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ‘గ్రీన్ ఫీల్డ్’ క్యాటగిరీ కింద ఇచ్చామంటూ సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం దేశంలోని పది ప్రభుత్వ, పది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు ఈ ‘అత్యున్నత’ హోదాను కల్పించాల్సి ఉంది. నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ చేపట్టగా కేవలం ఆరు అంటే, మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మాత్రమే ఈ హోదాకు అర్హులయ్యాయని నలుగురు సభ్యుల ఎంపిక కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి ‘ఎకనామిక్స్ టైమ్స్’కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 ఉన్నత విద్యా సంస్థల్లో వరుసగా పదేళ్ల పాటు స్థానం సంపాదించిన విద్యా సంస్థలనే తాము ప్రమాణంగా తీసుకున్నామని కూడా ఆయన చెప్పారు. మరి ఏ ప్రమాణాల మేరకు ఇంకా ఏర్పాటు చేయని ‘జియో ఇనిస్టిట్యూట్’కు ఎలా హోదా ఇచ్చారన్న ప్రశ్నకు ఆయన ఫోన్ మూగబోయింది. ప్రస్తుతం ఆయన మీడియాకే అందుబాటులో లేరు. రాజస్థాన్‌లోని పిలానిలో 1964లో ఏర్పాటైన ‘బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి, 1953లో ఏర్పాటైన ‘మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (కస్తూర్బా మెడికల్ కాలీజీని నిర్వహిస్తున్న)’తోపాటు జియో ఇనిస్టిట్యూట్‌కు ప్రభుత్వం హోదా కల్పించింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ నేతృత్వంలో నిర్వహిస్తున్న రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జియో ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు 2018, మార్చి నెలలో నీతూ అంబానీ ప్రకటించారు. అసలు ప్రమాణాలు ఏమిటీ? కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016లో తన బడ్జెట్ ప్రసంగంలోనే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఉన్నత విద్యను మరింత ప్రోత్సహించేందుకు 20 విద్యా సంస్థలకు ‘అత్యున్నత’ హోదా కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే 2017, ఆగస్టులో ఈ ప్రక్రియను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యా సంస్థలు బహుళ అంశాల్లో కోర్సులను నిర్వహించడమే కాకుండా పరస్పర ఆధారిత కోర్సులను కూడా నిర్వహించాలి. దేశీయ, విదేశీ విద్యార్థులకు కలిపి ఒక ఫ్యాకల్టీ తప్పనిసరిగా ఉండాలి. వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానంపై సంస్థ పరిశోధన కొనసాగుతుండాలి. విద్యార్థుల సౌకర్యాలకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండాలి. దరఖాస్తు నాటికి ప్రతి 20 విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. మరో ఐదేళ్ల కాలానికి ఆ సంఖ్య పది తగ్గాలి. ఇందులో ఏ ఒక్క ప్రమాణానికి జియో ఇనిస్టిట్యూట్ సరితూగదు కనుక ‘గ్రీన్‌ఫీల్డ్’ కేటగిరీ కింద ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ‘గ్రీన్‌ఫీల్డ్’ కేటగిరీ అంటే ఏమిటీ? కేవలం ప్రైవేటురంగంలో కొత్తగా పెట్టబోయే ఉన్నత విద్యా సంస్థలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ కేటగిరీ తర్వాత తీసుకొచ్చారు. ఈ కేటగిరీ కింద సంస్థను కాకుండా యూనివర్శిటీనే ఏర్పాటు చేయాలి. అందుకు కావాల్సినంత స్థలం, డబ్బుతోపాటు విద్యారంగంలో అనుభవం ఉండాలి. సొంత పెట్టుబడులు ఐదు వేల కోట్లతోపాటు పది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల వరకు ప్రజా సంస్థల పూచికత్తు ఉండాలి. పది ప్రజా సంస్థలకు మించి ఈ పెట్టుబడులను సమకూర్చరాదు. పది వేల కోట్ల నుంచి కొంత సొమ్మును సంస్థ విస్తరణకు ఏటా ఖర్చు పెట్టాలి. ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోగా అత్యున్నత హోదాను, ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునే ఆస్కారం ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళిక ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యం సమర్థుడైన వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ దరఖాస్తు నాటికే నియమితులై ఉండాలి. మరి, ఈ అర్హతలు ‘జియో’కు ఉన్నాయా? రిలయెన్స్ గ్రూప్ కనుక కావాల్సినంత స్థలం, డబ్బు ఉండవచ్చు. అనుభవం అంటే రాజాస్థాన్‌లోని ‘బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ని చూపించవచ్చేమో! ప్రజా సంస్థల పెట్టుబడులను కూడా మేనేజ్ చేయవచ్చు. వైస్ చాన్సలర్ టీమ్‌ను ఏర్పాటు చేయలేదు. యూనివర్శిటీ పునాదుల మాట అటుంచి ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా నిర్ణయం జరగలేదు. మరి జియోకు ఎలా ఇచ్చారని ఈ సంస్థతో పోటీపడిన మరో హోదా దక్కించుకోని సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. దరఖాస్తు చేసిన సంస్థల్లో పెద్ద పెద్ద యూనివర్శిటీలతో సంబంధం ఉన్న, వాటిల్లో అపార అనుభవం ఉన్న సంస్థలు ఉన్నాయి. వాటికి ఒక్క ప్రజా సంస్థల పెట్టుబడులు తప్పించి, జియోకన్నా ఎక్కువ ప్రమాణాలే ఉన్నాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని దరఖాస్తుదారులు చెబుతున్నారు. సహజంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు విరాళాలిచ్చే ప్రజా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎందుకు పెట్టుబడులు పెడతాయని వారు ప్రశ్నిస్తున్నారు. -
అంధ విద్యార్ధులను చితకబాదిన నిర్వాహకుల అరెస్టు
-
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు షురూ
దగదర్తి, న్యూస్‌లైన్: మండలంలోని సున్నపుబట్టి వద్ద ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఎయిర్‌పోర్టు అథారిటీ బృందం స్ప ష్టం చేసింది. దీంతో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు త్వరలో శ్రీకారం జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు చెబుతున్నా రు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 3,407.77 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని రెవెన్యూ అధికారులు ఎయిర్‌పోర్టు అథారిటీ బృందానికి తెలిపారు. శుక్రవారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు భూములను పరిశీ లించారు. గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు పర్యటించేటప్పటికీ 2,480 ఎకరాలు మాత్రమే రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుత అవసరాల అనుగుణంగా రన్‌వేకు ఇబ్బంది అనుకూలంగా ఢిల్లీ అధికారుల ప్రణాళిక ప్ర కారం 60 మిలియన్స్ పాసింజర్స్ కెపాసిటీకి అనుకూలంగా ఉండేందుకు 3,407 ఎకరాల భూమి విస్తీర్ణాన్ని గుర్తించారు. అందులో పట్టా భూమి 419.66, డీ-ఫారం పట్టా భూమి 526.71, అటవీ భూమి 1121.09, ప్ర భుత్వ భూమి 545.74, సీజేఎఫ్ఎస్ భూమి 483.84, చె రువు 29.86, కొండ 281.87 వెరసి మొత్తం 3407.77 ఎ కరాల భూమి ఉందని వివరించారు. దగదర్తి నుంచి సు న్నపుబట్టి వరకు తూర్పు, పడమరకు ఆరు కిలో మీటర్ల పొడవుతో, సున్నపుబట్టి నుంచి దామవరం రోడ్డు వరకు రెండు కిలో మీటర్ల వెడల్పులో ఉన్న భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉందని ఢిల్లీ అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్త సర్వే ప్రకారం సున్నపుబట్టిలోని చెరువుతో పా టుగా జాతీయ రహదారికి పడమర వైపునున్న గృహాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. తమ గృహాలు విమానాశ్రయానికి పోతాయని తెలిసి ఆందోళన చెందుతున్నా రు. అధికారులు మాత్రం నెల్లూరు, ఒంగోలు పట్టణాలకు మధ్య భాగంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడంత్లో రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పారిశ్రామికంగా ఫ్యాక్టరీలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.