ఖాళీ బ్యాటరీకి బదులుగా ఫుల్ చార్జింగ్ ఉన్న బ్యాటరీని పొందొచ్చు
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల స్వాపింగ్‌కుమార్గదర్శకాలను ప్రకటించిన కేంద్రం
సమయం ఆధారంగా యూనిట్‌కు రూ.3 నుంచి రూ.13 వరకు సర్వీసు చార్జీలు
ఇప్పటికేవిదేశాల్లోచాలా ప్రాచుర్యంపొందిన స్వాపింగ్ విధానం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది.
బ్యాటరీల స్వాపింగ్, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. విదేశాల్లో ఈ విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్న వారు సైతం స్వాపింగ్ సేవలను ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుత విద్యుత్ కనెక్షన్ ద్వారానే స్వాపింగ్ సేవలను అందించడానికి కేంద్రం వీరికి అవకాశం కల్పించింది.
సర్వీసు చార్జీలపై సీలింగ్
ఈవీ చార్జింగ్ కేంద్రాల్లో ఏసీ/డీసీ చార్జింగ్‌కు వసూలు చేయాల్సిన సర్వీసు చార్జీలపై గరిష్ట పరిమితిని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ, భూమి ధరకు సంబంధించిన చార్జీలు వీటికి అదనం కానున్నాయి. యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలు చేసే సగటు వ్యయంతో పోల్చితే చార్జింగ్ కేంద్రాలకు సరఫరా చేసే విద్యుత్ టారిఫ్ అధికంగా ఉండరాదని కేంద్రం స్పష్టం చేసింది.
2028 మార్చి 31 వరకు దేశ వ్యాప్తంగా ఇవే సర్వీస్ చార్జీలు, టారిఫ్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. సగటు సరఫరా వ్యయంతో పోల్చితే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 0.7 రేట్లు, సాయంత్రం 4 నుంచి ఉదయం 9 గంటల వరకు 1.3 రేట్ల అధిక వ్యయంతో చార్జింగ్ కేంద్రాలకు డిస్కంలు విద్యుత్ సరఫరా చేయాలని సూచించింది. ఈవీ చార్జర్ల కోసం సబ్ మీటర్లను సరఫరా చేయాలని డిస్కంలను కోరింది.
3 రోజుల్లోనే కరెంట్ కనెక్షన్
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే మెట్రోపాలిటన్ నగరాల్లో కేవలం 3 రోజుల్లోనే కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇతర మున్సిపాలిటీల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో, కొండలున్న గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లో, సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్లు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటే 90 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని స్పష్టం చేసింది.
ఒకవేళ జాప్యం చేస్తే ఎలక్ట్రిసిటీ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ రూల్స్–2020 ప్రకారం దరఖాస్తుదారులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థకు స్పష్టం చేసింది.
ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్థలు తమ స్థలాలను ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం రెవెన్యూ షేరింగ్ మోడల్ కింద అందించాలని కేంద్రం సూచించింది. స్థలం ఇచ్చినందుకుగాను ప్రతి యూనిట్ విద్యుత్ చార్జింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో రూపాయిని వాటాగా తీసుకోవాలని చెప్పింది. తొలుత 10 ఏళ్ల లీజుకు స్థలాలను కేటాయించాలని కోరింది. చార్జింగ్ కేంద్రాలఏర్పాటుదారులకు కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment