ఏఐ వాడుతున్నవారు పదిలో ఏడుగురు
రాండ్‌స్టడ్ నివేదిక
కృత్రిమ మేధ(AI) అంతటా వ్యాపిస్తోంది. పని ప్రదేశాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాలతోపాటు దాదాపు ప్రతి విభాగంలోని ఆఫీసుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దీని సేవలు వినియోగిస్తున్నారు. ఇటీవల రాండ్‌స్టడ్(Randstad Report) వెల్లడించిన నివేదిక ప్రకారం 2024లో 10 మంది భారతీయ ఉద్యోగుల్లో ఏడుగురు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఉత్పాదకతను పెంచడానికి, వ్యాపార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఏఐపై ఆధారపడడం అధికమవుతుందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది.
ఐటీ సేవలు, ఆర్థిక సేవలు, విద్య, తయారీ సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,000 మంది ఉద్యోగులతో రాండ్‌స్టడ్ ఏఐ అండ్ ఈక్విటీ రిపోర్ట్ 2024 నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న 56% మంది తాము ప్రతిరోజూ కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఏఐ సాధనాలు వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేయడానికి, వాటిని సులభతరం చేయడానికి గణనీయంగా తోడ్పడుతున్నట్లు రాండ్‌స్టడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఉద్యోగ పునరుద్ధరణ, డేటా భద్రతపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను కూడా ఈ నివేదిక ఎత్తిచూపింది.
మిలీనియల్స్(1995 తర్వాత పుట్టినవారు), బూమర్లు(1970లో జన్మించినవారు) ఏఐ నైపుణ్యాలపై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. 37 శాతం మంది తమ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా భద్రత, గోప్యత కారణంగా పనిలో చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడాన్ని నిషేధించే విధానాలను తమ యాజమాన్యం అవలంబిస్తున్నట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి: రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి మరింత శిక్షణ అవసరమని చెబుతున్నారు. కృత్రిమ మేధ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు శ్రామిక శక్తి కూడా పెరిగేలా విధానాలు రావాలని నివేదిక ద్వారా తెలుస్తుంది. భవిష్యత్తులో కొత్తగా ఏ టెక్నాలజీ వస్తున్నా అది శ్రామిక శక్తిని తగ్గించేలా కాకుండా, ఉత్పాదకతను పెంచుతూ మరిన్ని ఉద్యోగాలు సృష్టించేలా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment