Randstad India
-
ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!
ముంబై: ఆతిథ్య రంగం నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీంతో వచ్చే కొన్నేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ఆతిథ్య పరిశ్రమలో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సామర్థ్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం నిపుణుల కొరతకు కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమవ్యాప్తంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరాయం 55–60 శాతంగా ఉంటుందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా డైరెక్టర్ సంజయ్ శెట్టి తెలిపారు. కరోనా విపత్తు తర్వాత పరిశ్రమలో బూమ్ (అధిక డిమాండ్) నెలకొందని, వచ్చే కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆతిథ్య పరిశ్రమలో నియామకాలు 4 రెట్లు పెరిగిన ట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరంభ స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. నిపుణుల అంతరాన్ని అధిగమించేందుకు ఆతిథ్య కంపెనీలు తమ సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు. పోటీతో కూడిన వేతనాలు ఆఫర్ చేస్తూ ఉన్న సిబ్బందిని కాపాడుకోవడంతోపాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘2023లో పర్యాటకం, ఆతిథ్య రంగం 11.1 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. 2024 చివరికి 11.8 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. ఈ డిమాండ్ 2028 నాటికి 14.8 మిలియన్లకు పెరగొచ్చు. ఏటా 16.5 శాతం వృద్ధికి ఇది సమానం’’అని టీమ్‌లీజ్ బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత వివరించారు. ప్రస్తుత సిబ్బంది, భవిష్యత్ మానవ వనరుల అవసరాల మధ్య ఎంతో అంతరం కనిపిస్తున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్, స్టాఫింగ్ బిజినెస్ హెడ్ ఎ.బాలసుబ్రమణియన్ సైతం తెలిపారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అప్రెంటిస్షిప్ల ద్వారా నిపుణుల కొరతను తీర్చుకునేందుకు ఈ టాస్‌్కఫోర్స్ కృషి చేస్తోంది. -
ఉద్యోగులు మెచ్చే సంస్థ ‘మైక్రోసాఫ్ట్’
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులు మెచ్చే అత్యంత ఆకర్షణీయ సంస్థగా (అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్) మైక్రోసాఫ్ట్ ఇండియా నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2022 ర్యాంకుల జాబితా విడుదలైంది. ఆర్థిక ఆరోగ్యం విషయంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చాలా ఎక్కువ స్కోరు సాధించింది. బలమైన పేరు, గుర్తింపు, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు.. ఈ మూడు అంశాలు మైక్రోసాఫ్ట్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపాయి. ఈ జాబితా లోని టాప్–10లో హ్యూలెట్ ప్యాకార్డ్ నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, శామ్సంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్ రీసెర్చ్ సర్వే కోసం 5,944 కంపెనీలకు చెందిన 1,63,000 మంది నుంచి (31 దేశాల వారు) అభిప్రాయాలు తెలుసుకున్నారు. కెరీర్లో పురోగతి కీలకం.. భారత్‌లో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 9 మంది (88%) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ పురోగతి తమకు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలా చెప్పిన ఉద్యోగులు 76%. 2021 చివరి ఆరు నెలల్లో భారత్‌లో 24% ఉద్యోగులు తమ కంపెనీని మార్చుకున్నారని రాండ్‌స్టాడ్ తెలిపింది. సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో పని–వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలన్స్ తమకు ముఖ్యమని 63% మంది తెలిపారు. -
ఈ ఏడాది అత్యధిక వేతనం వీరికే
న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక వేతనాలను ఐటీ ఫ్రొఫెషనల్స్ అందుకుంటున్నారని, ఐటీ సీటీ బెంగళూర్ అత్యధిక వేతనాలను చెల్లించే నగరంగా ముందుందనీ రాండ్‌స్టడ్ ఇన్సైట్ సాలరీ ట్రెండ్స్ (2019) నివేదిక వెల్లడించింది. బెంగళూర్‌లో జూనియర్ లెవెల్ టెకీకే సగటు వేతనం రూ 5.27 లక్షలు కాగా, మధ్యస్ధాయి ఐటీ ఫ్రొఫెషనల్స్‌కు రూ 16.45 లక్షలు, సీనియర్ లెవల్ టెకీకి రూ 35.45 లక్షల వార్షిక వేతనం ఉందని ఈ నివేదిక తెలిపింది. ఈ సంస్థ 2017, 2018లో వెల్లడించిన సాలరీ ట్రెండ్స్ నివేదికలోనూ బెంగళూర్ అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఎంట్రీలెవల్ టెకీకి అత్యధిక వేతనాల్లో హైదరాబాద్ (రూ 5 లక్షలు) ముంబై (రూ 4.59లక్షల) లు వరుసగా టాప్ టూ, టాప్ త్రీ స్ధానాల్లో నిలిచాయి. ఇక మధ్యస్ధాయి ఐటీ సిబ్బందికి వేతనాల విషయంలో ముంబై (రూ 15.07 లక్షలు) ఢిల్లీ ఎన్సీఆర్ (రూ 14.5 లక్షలు) లు ముందుండగా, సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో ముంబై (రూ 33.95 లక్షలు), పూణే (రూ 32.68లక్షలు) లు బెంగళూర్ తర్వాతి స్ధానాల్లో నిలిచాయని నివేదిక పేర్కొంది. అత్యధిక సగటు వార్షిక వేతనం విషయంలో కూడా ఐటీ రంగమే అగ్రభాగాన నిలిచిందని వెల్లడించింది. ఇక సీనియర్ ప్రొఫెషనల్స్‌లో రూ 35.65 లక్షల వార్షిక వేతనంతో డిజిటల్ మార్కెటర్లు అత్యధిక వేతనం అందుకుంటున్నారని తెలిపింది. క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వంటి నూతన టెక్నాలజీలతో ఈ ఏడాది ఐటీ రంగం మెరుగైన వృద్ధిని సాధించిందని పేర్కొంది. జీఎస్టీ రాకతో ఈ రంగంలో నిపుణులు, అకౌంటెంట్లు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, న్యాయవాదులకు డిమాండ్ పెరగడంతో వృత్తి నిపుణుల సేవల రంగం రెండో అతిపెద్ద వేతన చెల్లింపు రంగంగా నిలిచింది. ఎనిమిది నగరాల్లో విస్తరించిన 15 పరిశ్రమ విభాగాల్లో లక్ష ఉద్యోగాలను రాండ్‌స్టడ్ ఇన్సైట్స్ సాలరీ ట్రెండ్స్ నివేదిక విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించింది. -
వేతన చెల్లింపుల్లో ఈ నగరమే టాప్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఐటీ క్యాపిటల్‌గా పేరొందిన బెంగళూర్ అత్యధిక వార్షిక వేతనాలను ఆఫర్ చేయడంలో దేశంలోనే అగ్రస్ధానంలో నిలిచింది. అన్ని రంగాల్లోని వివిధ స్థాయిల ఉద్యోగులకు సగటున రూ 10.8 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తూ ముందువరుసలో నిలిచింది. ఇక పూణే రూ 10.3 లక్షల వార్షిక వేతనంతో రెండవ స్థానంలో నిలవగా, జాతీయ రాజధాని ప్రాంతం, ముంబయిలు రూ 9.9 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తూ తర్వాతి స్ధానాలను దక్కించుకున్నాయి. చెన్నైలో ప్రొఫెషనల్స్‌కు రూ 8 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తుండగా, హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్‌కు రూ 7.9 లక్షల వార్షిక వేతనం దక్కుతోంది. దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన కోల్‌కతాలో వృత్తినిపుణులకు సగటున ఏటా రూ 7.2 లక్షల వేతనం లభిస్తోంది. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో నైపుణ్యాలకు అధిక వేతనాలు దక్కుతున్నట్టు వెల్లడైంది. దాదాపు 20 పరిశ్రమల్లోని విభాగాలు, 15 క్యాటగిరీలకు చెందిన లక్ష ఉద్యోగాలను విశ్లేషించి రూపొందించిన రాండ్‌స్టాడ్ ఇన్సైట్ వేతన ధోరణులు-2018 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్ అత్యధిక వేతనాలు పొందుతున్నట్టు తెలిపింది. ఈ రంగంలోని వృత్తినిపుణులు సగటున అత్యధికంగా రూ 9.6 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు. వైద్య నిపుణులకు అత్యధిక వేతనాలు లభిస్తుండగా, జీఎస్టీ రాకతో సీఏలు, ఆడిటింగ్ నిపుణులకూ రూ 9.4 లక్షల వార్షిక వేతనం సగటున లభిస్తోంది. వైద్యం తర్వాత మేనేజ్మెంట్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఆడిటింగ్ నిపుణులు తర్వాతి స్ధానంలో నిలుస్తుండగా, ఐటీ రంగ నిపుణులకు సగటున రూ 9.1 లక్షల వార్షిక వేతనం దక్కుతోంది. మౌలిక, నిర్మాణ రంగాలు ఈ జాబితాలో వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో నిలిచాయి. -
బ్యాంక్ కొలువుల జాతర
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో వచ్చే 5-10 ఏళ్లలో 20 లక్షల కొత్త కొలువులు వస్తాయని నిపుణులంటున్నారు. కొత్త సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వనుండడం, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి భారత రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయనుండడం తదితర కారణాల వల్ల బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉద్యోగాలు భారీ స్థాయిలో వస్తాయని వారంటున్నారు. ఈ ఏడాది అత్యధిక ఉద్యోగాలిచ్చే రంగాల్లో బ్యాంకింగ్ కూడా ఒకటిగా నిలవనున్నది. ర్యాండ్‌స్టాడ్ ఇండియా మెరిట్‌ట్రాక్ సర్వీసెస్, మణిపాల్ అకాడెమీ ఫర్ బ్యాంకింగ్, మేరాజాబ్ ఇండియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం... {పభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు సగం సిబ్బంది సమీప భవిష్యత్తులో రిటైర్ కానున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించుకోవడం ఆయా బ్యాంకులకు తప్పనిసరి. దీంతో ఒక్క పీఎస్ బ్యాంకుల్లోనే 5-7 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగ విస్తరణ, నేరుగా నియామకాలు కారణంగా బ్యాంకింగ్ రంగంలో వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో కొలువులు వస్తాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే కొత్త బ్యాంక్ లెసైన్స్‌లను ఆర్బీఐ జారీ చేయనున్నది. దీంతో సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. {పస్తుతం భారత దేశ జనాభాలో కేవలం 30 శాతం కంటే తక్కువ మందికే బ్యాంక్ అకౌంట్లున్నాయి. గ్రామీణ మార్కెట్లలో బ్యాంకుల విస్తరణ వల్ల లాభదాయకత, వృద్ధి పెరుగుతాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థలు 60,000-70,000 ఉద్యోగాలివ్వగా, ప్రైవేట్ బ్యాంకులు 40 వేల వరకూ ఉద్యోగాలిచ్చాయి. ముంబై, చెన్నై, ఎన్సీఆర్ రీజియన్‌లో బ్యాంక్ కొలువులు ఎక్కువగా వచ్చాయి. చిన్న నగరాల్లో అధిక సంఖ్యలో బ్యాంక్ కొలువులు రానున్నాయి. బ్యాంకు ఉద్యోగుల ఉత్పాదకత పెరగ్గా, ఉద్యోగుల వలస తగ్గింది. క్లర్క్‌లు, ప్రారంభ స్థాయి ఆఫీసర్ల ఉద్యోగాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.