
సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ అయిన 'కియా మోటార్స్'.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని తన తయారీ కేంద్రం నుంచి 15 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.
కియా ఇండియా 2019 ఆగస్టు నుంచి దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ ఉంది. అతి తక్కువ కాలంలో ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న కార్ల తయారీదారుగా కియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అనంతపురం ప్లాంట్ కియా కార్యకలాపాలకు మూలస్తంభంగా ఉంది.
కియా ఇండియా అనంతపురం ప్లాంట్లో సెల్టోస్, సోనెట్, కారెన్స్, కార్నివాల్, సైరోస్ వంటి కార్లను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ ఈ కార్లను భారతదేశంలో విక్రయించడం మాత్రమే కాకుండా.. ఇక్కడ నుంచి విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది.
ఇదీ చదవండి: 2025 హంటర్ 350 బైక్ ఇదే.. ధర ఎంతంటే?
ఉత్పత్తి గణాంకాల విషయానికొస్తే.. సెల్టోస్ 7,00,668 యూనిట్ల ఉత్పత్తితో (46.7%) ముందంజలో ఉంది. తరువాత సోనెట్ 5,19,064 యూనిట్లతో (34.6%) రెండవ స్థానంలో ఉంది. కారెన్స్ 2,41,582 యూనిట్లు (16.1%), సైరోస్ & కార్నివాల్ వంటి ఇటీవలి మోడళ్లు వరుసగా 23,036 యూనిట్లు (1.5%) మరియు 16,172 యూనిట్లు (1.1%)గా ఉన్నాయి.