న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తొలి ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రోడ్లపై పరుగుతీయనుంది. ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో ఈ కారును రూపొందిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీని పొందుపరుస్తున్నట్టు సియామ్ సమావేశంలో చెప్పారు. ఇలాంటి పలు ఈవీ మోడళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. యూరప్, జపాన్ తదితర దేశాలకు ఈ ఈవీని ఎగుమతి చేయనున్నట్టు పేర్కొన్నారు.
దేశీయ విపణిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతోపాటు మారుతీ తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని భావిస్తోంది. 2030 నాటికి ఎగుమతులను మూడు రెట్లు పెంచుకునే యోచనలో ఉన్నట్లు టాకేయూచీ తెలిపారు. కంపెనీ ఇప్పటికే కొన్ని వాహనాలను జపాన్‌కి కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ షో సందర్భంగా తొలి ఈవీని ఆవిష్కరిస్తామని మారుతీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక వసతుల ఏ ర్పాటు, రీసేల్ మార్గాలను కలిగి ఉండటం వంటి ఇతర కీలక అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment