కృత్రిమ మేధ మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తు
దేశీయంగా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు
త్వరలో ఏఐ ఎగుమతి దేశంగా భారత్
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్‌విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్‌కి చెందిన కొత్త డేటా సెంటర్‌లో ఎన్‌విడియాకి చెందిన బ్లాక్‌వెల్ ఏఐ చిప్‌లను వినియోగించనున్నారు.
ఎన్‌విడియా ఏఐ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్‌సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్‌లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు.
‘చిప్‌ల డిజైనింగ్‌లో భారత్‌కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్‌విడియా చిప్‌లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్‌విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్‌గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్‌విడియాకు .. భారత్‌లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి.
భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్‌గా భారత్: అంబానీ
భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు.
దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్‌ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్‌లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.
ఇన్ఫీ, టీసీఎస్‌లతో కూడా..
భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్‌విడియా ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్‌విడియా మోడల్‌ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్‌విడియా తమ హాపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment