ఈవీ చార్జ్‌! | India electric vehicle charging infrastructure is growing | Sakshi
Sakshi News home page

ఈవీ చార్జ్‌!

Published Sun, Feb 23 2025 4:50 AM | Last Updated on Sun, Feb 23 2025 7:20 AM

India electric vehicle charging infrastructure is growing

స్పీడ్‌ బ్రేకర్లున్నా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ జోరు

సాధారణ వాహనాలను మించిన వృద్ధి

2024లో రోడ్డెక్కిన 19,49,114 ఈవీలు

ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి చార్జింగ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందోనన్న ఆందోళన, మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండడం, వినియోగదారులకు భరోసా లేకపోవడం.. ఈ అంశాలే ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) వృద్ధి వేగానికి ప్రధాన అడ్డంకులు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు బ్యాటరీల సామర్థ్యం పెంచడానికి, వేగంగా చార్జింగ్‌ పూర్తి కావడానికి తయారీ సంస్థలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. 

చార్జింగ్‌ మౌలిక వసతులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో వినియోగదార్లలో ఈవీల పట్ల ఆమోదం క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అమ్ముడవుతున్న ఈవీలే నిదర్శనం. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కితే.. ఇందులో ఈవీలు 7.46 శాతం వాటాతో 19,49,114 యూనిట్లు కైవసం చేసుకున్నాయి. ఆసక్తికర అంశం ఏమంటే మొత్తం వాహన పరిశ్రమ గత ఏడాది 9.11 శాతం వృద్ధి చెందితే.. ఎలక్ట్రిక్‌ వాహన విభాగం ఏకంగా 27 శాతం దూసుకెళ్లడమే.    

రికార్డుల దిశగా..
భారత్‌లో ఈవీ పరిశ్రమ 2024లో గరిష్ట విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. నిముషానికి 3.7 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2015–2024 కాలంలో 54 లక్షల యూనిట్ల ఈవీలు రోడ్డెక్కాయి. ప్రస్తుత వృద్ధి వేగాన్నిబట్టి ఈవీ రంగంలో 2029–30 నాటికి ప్యాసింజర్‌ కార్స్‌ విక్రయాలు 9.60 లక్షల యూనిట్లకు చేరవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. అలాగే టూవీలర్స్‌ 1.37 కోట్ల యూనిట్లు, త్రీవీలర్స్‌ 12.8 లక్షల యూనిట్లను తాకుతాయని ఈవీ రంగం భావిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నూతన సాంకేతికత, కంపెనీల దూకుడు.. వెరసి చార్జింగ్‌ స్టేషన్స్‌ సంఖ్య 13.2 లక్షలకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 

దేశంలో 2024 డిసెంబర్‌ 20 నాటికి 25,202 చార్జింగ్‌ స్టేషన్స్‌ వినియోగంలో ఉన్నాయి. మొత్తం త్రిచక్ర వాహన అమ్మకాల్లో ఈ–త్రీవీలర్స్‌ వాటా ఏకంగా 56 శాతం ఉంది. 210 కంపెనీలు ఈ–టూవీలర్స్‌ విభాగంలో పోటీపడుతున్నాయి. డిసెంబర్‌ నెల అమ్మకాల్లో టూవీలర్స్‌ సెగ్మెంట్‌లో బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కో టాప్‌–2లో ఉన్నాయి. త్రీవీలర్స్‌లో మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ, బజాజ్‌ ఆటో, ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విభాగంలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్లు్య ఎంజీ మోటార్‌ ఇండియా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఐసీఈ విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీల్లోనూ పాగా వేస్తున్నాయి.

వ్యయాలు తగ్గినప్పటికీ..
ఐసీఈ ఇంజన్‌ కలిగిన వాహనాలతో పోలిస్తే ఈవీకి అయ్యే రోజువారీ వ్యయాలు తక్కువ. అయితే ప్రతిరోజు తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈవీ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అవసరం నిమిత్తం సుదూర ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం మరో మార్గం వెతుక్కోవాల్సిందే. ఐసీఈ వాహనాల మాదిరిగా దారిలో పెట్రోల్, డీజిల్‌ పోయించుకుని గమ్యం చేరినట్టు ఈవీలకు వీలు కాదు. ఒకవేళ ఈవీతో దూర ప్రయాణం చేయాల్సి వస్తే.. చార్జింగ్‌ కేంద్రాల వద్ద బ్యాటరీ చార్జింగ్‌ పూర్తి అయ్యే వరకు నిరీక్షించాల్సిందే. ఈ అంశమే ఈవీల వృద్ధి వేగానికి స్పీడ్‌ బ్రేకర్‌గా నిలిచింది. చార్జింగ్‌నుబట్టి ప్రయాణాలు ఆధారపడతున్నాయని కస్టమర్లు అంటున్నారు. 

ఈ–కామర్స్‌ కంపెనీలతో..
ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాల వృద్ధికి ఈ–కామర్స్‌ కంపెనీల దూకుడు కూడా తోడవుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఈ కంపెనీలు నడుం బిగించడం ఇందుకు కారణం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ సంస్థలు, ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లూ, స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్‌ డెలివరీ యాప్స్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో వంటి క్విక్‌ కామర్స్‌ సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం విషయంలో డెలివరీ పార్ట్‌నర్స్, డ్రైవర్‌ పార్ట్‌నర్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. సులభ వాయిదాల్లో ఈవీల కొనుగోలు, బ్యాటరీల స్వాపింగ్‌ సౌకర్యాలు, చార్జింగ్‌ మౌలిక వసతులను కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి.  

వెన్నుదన్నుగా ప్రభుత్వం..
ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ (ఐసీఈ) నుంచి కొత్తతరం ఈవీ, ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ టెక్నాలజీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాలు, వాహన విడిభాగాల పరిశ్రమకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ బ్యాటరీ స్టోరేజ్‌ విభాగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్‌ పథకానికి రూ.10,900 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్‌ అందిస్తోంది. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రంగంలో విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆటోమేటిక్‌ రూట్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తోంది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్లాంట్లు స్థాపించే సంస్థలు పూర్తిగా తయారైన ఈవీలను దిగుమతి చేస్తే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి తగ్గించారు. లిథియం అయాన్‌ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. ఈవీ, చార్జింగ్‌ మౌలిక వసతులు, బ్యాటరీస్‌ రంగంలో 2030 నాటికి 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ మార్కెట్‌ ఆరేళ్లలో ప్రపంచంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని భారత ప్రభుత్వం ధీమాగా ఉంది. కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 2030 నాటికి 30 శాతం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

రీసేల్‌ వాల్యూ సవాల్‌..
ఐసీఈ వాహనాల స్థాయిలో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లో ఈవీలకు డిమాండ్‌ లేకపోవడం కస్టమర్లను నిరాశకు గురిచేస్తోంది. రీసేల్‌ వాల్యూ పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన డిమాండ్‌ను పరిమితం చేస్తోందని కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, నేషనల్‌ హెడ్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ అన్నారు. జీఎస్టీ, రహదారి పన్ను ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఖరీదైన బ్యాటరీ కారణంగా ఐసీఈ వాహనంతో పోలిస్తే ఈవీ ధర ఎక్కువగా ఉంటోంది. ఈ అంశం కూడా ఈవీ స్వీకరణను పరిమితం చేస్తూనే ఉంది. ఈవీలు మరింత చవకగా మారితేనే డిమాండ్‌ ఊపందుకుంటుందన్నది కస్టమర్ల మాట. ఐసీఈ కార్ల కంటే ఎలక్ట్రిక్‌ కార్ల ధర 30–50% ఎక్కువ. అలాగే ద్విచక్ర వాహనాల ధర 20–30% అధికంగా ఉంటోంది. 

 – సాక్షి, బిజినెస్‌ బ్యూరో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement