తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతాం
దేశంలో చిన్న కార్లకు ఇప్పటికీ డిమాండ్ ఉంది
సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ
న్యూఢిల్లీ: పరిమాణం, మార్కెట్ వాటాలో భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) విభాగంపై దృష్టి సారిస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్లో కంపెనీ ఎంట్రీ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ‘ఈవీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం. మా పోటీదారుల ఉత్పత్తులు ఎలా పనిచేశాయో చూశాం. భారతీయ మార్కెట్‌కు ఏమి అవసరమో మాకు తెలుసు.
అంతర్జాతీయంగా సుజుకీ కార్పొరేషన్‌కు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తోపాటు ఇతర అన్ని మోడళ్లకు ఉత్పత్తి కేంద్రంగా భారత్ ఉంటుంది. ఉత్పత్తిలో దాదాపు 50 శాతం జపాన్, యూరప్‌కు ఎగుమతి చేస్తాం’ అని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ గురువారం వెల్లడించారు. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో నేటి (జనవరి 17) నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
చిన్న ఎలక్ట్రిక్ కార్లు..
ఎస్‌యూవీలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను.. అలాగే ఈవీ విపణిలో అగ్రశ్రేణి వాటాను పొందాలని చూస్తున్నట్లు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఎస్‌యూవీలను కస్టమర్లు డిమాండ్ చేస్తున్నందున భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ–విటారాతో ఈవీ ప్రయాణం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగానికి కాంపాక్ట్ ఈవీలు ఉత్తమంగా సరిపోతాయని సుజుకీ అన్నారు.
ఈవీ విభాగంలో కంపెనీ నుంచి తదుపరి మోడల్ చిన్న కారు వచ్చే అవకాశం ఉందని ఆయన మాటలనుబట్టి సుస్పష్టం అవుతోంది. కస్టమర్ అవసరాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లు ట్యాంక్ ఇంధనంతో దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తాయని సుజుకీ తెలిపారు. ఈ దూరాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఈ–విటారాను సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు. భారత్ మండపం వేదికగా ఈ–విటారాను కంపెనీ శుక్రవారం (నేడు) ఆవిష్కరిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీతో పాటు హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్‌ఎస్ ఈవీలకు ఈ–విటారా పోటీ ఇవ్వనుంది.
ఇంకా డిమాండ్ ఉంది..
అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ భారత్‌లో చిన్న కార్లు నిలిచిపోవని సుజుకీ అన్నారు. ‘సుజుకీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా భారత్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ద్విచక్ర వాహనాల నుండి నాలుగు చక్రాల వాహనాలకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్న 100 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఇంకా సరసమైన చిన్న కార్లు అవసరం అని విశ్వసిస్తున్నాం. ఈ–విటారా పట్ల కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని, ప్రతిస్పందనను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాతే చిన్న ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలతో ముందుకు సాగుతాం’ అని వివరించారు. కాగా, మారుతీ సుజుకీ ఇండియా 2024లో 3.24 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
ఎలక్ట్రిక్ యాక్సెస్ సైతం..
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–యాక్సెస్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో సందర్భంగా ఆవిష్కరిస్తోంది. సుజుకీ ఇప్పటికే భారత్‌లో పెట్రోల్ వర్షన్ యాక్సెస్–125 విక్రయిస్తోంది.
భారతీయుడు కూడా సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ కావచ్చు..
మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో ఎవరైనా కావొచ్చని, ఇక్కడ జాతీయత ఒక అంశం కాదని తొషిహిరో సుజుకీ అన్నారు. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత ఒసాము సుజుకీ 40 సంవత్సరాల క్రితం భారత్ వచ్చారని, ఈ మార్కెట్ యొక్క అసలైన సామర్థ్యాన్ని ఎవరూ ఊహించలేదని వివరించారు. అయినప్పటికీ భారతదేశం మరియు ఇక్కడి ప్రజలపై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నేడు భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2003లో లిస్టింగ్ అయినప్పటి నుండి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ అలాగే ఎండీ, సీఈవో పదవులను భారతీయ, జపాన్ ఎగ్జిక్యూటివ్‌లు అలంకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment