
ఉద్యోగుల మొదటి ప్రాధాన్యం వేతనానికే అనుకుంటాం. కానీ, అలా అనుకోవడం పొరపాటే అవుతుంది. వేతనం కంటే పనిచేసే చోట సానుకూల పరిస్థితులు, నేర్చుకునే, ఎదిగే అవకాశాలకు ఎక్కువ మంది ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాండ్‌స్టాడ్ నిర్వహించిన ‘ఇండియా వర్క్ మానిటర్ 2025’(Randstad Workmonitor 2025) సర్వేలో తెలిసింది. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పనిలో సౌలభ్యం లేకపోతే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెబుతామని 52 శాతం మంది చెప్పారు.
సౌకర్యవంతమైన పనివేళలు లేని ఉద్యోగాన్ని తిరస్కరిస్తామని 60 శాతం మంది తెలిపారు.
పనిచేసే ప్రదేశం అనుకూలంగా లేకపోతే ఆ ఉద్యోగాన్ని కాదనుకుంటామని 56 శాతం మంది చెప్పారు.
తమ మేనేజర్‌తో మంచి సంబంధాలు లేకపోతే ఉద్యోగాన్ని వీడుతామని 60 శాతం మంది తెలిపారు.
తాము చేసే ఉద్యోగంలో నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోతే దాన్ని వదులుకుంటామని 67 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా ఇదే అభిప్రాయం చెప్పిన వారు 41 శాతమే.
దేశీయంగా 69 శాతం మంది ఉద్యోగులు సమష్టి పని సంస్కృతిని కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా 55 శాతం మందిలో ఇదే భావన నెలకొంది.
తమ విలువలకు సరిపడని సంస్థలో పనిచేయబోమని 70% మంది తేల్చిచెప్పారు.
పనిలో ప్రయోజనాలుంటే (పనివేళల్లో, పని ప్రదేశాల్లో వెసులుబాట్లు) యాజమాన్యాలను విశ్వసిస్తామని 73 శాతం మంది సర్వేలో తమ
అభిప్రాయాన్ని తెలిపారు.
ఇదీ చదవండి: రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులు
యాజమాన్యాలు మారాల్సిందే..
పని ప్రదేశాల్లో వస్తున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నట్టు రాండ్‌స్టాడ్ సర్వే నివేదిక తెలిపింది. ‘జెన్ జెడ్ లేదా మిలీనియల్స్ అయినా వ్యక్తిగత కట్టుబాట్లు, కెరీర్ వృద్ధిని సమతుల్యం చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో (స్వేచ్ఛగా) పనిచేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటే, వారు కేవలం ఉద్యోగాలనే కోరుకోవడం లేదు. కెరీర్ పురోగతిని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. యాజమాన్యాలు ఈ మార్పును తప్పకుండా గుర్తించి, నిపుణులైన మానవ వనరుల అంచనాలను అందుకునే వ్యూహాలను రూపొందించుకోవాలి. లేదంటే నిపుణులను కోల్పోవాల్సి వస్తుంది’ అని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈవో విశ్వనాథ్ పీఎస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment