
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నట్లు రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రకటించారు. భారతదేశంలో కృత్రిమ మేధ (AI), డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండడంతో రిలయన్స్ ఈ ప్రకటన చేయడం టెక్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా ఆధారిత టెక్ కంపెనీ ఎన్విడియా సహకారంతో అత్యాధునిక బ్లాక్‌వెల్ ఏఐ ప్రాసెసర్లతో నడిచే ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
భారతదేశంలో కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అక్టోబర్ 2024లో రిలయన్స్, ఎన్విడియా మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు ఇరు సంస్థలు గతంలోనే ప్రకటించాయి. గతంలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్(AI Summit) 2024 సందర్భంగా సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఏఐ విభాగంలో ఇండియా సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. ‘భారతదేశం తన సొంత కృత్రిమ మేధను తయారు చేయడం పూర్తి అర్థవంతమైన చర్యగా భావిస్తున్నాం. స్థానికంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల డేటా భద్రత సవాళ్లు ఏర్పడవు’ అని హువాంగ్ అన్నారు. ఇండియాలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి కలిగిన ఏఐ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ ముఖేష్ అంబానీ ఈ చర్యలు చేపట్టడంతో టెక్ నిపుణుల దృష్టిని ఆకర్షించారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు ఏఐ చేదోడు
జామ్‌నగర్‌లో లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్‌తో(ఎల్‌ఎల్‌ఎం) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్‌లకు సహకారం, ఏఐ ప్రాజెక్టులు, ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధికి రూ.10,000 కోట్లకు పైగా కేటాయించాలని రిలయన్స్ నిర్ణయించింది. డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వేలాది హై-స్కిల్డ్ ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇండియాను ముందువరుసలో ఉంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. సుస్థిర ఇంధన వనరులకు పెద్దపీట వేసే రిలయన్స్ సోలార్, పవన, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో సహా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఈ డేటా సెంటర్‌కు అవసరమైన ఎనర్జీని సరఫరా చేస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment